కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం

గురజాడ పేరు ప్రస్తావన తప్ప ఒరిగింది శూన్యం

మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ధ్వజం

విశాఖపట్నంలోని క్యాంప్‌ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ.

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారు

బడ్జెట్‌ నిధుల కేటాయింపులో స్పష్టమైంది

అదే జరిగితే ఉత్తరాంధ్ర, రాయలసీమకు తీవ్ర నష్టం

అయినా చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ స్వాగతించడం దారుణం

మండలి విపక్షనేత బొత్స ఆగ్రహం

16 మంది ఎంపీల మద్దతిచ్చి చంద్రబాబు సాధించిందేంటి?

12 మంది ఎంపీలతోనే బడ్జెట్‌లో బీహార్‌కు భారీగా లబ్ధి 

చంద్రబాబు అసమర్థత మరోసారి బట్టబయలైంది 

పోర్టుల నిర్మాణానికి ఒక్క రూపాయి తేలేకపోయారు

మెడికల్‌ కాలేజీల సేఫ్‌ క్లోజ్‌తో ఎంతో నష్టపోతున్నాం

గుర్తు చేసిన బొత్స సత్యనారాయణ

సూపర్‌ సిక్స్‌ పేరుతో ప్రజలను వంచించారు

మొదటి ఏడాది ఇవ్వాల్సిన పథకాలన్నీ ఎగ్గొట్టేసినట్టే 

చంద్రబాబు మోసం చేస్తాడని జగన్‌ చెబుతూనే ఉన్నారు

కూటమి పాలన మోసాలన్నీ ప్రజలకు అర్థమయ్యాయి

ప్రెస్‌మీట్‌లో బొత్స సత్యనారాయణ స్పష్టీకరణ

విశాఖపట్నం:    ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని, ఒక్క గురజాడ పేరు ప్రస్తావన తప్ప రాష్ట్రానికి ఒరిగింది శూన్యం అని శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారన్న ఆయన, అది బడ్జెట్‌ నిధుల కేటాయింపులో స్పష్టమైందని చెప్పారు. అదే జరిగితే ఉత్తరాంధ్ర, రాయలసీమకు తీవ్ర నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. అయినా సీఎం చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ స్వాగతించడం దారుణమని చెప్పారు.
    ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ, 16 మంది ఎంపీల మద్దతిచ్చి చంద్రబాబు సాధించిందేంటి? అన్న బొత్స, 12 మంది ఎంపీలతోనే బడ్జెట్‌లో బీహార్‌కి భారీగా లబ్ధి పొందారని గుర్తు చేశారు. చంద్రబాబు అసమర్థత మరోసారి బట్టబయలైందన్న ఆయన, పోర్టుల నిర్మాణానికి కూడా ఒక్క రూపాయి తేలేకపోయారని తెలిపారు. ఇంకా మెడికల్‌ కాలేజీల సేఫ్‌ క్లోజ్‌తో ఎంతో నష్టపోతున్నామని విశాఖలో మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు.

బడ్జెట్‌లో తీరని అన్యాయం:
    కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. కేటాయింపులు ఏ మాత్రం సరిగ్గా లేవు. 16 మంది ఎంపీల మద్దతిచ్చినా బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వకుండా పక్కన పెట్టడం చూస్తుంటే.. కూటమి మేనిఫెస్టో విడుదల సందర్భంగా బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి మేనిఫెస్టోను ముట్టుకోకుండా పక్కకు జరిగిన సంఘటన గుర్తొస్తోంది. బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరుగుతున్నా కూటమిలో ఉన్న చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ స్పందించకపోవడం, పైగా కేంద్ర బడ్జెట్‌ను స్వాగతించడం చూస్తుంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. 

పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు:
    పోలవరం పూర్తి కావడానికి నిధులు కేటాయించామని చెప్పినందుకు సంతోషపడాలో పోలవరం ఎత్తు తగ్గించి బ్యారేజీగా మారుస్తున్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదు. పోలవరం ఎత్తు 41.15 మీటర్ల ఎత్తుకు కుదిస్తున్నట్టు బడ్జెట్‌ కేటాయింపులతో స్పష్టమైంది. అయితే పోలవరం ఎత్తు తగ్గుతున్నందుకు టీడీపీలో  ఏమాత్రం బాధ కనిపించడం లేదు. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే వెనుబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం  ఉంది. పోలవరం ఎత్తు తగ్గింపు విషయంపై కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ప్రజలకు సమాధానం చెప్పాలి. దీనిపై త్వరలోనే మేధావులు, నీటి పారుదల ప్రాజెక్టు నిపుణులతో మాట్లాడతాం.  
    రాష్ట్రానికి సుదీర్ఘమైన తీరప్రాంతం ఉన్న నేపథ్యంలో, సంపద సృష్టించేలా గత ప్రభుత్వంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్, 4 పోర్టుల నిర్మాణం మొదలుపెట్టి, పనులు వేగంగా కొనసాగించారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టులకు నిధులు తేవడంలో చంద్రబాబు దారుణంగా విఫలమయ్యారు.  

మెడికల్‌ కాలేజీల సేఫ్‌ క్లోజ్‌ అనాలోచిత నిర్ణయం:
    వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో మొత్తం 17 మెడికల్‌ కాలేజీల పనులు మొదలు పెట్టగా, వాటిలో గత ఏడాది నాటికే 5 కాలేజీలు పూర్తి చేసి అడ్మిషన్లు కూడా జరిగాయి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పీ–3 పేరుతో ప్రైవేటుకు కట్టబెట్టేందుకు సేఫ్‌ క్లోజ్‌ చేసింది. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం కారణంగా మన రాష్ట్ర విద్యార్థులు 2450 మెడికల్‌ సీట్లు కోల్పోవాల్సి వస్తోంది.
    రాబోయే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 75 వేల మెడికల్‌ సీట్లు అందుబాటులోకి తేవాలన్న నిర్ణయాన్ని కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారు. అందులో భాగంగా ఈ ఏడాది 10 వేల మెడికల్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. వైఎస్‌ జగన్‌ ప్రారంభించిన మెడికల్‌ కాలేజీలను పూర్తి చేసి ఉంటే మన రాష్ట్ర విద్యార్థులకు భారీగా లబ్ధి జరిగి ఉండేది. కానీ చంద్రబాబు సేఫ్‌ క్లోజ్‌ చేసి డాక్టర్‌ కావాలని ఆశలు పెట్టుకున్న తెలివైన పేద విద్యార్థులకు తీరని ద్రోహం చేశాడు. 

ఇక్కడి విద్యా సంస్కరణలే అంతటా..:
    దేశమంతా ప్రైమరీ, సెకండరీ పాఠశాలల్లో బ్రాడ్‌ బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సౌకర్యంతోపాటు డిజిటల్‌ క్లాస్‌లు తీసుకురావాలని కేంద్రం సంకల్పించింది. జగన్‌గారు తన పాలనలో ఇదే ఆలోచన చేసి, చాలా వాటిని కార్యరూపంలోకి తీసుకొచ్చారు. మన పిల్లలు ప్రపంచ పోటీ తట్టుకునేలా వారిని తీర్చిదిద్దడం కోసం విద్యా రంగంలో ఆయన అనేక సంస్కరణలు అమలు చేశారు. 3వ తరగతి నుంచే టోఫెల్‌ శిక్షణ, ఇంగ్లిష్‌ మీడియమ్, క్లాస్‌రూమ్స్‌లో ఐఎఫ్‌పీ ప్యానల్స్, 8వ తరగతి విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లు అందజేస్తే.. వాటిపై ఇదే కూటమి పెద్దలు విమర్శలు గుప్పించారు. ఎల్లో మీడియాలో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ కథనాలు ప్రసారం చేశారు. 

సూపర్‌సిక్స్‌ పేరుతో వంచన:
    ఎన్నికల ముందు సూపర్‌సిక్స్‌ పేరుతో హామీలు గుప్పించి, ప్రజలను నమ్మించిన సీఎం చంద్రబాబు, ఇప్పుడు వాటిని అమలు చేయకుండా అందరినీ వంచిస్తున్నారు. తనకు సంపద సృష్టించడం తెలుసని, అందుకే అన్ని పథకాలు కచ్చితంగా అమలు చేస్తామని ఆనాడ నమ్మబలికిన చంద్రబాబు, ఇప్పుడు చేతులెత్తేసి, సంపద సృష్టికి సలహా కోరుతున్నారు.
    చంద్రబాబుని నమ్మితే కొండచిలువ నోట్లో తల పెట్టడమేనని ఎన్నికల ముందు జగన్‌గారు చాలాసార్లు చెప్పారు. అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తారని కూడా అన్నారు. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. ఏ హామీ అమలు చేయని చంద్రబాబు, ఏవేవో కారణాలు చెబతూ, రోజూ గత మా ప్రభుత్వాన్ని నిందిస్తూ, అన్నింటికి మమ్మల్నే బాధ్యులను చేస్తూ, కాలం వెళ్లదీస్తున్నారు. 

మీడియా ప్రశ్నలకు సమాధానంగా..
    రాజకీయాలకు స్వస్తి పలకడం అనేది అనేది విజయసాయిరెడ్డి గారి వ్యక్తిగత నిర్ణయం. కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులందరికీ మా ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. 
    విశాఖలో ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన బల్క్‌ డ్రగ్‌ పార్క్, గ్రీన్‌ హైడ్రోజన్, విశాఖ రైల్వే జోన్‌ ప్రాజెక్టులు వైఎస్‌ జగన్‌ హయాంలో వచ్చినవే. ఆయా ప్రాజెక్టులు రూపుదాల్చడం కోసం ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. సొమ్మొకడిది సోకొకడిది అన్నట్టు మేం తెచ్చిన ప్రాజెక్టులను వారి గొప్పతనంగా చంద్రబాబు చెప్పుకుంటున్నారు. మేం అధికారంలో వచ్చి ఉంటే విశాఖ రైల్వే జోన్‌తోపాటు డివిజన్‌ కూడా సాధించే వాళ్లం.  
    జగన్‌గారు చిత్తశుద్ధితో కృషి చేయడం వల్లనే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆగిపోయింది. ఇదే విషయాన్ని ప్లాంట్‌కు రూ.11 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన సందర్భంగా ఉక్కు శాఖ మంత్రి వెల్లడించారు. ఇప్పటికీ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై తమకు అనుమానం ఉందని.. అందుకు కారణం.. దానిపై కేంద్రం స్పష్టంగా ప్రకటన చేయకపోవడమే అని బొత్స సత్యనారాయణ వివరించారు.

Back to Top