తిరుమల లడ్డూ అంశంపై చర్చకు అనుమతి ఇవ్వాలి

అసెంబ్లీ గేటు ముందు వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీల నిరసన

అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదం అంశంపై సభలో పూర్తి స్థాయి చర్చకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు అసెంబ్లీ గేటు ముందు నిరసనకు దిగారు. ప్రజల విశ్వాసాలకు సంబంధించిన అంశం కావడంతో పారదర్శకంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు మాట్లాడుతూ, తిరుమల లడ్డూ విషయంపై వాయిదా తీర్మానం ఇచ్చినా ప్రభుత్వం చర్చకు ముందుకు రావడం లేదని విమర్శించారు. చర్చకు సిద్ధమని చెప్పి చివరికి సభను వాయిదా వేయించడం సరైంది కాదన్నారు. సభలో ఈ అంశంపై ఇప్పటికే చర్చ ప్రారంభమైన నేపథ్యంలో దాన్ని కొనసాగించాల్సిందిగా కోరారు. ప్రభుత్వం సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటోందని ఆరోపించారు. ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడానికి, వాస్తవాలను వెల్లడించడానికి చర్చ అవసరమని స్పష్టం చేశారు. 
అసెంబ్లీ గేటు వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేసిన ఎమ్మెల్సీలు, చర్చకు అనుమతి ఇచ్చే వరకు తమ నిరసన కొనసాగుతుందని హెచ్చరించారు. తిరుమల లడ్డూ వంటి పవిత్ర ప్రసాదానికి సంబంధించిన అంశాన్ని రాజకీయంగా కాకుండా బాధ్యతాయుతంగా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.
 

Back to Top