ప్రైవేటీకరణలో భాగంగానే ప్యాకేజీ ప్రకటన

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై బొత్స సత్యనారాయణ స్పష్టీకరణ

తాత్కాలికంగా ప్రలోభ పెట్టే కుట్రలో ఇది భాగం

కార్మికులు, ప్రజల్లో ప్యాకేజీపై అనుమానాలున్నాయి

ప్రైవేటీకరణ ఆగిపోయినట్టేనని ఎవరూ చెప్పడం లేదు

ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో చెప్పించాలి

మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌

తిరుపతి తొక్కిసలాట ఘటనపై హైకోర్టు సీజేకు లేఖ రాశాం

సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేయాలని కూడా కోరాం

ప్రెస్‌మీట్‌లో బొత్స సత్యనారాయణ వెల్లడి

విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే కుట్రలో భాగంగానే కేంద్రం ప్యాకేజీ ప్రకటించి తాత్కాలికంగా ప్రలోభ పెట్టాలని చూస్తున్నారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కూటమి పార్టీ నాయకులు సైతం ప్యాకేజీ గురించి మాట్లాడుతున్నారే తప్ప, ప్రైవేటీకరణ ఆగిపోయిందని చెప్పడం లేదని ఆయన గుర్తు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రితో చెప్పిస్తే, స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు, ఉద్యోగులతో పాటు, ప్రజల్లో ఉన్న అనుమానాలు తొలగిపోతాయని తేల్చి చెప్పారు. తిరుపతి తొక్కిసలాట ఘటనను సుమోటోగా స్వీకరించి విచారణ చేయాలని హైకోర్టుకు లేఖ రాసినట్టు విశాఖలో మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

ప్యాకేజీపై అనేక అనుమానాలు:
– స్టీల్‌ ప్లాంట్‌కి ప్రకటించిన ప్యాకేజీపై ఇప్పటికే చాలామంది మేథావులు, ఆర్థిక నిపుణులతో చర్చించడం జరిగింది. కానీ ఎవరూ ప్రైవేటీకరణ ఆగిపోయినట్టేనని చెప్పడం లేదు. 
– విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్రం ప్రకటించిన రూ.11,440 కోట్ల సాయంపై మాతోపాటు స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులకు చాలా అనుమానాలున్నాయని మళ్లీ చెబుతున్నాం. 
– ప్యాకేజీలో ఏదో మతలబు ఉంది. ప్రైవేటీకరణ చేసే క్రమంలో భాగంగానే ఈ ప్యాకేజీ ఇచ్చారని అనుమానంగా ఉంది. నాలుగు నెలలుగా ఉద్యోగులకు జీతాల్లేవు. ఇప్పుడు ప్రకటించిన సాయాన్ని ఉద్యోగుల జీతాల చెల్లింపులకు ఉపయోగించుకోవచ్చని కూడా ఎందుకు చెప్పడం లేదు.
– తాత్కాలికంగా ప్రలోభ పెట్టి ఈ ప్రాంత ప్రజలను మోసం చేసే కుట్రలో భాగంగానే ప్యాకేజీ ఇచ్చారనిపిస్తోంది. ప్లాంట్‌ విషయంలో కార్మికులు ఏ నిర్ణయం తీసుకున్నా వారికి వైయ‌స్ఆర్‌సీపీ మద్దతు ఇస్తుంది. 
– స్టీల్‌ ప్లాంట్‌ని సెయిల్‌లో విలీనం చేయాలని, ప్లాంట్‌కి క్యాపిటివ్‌ మైన్స్‌ కేటాయించాలని మొదట్నుంచి వైఎస్సార్సీపీ డిమాండ్‌ చేస్తోంది. 

అమిత్‌షాతో ప్రకటన చేయించాలి
– మొన్న జనవరి 8న ప్రధాని నరేంద్రమోదీ విశాఖలో పర్యటించినప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం.. అందరూ ఒకేవేదికపై ఉన్నప్పుడు, స్టీల్‌ ప్లాంట్‌ ప్యాకేజీని ప్రకటించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రైవేటీకరణ ఆగిపోయినట్టేనని కేంద్రం కానీ, సీఎం చంద్రబాబు కానీ ఎందుకు చెప్పలేకపోతున్నారు. 
– అందుకే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో ఆ ప్రకటన చేయించాలి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని ఆయనతో ఎందుకు చెప్పించలేకపోతున్నారు. 
– విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నాలుగేళ్లు ఆగిపోవడానికి నాటి సీఎం వైయ‌స్‌ జగనే కారణమని ప్యాకేజీ ప్రకటించే సమయంలో కేంద్ర మంత్రి కుమారస్వామి స్పష్టంగా చెప్పారు. 

తిరుపతి తొక్కిసలాటపై మరో లేఖ:
– తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో 6 మంది భక్తులు చనిపోవడానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని తొలిరోజు నుంచీ వైయ‌స్ఆర్‌సీపీ చెబుతోంది. 
– టీటీడీ వైఫల్యం, ప్రభుత్వ ప్రచార ఆర్భాటం కారణంగానే ఆరుగురి  నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని, దీన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ జరిపించాలని డిమాండ్‌ చేయడం కూడా జరిగింది. 
– సుమోటోగా తీసుకోవాలని కోరుతూ ఈ దుర్ఘటనపై పత్రికల్లో వచ్చిన కథనాలను సేకరించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇప్పటికే పంపించడం జరిగింది.
– అలాగే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కూడా విన్నవించాం. తిరుమల విషయంలో ప్రచార ఆర్భాటం ఉండొద్దనే ఆ లేఖను మీడియాకు విడుదల చేయలేదు. 

తొలిసారి టీటీడీపై కేంద్రం జోక్యం:
– తిరుపతి తొక్కిసలాట ఘటనతోపాటు తిరుమలలో జరుగుతున్న ఘటనలపై నివేదిక పంపాలని కేంద్ర హోంశాఖ టీటీడీని ఆదేశించింది. 
– నిజాలు నిగ్గు తేల్చేందుకు కేంద్ర హోంశాఖ అడిషనల్‌ సెక్రటరీని పంపుతున్నట్టు కేంద్రం సమాచారం కూడా ఇచ్చింది. టీటీడీ అంశాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం చరిత్రలో ఇదే మొదటిసారి.  
– అయితే శనివారం రాత్రి అమిత్‌షా తో జరిగిన డిన్నర్‌ మీటింగ్‌ను అడ్డం పెట్టుకుని ఆ విచారణ జరగకుండా చంద్రబాబు రద్దు చేయించారు. 
– కాగా, తిరుపతి తొక్కిసలాట ఘటన పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం కాదని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశమని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

Back to Top