బాబు, బాలకృష్ణల మధ్య తేడా ఆ సర్టిఫికెటే..
మున్సిపల్ ఎన్నికల్లో గొప్ప విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు
జీవీఎంసీ పీఠాన్ని అందించిన విశాఖ ప్రజలకు ధన్యవాదాలు
సీఎం వైయస్ జగన్ సంక్షేమ పాలనకు ప్రజలు పట్టంకట్టారు
మూడు రాజధానులకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రెఫరెండం
వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్
విశాఖ: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ, అభివృద్ధి పాలనకు మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలే నిదర్శనమని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గొప్ప విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజానీకానికి వైయస్‌ఆర్ సీపీ, సీఎం వైయస్ జగన్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. జీవీఎంసీ పీఠాన్ని వైయస్‌ఆర్ సీపీకి అందించిన గ్రేటర్ విశాఖ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మూడు రాజధానులకు మున్సిపల్ ఎన్నికలు రెఫరెండం అని మాట్లాడిన చంద్రబాబు.. ఫలితాలు వచ్చిన తరువాత ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు, బాలకృష్ణకు మధ్య ఉన్న తేడా ఒక్కటేనని, బావమరిదికి సర్టిఫికేట్ ఉంది.. బావకు సర్టిఫికేట్ లేదు అదొక్కటే తేడా.. ఏ సర్టిఫికెటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ చురకలంటించారు.
విశాఖ వైయస్‌ఆర్ సీపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. ‘రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఒక ఎత్తు.. గ్రేటర్ విశాఖ ఎన్నికలు ఒకెత్తు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత 13 జిల్లాల్లో అతిపెద్ద కార్పొరేషన్‌గా ఉన్న గ్రేటర్ విశాఖ 8 నియోజకవర్గాల పరిధిలో 18 లక్షల మంది ఓటర్లను కలిగి ఉంది. కార్పొరేషన్ ఎన్నికలో టీడీపీకే ప్రజలు ఓటు వేస్తారనే భ్రమతో చంద్రబాబు... రెండు రోజులు విశాఖలో ప్రచారం నిర్వహించాడు. తీరా ఫలితాలు వచ్చిన తరువాత మ్యాజిక్ ఫిగర్‌ను దాటి 58 సీట్లు వైయస్‌ఆర్ సీపీ గెలుచుకుంది. విశాఖ కార్పొరేషన్ గెలుపునకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ నాయకత్వంలో కర్త, కర్మ, క్రియగా ఎంపీ నేతృత్వంలో గొప్ప విజయాన్ని సాధించుకున్నాం.
విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించిన తరువాత వచ్చిన ఫలితం ఇది. పరిపాలన రాజధానిగా ప్రకటించిన వైయస్‌ఆర్ సీపీకి ప్రజల మద్దతు ఉంటుంది. ప్రజలంతా వైయస్‌ఆర్ సీపీకి అండగా నిలబడ్డారు. మూడు రాజధానులకు ఈ ఎన్నికలు రెఫరెండం అని చంద్రబాబు చెప్పిన మాటలు టీడీపీకి గుర్తుచేస్తున్నాం. విశాఖలోనే కాదు.. గుంటూరు కార్పొరేషన్‌లో 57 సీట్లు ఉంటే 44 సీట్లు వైయస్‌ఆర్ సీపీ గెలుచుకుంది. మూడు రాజధానులకే ప్రజలు మొగ్గుచూపుతున్నారని ఇప్పటికైనా చంద్రబాబుకు జ్ఞానోదయం అయినట్టేనా..?
ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్కడా కూడా మా అభ్యర్థులకు ఓటు వేయండి అని కోరలేదు. ప్రెస్‌మీట్ పెట్టలేదు. పిలుపు ఇవ్వలేదు. కానీ, ప్రజలు వైయస్ జగన్ చేసిన పనులకు, చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఈ రోజు ప్రజలు వారి తాలూకా కృతజ్ఞతలు చూపించి గొప్ప విజయాన్ని అందించారు. దాదాపు 2200 కౌన్సిలర్ సీట్లకు ఎన్నికలు జరిగితే.. దాదాపు 1800 గెలిచాం. 85 శాతం సీట్లు గెలుచుకున్నాం. పార్టీ గుర్తుపై జరగని పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అంతా తనవారే గెలిచారని సిగ్గులేకుండా ప్రకటించుకున్న చంద్రబాబు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తరువాత ఎందుకు మీడియా ముందుకు రాలేదు’ అని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ ప్రశ్నించారు.