బాపట్ల: జాతీయ స్థాయిలో ఏ రాష్ట్రంలోనూ, ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టలేనటువంటి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ రధసారథిగా గుర్తింపు తెచ్చుకున్నారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ అన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి, నిర్లక్ష్యానికి గురైన అన్ని వర్గాలకు చేయూతను అందించాలనే లక్ష్యంతో, ధృడ సంకల్పంతో సహజవనరులను సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నంలో వరుసగా ఐదో ఏడాది వైయస్‌ఆర్ మత్స్యకార భరోసా సాయం విడుదల కార్యక్రమానికి ఎంపీ మోపిదేవి వెంకట రమణ హాజరై మాట్లాడారు. ‘రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నం గ్రామంలో వైయస్‌ఆర్ మత్స్యకార భరోసా సాయం విడుదల చేసేందుకు వచ్చినందుకు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు. మనవతా దృక్పథంతో, పదిమంది పేదలకు సాయం చేయాలనే ఆలోచనతో సీఎం వైయస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల్లో మత్స్యకార భరోసా ఒకటి. కులవృత్తులను నమ్ముకొని సముద్రం మీద వేటకు వెళ్లే మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ సమయంలో ఆదుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే సాయాన్ని గతానికి పదిరెట్లు అదనంగా పెంచి సాయం చేస్తున్నారు. ఐదో ఏడాది మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించేందుకు నిజాంపట్నం వచ్చారు. దేశంలోనే అత్యధిక సముద్రతీర ప్రాంతం ఉన్న రెండో రాష్ట్రం ఏపీ. అవకాశం ఉన్న ప్రతీచోట మేజర్ ఫిషింగ్ హార్బర్లు, జెట్టీలు, ఎగుమతులు, దిగుమతులు చేసుకోవడానికి ఓడరేవుల నిర్మాణం చేపడుతున్నారు. ఆ దిశలో ఫేస్–1గా ఇప్పటికే జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఇప్పటికే సగం పనులు పూర్తిచేసుకొని ప్రారంభానికి సిద్ధం అవుతున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటిగ్రేటెడ్ ఆక్వాల్యాబ్, ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్, ఆక్వా హ్యాచరీస్‌ను రూ.188 కోట్లతో 278 ఎకరాల్లో నిర్మాణం చేపట్టేందుకు సీఎం వైయస్ జగన్ శంకుస్థాపన చేశారు. పవర్ సబ్సిడీ రూ.1.50 పైసలకు ఇవ్వడం వల్లే ఈ రోజు ఆక్వా రంగం నిలదొక్కుకుంటుంది. రేపల్లె నియోజకవర్గం కులవృత్తుల మీద ఆధారపడి జీవించే సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం. మత్స్యకారులు, గీత కార్మికులు, చేనేతలు ఉన్నారు. ఈ ప్రాంతాన్ని సీఎం వైయస్ జగన్ నాయకత్వంలో అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారని నమ్మకం ఉంది. రేపల్లెకు సంబంధించి.. నియోజకవర్గానికి సంబంధించి సాగు, తాగునీరు ఇబ్బందులు ఉన్నాయి. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో 9 లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తిచేసుకున్నాం. నిజాంపట్నం, అడవులదీవి, తుమ్మల ప్రాంతాలకు సాగునీరు ఇబ్బందులు ఉన్నాయి. లిఫ్ట్ ఇరిగేషన్ ఇవ్వాలని కోరుతున్నాం. తాగునీటికి సంబంధించి కొన్ని ప్రాజెక్టులు మంజూరయ్యాయి. వీటితో పాటు రహదారుల నిర్మాణానికి చెక్కవారిపల్లి వంతెన, ఈటీపీడ్రైవ్ నిజాంపట్నం వంతెనకు సంబంధించి నిధులు మంజూరు చేయాలి. రాజకీయం అంటే ఏంటో తెలియని నాకు.. రాజకీయ అక్షరాభ్యాసం చేసి వెన్నుదన్నుగా నిలబడి ఆనాడు మండల ప్రెసిడెంట్‌నుంచి మీ కరుణతో ఎవరూ ఊహించని విధంగా రేపల్లె నియోజకవర్గానికి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన నన్ను రాజ్యసభలో కూర్చోబెట్టిన ఖ్యాతీ సీఎం వైయస్ జగన్‌కే లభిస్తుంది.