అప్పులే చంద్ర‌బాబు సంపద సృష్టి

పవన్ క‌ళ్యాణ్‌కు అవగాహన లేదు 

మండ‌లి విప‌క్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

అమరావతి: ఎన్నికల ముందు చంద్రబాబు సంపద సృష్టిస్తామన్నారు కదా?. మరి ఇప్పుడు ఏమైంది మీ సంపద సృష్టి? అని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌, శాస‌న మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ  ప్ర‌శ్నించారు. అప్పులు చేయ‌డ‌మే చంద్ర‌బాబు సంపద సృష్టి అని ఎద్దేవా చేశారు. ఏపీ శాసనమండలి వేదికగా వాస్తవాలను వివరిస్తుంటే టీడీపీ వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు అస్సలు అవగాహన లేద‌ని విమ‌ర్శించారు. ప్రతిపక్ష హోదా మా హక్కు. సంఖ్యాపరంగా తమకే సీట్లు ఎక్కువ వచ్చాయని పవన్ అంటున్నారు. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు.. పవన్ కూటమి నుంచి బయటికి రావాల‌ని డిమాండ్‌ చేశారు. శుక్ర‌వారం అసెంబ్లీలో మీడియా పాయింట్‌ వద్ద ఎమ్మెల్సీ బొత్స మాట్లాడుతూ.. `బడ్జెట్ ప్రసంగంపై నేను మాట్లాడాను. మేము ప్రజల తరఫున మాట్లాడుతున్నాం. ప్రజల కోసం ప్రశ్నించాల్సిన బాధ్యత మాపై ఉంది కాబట్టే నిలదీస్తున్నాం. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలకు రూ.1500 ఇస్తామన్నారు. బడ్జెల్‌లో ఆ ప్రస్తావనే లేదు. ఉచిత బస్సు పథకానికి సంబంధించి కూడా బడ్జెట్‌లో ప్రస్తావన లేదు. ఎన్నికల ముందు చంద్రబాబు సంపద సృష్టిస్తామన్నారు కదా?. మరి ఇప్పుడు ఏమైంది మీ సంపద సృష్టి?. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీలపైనే మేము ప్రశ్నిస్తున్నాం.

వాస్తవాలు మాట్లాడితే తట్టుకోలేక పోతున్నారు..
రూ.322 కోట్ల బడ్జెట్ లోటు, విధ్వంసం అనే పదంపైన నేను అసెంబ్లీలో మాట్లాడాను. విద్యుత్ చార్జీలు పెంచమని, ట్రూ ఆఫ్ చార్జీలు వేయమని చెప్పారని తప్పులు మాట్లాడితే మాట్లాడానని చెప్పం. రూ.2400 కోట్లు ఉపాధి హామీ పథకం నిధుల బకాయిలు గురించి చెప్పం. వాస్తవాలు తట్టుకోలేక పోతున్నారు. సూపర్ సిక్స్‌ అమలు చేస్తామని అధికారంలోకి వచ్చారు. ప్రస్తుతం ఇస్తున్న పథకాల కంటే ఎక్కువ ఇవ్వలేమని మా నాయకులు వైయ‌స్‌ జగన్‌ ముందే చెప్పారు. ప్రస్తుతానికి సూపర్‌ సిక్స్‌లో ఒక్క ప‌థ‌కం మాత్ర‌మే అమలు చేస్తున్నారు.

మిగ‌తా సొమ్ము ఎక్క‌డి నుంచి తెస్తారు..?
తల్లికి వందనంకి రూ. 9400 కోట్లు పెట్టి.. డిమాండ్‌లో 8200 కోట్లు చూపించారు.. మరి మిగిలింది ఎక్కడ నుండి తెస్తారు. రైతు భరోసాకి 20వేల రూపాయలు కేంద్రం ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇస్తామని చెప్పారు.. అలా చూసినా రూ.6300 కోట్లు కేటాయించారు.. కావాల్సింది 7500 కోట్లు. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు.. అడిగితే  ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు. నిరుద్యోగ భృతి ఊసే బడ్జెట్ లేదు.. ఆడబిడ్డ నిధి లేదు. 50 ఏళ్లకు పెన్షన్‌ లేదు. బుల్డోజర్ ప్రభుత్వం.. మాట్లాడితే లాక్కొని వెళ్ళిపోతున్నారు. మహిళలకు ఉచిత బస్సు పెడితే ప్రభుత్వానికి 30 శాతం మాత్రమే భారం.. అది కూడా పెట్టలేకపోయారు.

1వ తేదీ జీతాలేవి..?
చిత్తశుద్ధి, కమిట్మెంట్, చేద్దామనే ఉద్దేశ్యం కూడా లేదు. 93వేల కోట్లు 10 నెలల కాలంలో అప్పులు చేశారు.. మార్క్‌ఫెడ్‌ నుండి 13వేల కోట్లు అప్పులు చేశారు. సత్యదూరమైన మాటలు, కించపరిచే మాటలు, ఏం మాట్లాడకపోయిన మధ్యలో ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. 25వేల కోట్లు బకాయిలు, ఐఆర్, పీఆర్సీ ఇస్తామని చెప్పారు.. ఒక్కటీ అమలు చేయలేదు. జీతాలు కూడా ఒకటో తేదీన పడడం లేదు. సంపద సృష్టి చేస్తామని ఎక్కడ చేస్తున్నారు.

మేం ప్రశ్నిస్తూనే ఉంటాం..
చెత్తపన్ను రద్దు చేశారు.. కానీ చెత్త ఎత్తడం లేదు. 80 వేల టన్నులు చెత్త పేరుకుపోయింది. రైతుల సమస్యలపై మాట్లాడితే భరించే పరిస్థితి లేదు. కూటమి సభ్యుల మాదిరిగా అనుకూలంగా మాట్లాడాలి.. భజన చేయాలి అనుకొంటున్నారు. సభలో జరిగిన తీరును ఖండిస్తున్నాం. ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికి మేము ఉండాలి. కోటి 15లక్షల లబ్ధిదారులు ఉంటే 85 లక్షల మందికి కేటాయించారు. వాళ్ళు చెప్పిన అప్పులు అన్ని కూడా కూటమి ప్రభుత్వం లో చేసిందే. మా ప్రభుత్వ హయంలో 59వేల కోట్లు అత్యధికంగా చేసింది. పది నెలల కాలంలో లక్ష కోట్లు అప్పులు చేశారు. మేము విధ్వంసం చేస్తే అప్పు ఎలా పుట్టింది?. ప్రజల తరఫున మేము ప్రశ్నిస్తూనే ఉంటాం.. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీలపైనే మేము ప్రశ్నిస్తున్నాం’ అని తెలిపారు. 
 

Back to Top