ఉద్యాన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

అధికారులు సమగ్రంగా పంట నష్టం అంచనా వేయండి

అరటి రైతుల ఆత్మహత్యాయత్నం బాధాకరం

బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి

అనంతపురం  :  ఈదురుగాలులతో జిల్లాలో పంటలు నష్టపోయిన ఉద్యాన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వైయ‌స్‌ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి కోరారు. తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల్లో ఈదురుగాలులతో అరటి, మొక్కజొన్న, దానిమ్మ, బొప్పాయి తదితర ఉద్యాన పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. అధికారిక సమాచారం మేరకే సుమారు రూ.35 కోట్లకు పైగా నష్టం జరిగిందని పేర్కొన్నారు. యల్లనూరు, పుట్లూరు, పెద్దవడుగూరు, యాడికి, శింగనమల  మండలాల పరిధిలో అరటి తోటలు దెబ్బతిన్నాయని తెలిపారు. పంట చేతికొచ్చే సమయంలో నేలకొరగడం బాధాకరమన్నారు. ప్రాథమిక అంచనా మేరకే శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల్లో సుమారు 1400 ఎకరాల్లో అరటి, బొప్పాయి, మామిడి పంట నష్టం జరిగిందన్నారు. అప్పులు చేసి పంటలు సాగు చేస్తే చేతికందాల్సిన పంట నేలనంటడంతో అన్నదాతల ఆవేదన అంతా ఇంతా కాదన్నారు.

ఫిబ్రవరిలో అరటి టన్ను రూ.25 వేల వరకు ఉంటే ప్రస్తుతం పూర్తిగా ధరలు పడిపోయాయని తెలిపారు. ఇలాంటి తరుణంలో పెట్టుబడులు కూడా దక్కే సూచనలు కనిపించడం లేదన్నారు. అధికార యంత్రాంగం అన్ని పంటలకు సంబంధించి సమగ్రంగా నష్టం అంచనా వేసి రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వానికి నివేదిక పంపాలని కోరారు. అదేవిధంగా అకాల వర్షాలు, వడగళ్ల వానతో పంట నష్టపోయి యల్లనూరు మండలం నీర్జంపల్లికి చెందిన అరటి రైతులు లక్ష్మినారాయణ, వెంగప్పలు ఆత్మహత్యకు యత్నించడం బాధాకరమని, ప్రభుత్వం రైతులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఎన్నికల సమయంలో పెట్టుబడి సాయంగా రూ.20 వేలు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం.. తీరా అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది పెట్టుబడి సాయం కూడా అందించలేదన్నారు. వైయ‌స్‌ఆర్‌సీపీ హయాంలో ఉచిత పంటల బీమా పథకం ఎంతో మంది రైతాంగాన్ని ఆదుకుందని, కానీ చంద్రబాబు ఈ పథకానికి మంగళం పాడారని గుర్తు చేశారు. ఏదిఏమైనా అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల పట్ల ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని కోరారు.

Back to Top