వైయ‌స్ జగన్ ప్ర‌జాద‌రణ చూసి ఓర్వ‌లేక‌పోతున్నారు

వైయ‌స్ఆర్‌సీపీ  నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఫైర్‌
 

తాడేపల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న ఆద‌ర‌ణ చూసి కూట‌మి స‌ర్కార్ ఓర్వ‌లేక‌పోతోంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ  నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతులను కలిసేందుకు వైయ‌స్‌ జగన్ వెళ్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి? అంటూ మండిపడ్డారు. బుధవారం ఆయన తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వైయ‌స్ జగన్ వెళ్తే తప్ప రైతులను ఆదుకోవాలన్న ఆలోచన చంద్రబాబుకు ఎందుకు రాలేదంటూ నిలదీశారు. చంద్రబాబు ఏనాడైనా ప్రజల గురించి ఆలోచించారా? అని దుయ్యబట్టారు.

 వైయ‌స్ జగన్‌ కదిలితే తప్ప..:
    చంద్రబాబు అధికారంలో ఉండగా ఏరోజూ రైతుల బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదు. వైయస్‌ జగన్‌ గుంటూరు మిర్చి యార్డుకి వెళ్తే తప్ప, చంద్రబాబుకి మిర్చి రైతుల సమస్యలు గుర్తుకు రాలేదు. మిర్చి రైతులకు మద్ధతు ధర కల్పించాలంటూ ఆయన హడావుడిగా కేంద్ర మంత్రికి లేఖ రాశారు. మిర్చి రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకునేందుకే జగన్‌ గుంటూరు మిర్చి యార్డు సందర్శించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మిర్చి రైతులకు న్యాయం చేయడానికే ఆయన అక్కడ పర్యటించారు.
    
భద్రత కల్పించలేదు:
    రైతులను పరామర్శించడానికి వైయస్‌ జగన్‌ వెళితే, యార్డు వద్ద కావాలనే రక్షణ వలయం ఏర్పాటు చేయలేదని మిర్చి రైతులే చెబుతున్నారు. జెడ్‌ ప్లస్‌ కేటగిరి భద్రత కలిగి ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ రైతులతో మాట్లాడటానికి వస్తుంటే భద్రత కల్పించాల్సిన పోలీసులు ఎక్కడా కనిపించకపోవడం దేనికి నిదర్శనం?. అసలు జగన్‌  రైతులతో మాట్లాడితే, చంద్రబాబుకి వచ్చిన ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదు. చంద్రబాబు వ్యవహారశైలిపై ప్రజలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా..:
    టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసులను కూడా పార్టీ కార్యకర్తలను చూసినట్లే చూస్తున్నారు. పొలీస్‌ వ్యవస్థను పార్టీల పరంగా విడకొట్టే విష సంస్కృతికి చంద్రబాబు తెర తీశారు. పోలీస్‌ వ్యవస్థ వేధింపుల గురించి హైకోర్టు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నా చంద్రబాబుకి చీమ కుట్టినట్లు అయినా లేదు.  

పాలనలో చంద్రబాబు విఫలం:
    9 నెలల్లోనే పాలనలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. కూటమిలో కీలక భాగస్వామిగా ఉండి కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు తెచ్చుకోవడం ఆయనకు చేతకావడం లేదు. చంద్రబాబు ప్రతీకార రాజకీయాలు, కక్షపూరిత పాలన పుణ్యమా అని రాష్ట్ర ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది.
    ప్రతి మంగళవారం అప్పులు చేయడం తప్ప, 9 నెలల కాలంలో చంద్రబాబు నెరవేర్చిన హామీ ఒక్కటైనా ఉంటే చూపించాలి. ప్రజా సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టకుండా ఎప్పటికప్పుడు ౖడైవర్షన్‌ పాలిటిక్స్‌తోనే కాలం గడుపుతున్నారు. విపక్ష వైయస్సార్‌సీపీ నాయకుల మీద కేసులు బనాయించడం మినహా, చంద్రబాబు పాలనలో ప్రజలకు జరిగిన మేలు శూన్యం అని మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ స్పష్టం చేశారు.
 

Back to Top