అమరావతి : ఐటీడీపీ అనుచిత పోస్టుల వ్యవహారంపై వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని.. కేసులు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని ఆయన తన పిటిషన్‌లో న్యాయస్థానాన్ని కోరారు. ‘‘ఐటీడీపీ లో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు. మా పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డిని కించపరుస్తున్నారు. నాపై , నాకుటుంబ సభ్యులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేం ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు ఒక్క కేసు నమోదు చేయలేదు. మాపై వివక్ష ప్రదర్శిస్తున్నారు’’ అని అంబటి పిటిషన్‌లో పేర్కొన్నారు. తన పిటిషన్ ఆధారంగా.. కేసులు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలువ్వాలని పిటిషన్ ద్వారా అంబటి కోరారు. ఈ పిటిషన్‌పై స్వయంగా ఆయనే వాదనలు వినిపించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఐటీడీపీ, టీడీపీ అనుబంధ పేజీల్లో వైయస్ జగన్ పై, తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఆయన పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అయితే అటు నుంచి ఎలాంటి స్పందన ఉండడం లేదు. దీంతో తాజాగా ఆయన పట్టాభిపురం పీఎస్ వద్ద నిరసన తెలిపారు. అయితే న్యాయం చేయకపోగా.. అంబటిపైనే పోలీసులు తిరిగి కేసు నమోదు చేయడం గమనార్హం.