వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై ‘పచ్చమూక’ దాడి

కేసు నమోదు చేయని బత్తలపల్లి ఎస్‌ఐ

అనంత‌పురం: అనంత‌పురం జిల్లాలో అధికార పార్టీ నేత‌ల ఆగ‌డాలు రోజురోజుకు ఎక్కువ‌య్యాయి. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి బత్తలపల్లిలో చోటుచేసుకుంది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా బత్తలపల్లి కూడలిలో టీడీపీ వర్గీయులు, వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. అర్ధరాత్రి సమయంలో టీడీపీ వర్గీయులు కేక్‌ కట్‌ చేసి ‘జై పరిటాల’ అంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు కూడా కేక్‌ కట్‌ చేసి ‘జై జగన్‌’ అంటూ నినాదాలు చేశారు. ఇది విన్న టీడీపీ వర్గీయులు రెచ్చిపోయారు. ‘ఏరా మా ముందే జై జగన్‌’ అంటూ నినాదాలు చేస్తారా... అంటూ వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు గవ్వల రమేష్‌, ముసుగు అప్పస్వామి, కొంకా ప్రసాద్‌లపై దాడులకు పాల్పడ్డారు. ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న స్థానికుడు లోకేష్‌ నాయుడు ఇరువర్గాల వారికి సర్దిచెప్పేందుకు వెళ్లగా... ఆయనపైనా దాడి చేశారు. ఈ ఘటనలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు నలుగురూ గాయపడ్డారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఎస్‌ఐ సోమశేఖర్‌ ఇరువర్గాల వారికి సర్దిచెప్పి పంపారు. బుధవారం బాధితులు వైయ‌స్ఆర్‌సీపీ మండల ఉపాధ్యక్షుడు కోటి సురేష్‌తో కలిసి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా, కేసు నమోదు చేసుకోకపోవడం గమనార్హం.

Back to Top