ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై వైయ‌స్ఆర్‌సీపీ పోరుబాట

ప్రత్యేక కార్యాచరణ ప్ర‌క‌టించిన వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి
 
రైతుల సమస్యలు, కరెంటు ఛార్జీల మోత.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆందోళనలు

ఈనెల 11, 27, 2025 జనవరి 3న నిర‌స‌న కార్యక్రమాలు

ప్రభుత్వాన్ని నిలదీయడం.. వినతి పత్రాల సమర్పణ: వైయస్‌ జగన్‌ వెల్లడి

ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత

ఇంతటి వ్యతిరేకత ఎప్పుడూ, ఎక్కడా చూడలేదు 

సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌.. గాలికెగిరిపోయాయి

చెప్పిన అబద్దాలు, చేసిన మోసాలు ప్రజల్లో కోపంగా మారాయి

ఎక్కడికక్కడ ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. 

రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నీరు గారిపోయాయి

రైతులు, విద్యార్థులు, అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి

అయినా నిరసన వ్యక్తం చేసే పరిస్ధితి కూడా లేదు

ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారు

రాష్ట్రమంతటా భయాందోళనలు నెలకొన్నాయి

ప్రభుత్వం కేసులు మ్యానుఫ్యాక్చరింగ్‌ చేస్తోంది

 ఎక్కడిక్కడ అవినీతి విచ్చలవిడిగా నడుస్తోంది

యథేచ్ఛగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది

మద్యం, ఇసుక, పేకాట క్లబ్బుల్లో అధికార పార్టీ బిజీ

గ్రామాల్లో బెల్టుషాపులకు బహిరంగ వేలం వేస్తున్నారు

ఎమ్మెల్యేలకు కప్పం కడితే తప్ప ఏ పని జరగదు

రౌడీ మామూళ్ల కోసం గొడవలు జరుగుతున్నాయి

ఆరునెలల్లోనే రాష్ట్రంలో దారుణ రాక్షస పాలన

గుర్తు చేసిన వైయస్‌ జగన్‌

ప్రజలకు అండగా నిలబడాల్సిన సమయం ఇది

వారి తరపున అందరం పోరాటం చేయాలి

ప్రజా సమస్యలపై వైయస్సార్‌సీపీ ఉద్యమ బాట

మూడు ప్రధాన సమస్యలపై పార్టీ ఆందోళన

రైతులు, విద్యుత్‌ వినియోగదారులు..

ఫీజులు కట్టలేని పిల్లలకు బాసటగా ఆందోళన 

పార్టీ శ్రేణులకు వైయస్‌ జగన్‌ పిలుపు

తాడేపల్లి: రాష్ట్రంలో అన్ని వర్గాలను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వంపై పార్టీపరంగా పోరుబాటకు వైయ‌స్ఆర్‌సీపీ  అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు ఇచ్చారు.  కీలక అంశాలైన రైతుల సమస్యలు, కరెంటు ఛార్జీలు, ఫీజు రియింబర్స్‌మెంట్‌పై పోరుబాట కార్యాచరణను ప్రకటించారు. బుధవారం తాడేపల్లిలోని తన కార్యాల‌యంలో.. జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, రీజినల్‌ కోఆర్డినేటర్లతో వైయ‌స్‌ జగన్‌ సమావేమ‌య్యారు. పలు అంశాలపై సుదీర్ఘంగా చ‌ర్చించి కార్యాచరణ ప్రణాళిక ఖరారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశలో చర్యలపై సమావేశంలో చర్చించారు.

వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..

కూటమి ప్రభుత్వంపై ఆరు నెలల్లోనే..:
    చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అయింది. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఎప్పూడూ చూడని విధంగా విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తోంది. 6 నెలల వ్యవధిలోనే ఇంతటి వ్యతిరేకత ఎప్పుడూ, ఎక్కడా చూడలేదు. ఎన్నికలప్పుడు చెప్పిన సూపర్‌సిక్స్, సూపర్‌సెవెన్‌ వాగ్దానాలు గాలికెగిరిపోయాయి. 
    వాటిని పక్కన పెట్టి మిగిలినవి చూస్తే.. చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలు ప్రజల్లో కోపం కింద మారి ఎక్కడికక్కడ వారు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. మరోవైపు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నీరు గారిపోయాయి. నానాటికీ అవి దిగజారి పోతున్నాయి. 

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేదు:
    ఒకవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చూస్తే మన ప్రభుత్వ హయాంలో ప్రతి క్వార్టర్‌ అయిపోయిన వెంటనే అంటే.. జనవరి, ఫిబ్రవరి–మార్చి క్వార్టర్‌ ముగిసిన వెంటనే ఏప్రిల్‌లో వెరిఫికేషన్‌ చేసి మే నెలలో విడుదల చేసే వాళ్లం. అలాంటిది చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్‌లో ఇవ్వాల్సిన ఆ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వలేదు సరి కదా.. ఏకంగా మూడు త్రైమాసికాల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పెండింగ్‌లో పెట్టారు. ఈ డిసెంబరు గడిస్తే నాలుగు క్వార్టర్లు పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వని పరిస్థితి. జనవరి వస్తే ఏకంగా రూ.2800 కోట్లు, విద్యాదీవెన బకాయిలు కాగా.. వసతిదీవెనకూ రూ.1100 కోట్లు పెండింగ్‌ కలిపి, మొత్తం రూ.3,900 కోట్లు పెండింగ్‌ పెట్టారు. 
    మరోవైపు పిల్లలు కాలేజీలకు వెళ్తుంటే, ఫీజులు కడితే తప్ప కాలేజీలకు రావొద్దని చెబుతుఆన్నరు. దీంతో పిల్లలు చదువులు మానేసి పనులకు వెళ్తున్నారు.

ఆరోగ్యశ్రీకి అనారోగ్యం:
    ఆరోగ్య శ్రీ బకాయిలు కూడా అలాగే ఉన్నాయి. మార్చి నుంచి ఇంత వరకు నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు సంబంధించిన బకాయిలు ఇవ్వలేదు. మార్చి నుంచి నవంబరు వరకు దాదాపు 9 నెలలకు సుమారు రూ.2,400 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. నెట్‌వర్క్‌ ఆసుపత్రులు గొడవ చేస్తే ఏదో రూ.200 కోట్లు ఇచ్చారు. పేషెంట్లు ఆస్పత్రులకు వెళ్తే ఉచితంగా వైద్యం అందే పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ పూర్తిగా నీరుగారిపోతుంది. ఇంకా 108, 104 ఉద్యోగులకు సంబంధించి నాలుగు నెలలకు పెండింగ్‌. వాళ్లు సర్వీసు అందించే పరిస్థితి లేదు. 

ధాన్యం సేకరణ. ఎమ్మెస్పీ లేదు:
    ఎక్కడా ఏ జిల్లాలో కూడా రైతులకు ధాన్యం సేకరణలో కనీస మద్దతు ధరలు లభించడం లేదు. వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ–క్రాప్‌ చేసి, ఆర్బీకేల ఆధ్వర్యంలో కొనుగోలు చేసే వాళ్లం. ప్రతి రైతుకూ కనీస మద్దతు ధర వచ్చేది. ఇదొక్కటే కాకుండా జీఎల్‌టీ (గన్నీ బ్యాగ్స్, లేబర్, ట్రాన్స్‌పోర్ట్‌) ఛార్జీలు కూడా చెల్లించే వాళ్లం. జీఎల్‌టీ కింద ప్రతి రైతుకు, ప్రతి ఎకరాకు అదనంగా రూ.10 వేలు వచ్చే పరిస్థితి ఉండేది. ఇవాళ రైతులకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కూడా అందడం లేదు. 75 కేజీల బస్తా ఎమ్మెస్పీ రూ.1725 అయితే ఆ ధర ఎక్కడా ఇవ్వడం లేదు. కావాలనే ధాన్యం కొనుగోలు చేసే కార్యక్రమం నిలిపివేశారు. గత్యంతరం లేక రైతులు దళారీలు, రైస్‌ మిల్లర్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్లు రైతుల నుంచి రూ.300 నుంచి రూ.400 తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం సేకరణ చాలా అన్యాయమైన పరిస్థితుల్లో జరుగుతోంది. 
    మరోవైపు వర్షాలతో రైతులు పూర్తిగా దెబ్బ తిన్నారు. వర్షాల దెబ్బకు రైతులు కుదేలవుతున్నారు. ధాన్యం రంగు మారుతోంది, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 

కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు:
    కరెంటుకు సంబంధించి ఇప్పటికే రూ.6వేల కోట్ల బాదుడు మొదలైంది. మరో రూ.9 వేల కోట్ల బాదుడు వచ్చే నెల నుంచి ప్రారంభం అవుతుంది. కరెంటుకు సంబంధించి ఈ స్ధాయిలో రూ.15వేల కోట్లు బాదుడు అనేది భారతదేశ చరిత్రలో చంద్రబాబు తప్ప ఎవ్వరూ ఈ రకమైన కార్యక్రమం చేసి ఉండరు. 
    ఆరు నెలల్లోనే ఒకవైపున ఎవ్వరూ రోడ్డు మీదకు రాకూడని, ఎవ్వరూ నిరసన వ్యక్తం చేయకూడదని తప్పుడు కేసులు పెడుతున్నారు. సోషల్‌ మీడియా కార్యకర్తల నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధుల మీద కూడా తప్పుడు కేసులు పెడుతున్నారు. కేసులు మ్యానుఫ్యాక్చర్‌ చేసి, ఎవిడెన్సెస్‌ మ్యానుఫ్యాక్చర్‌ చేసి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఎప్పుడూ జరగలేదు. రాష్ట్రమంతా భయాందోళన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఆయన చేస్తున్న బాదుడు కార్యక్రమానికి ఎవ్వరూ రోడ్డు మీదకు రాకూడదని ఇలా చేస్తున్నారు. ఎవరైనా ఆందోళన చేయాలనుకుంటే కేసులు పెడతారేమోనని భయపడే పరిస్థితులు కల్పిస్తూ పోలీసులను ఉపయోగించుకున్నారు. అవినీతి విచ్చలవిడిగా నడుస్తోంది. యథేచ్ఛగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది.

ఇసుక. మద్యం మాఫియా:
    అధికారంలోకి వస్తే ఇసుక ఉచితంగా ఇస్తామన్నారు. కానీ, దాన్ని అమలు చేయడం లేదు. ఇప్పుడు ప్రభుత్వానికి పైసా ఆదాయం రాకపోగా మన ప్రభుత్వం కంటే డబుల్‌ రేట్లకు ఇసుక అమ్ముతున్నారు. నీకింత.. నాకింత అని.. చంద్రబాబు, లోకేష్‌ మొదలు ఎమ్మెల్యేలు పంచుకుంటున్నారు.
    గతంలో ప్రభుత్వం నడిపిన మద్యం షాపులను పూర్తిగా ఎత్తివేశారు. మొత్తం షాపులన్నింటినీ చంద్రబాబుగారు, ఆయన మనుషులు చేతిలోకి తీసుకున్నారు. దాని కోసం కిడ్నాప్‌లతో పాటు, పోలీసులతో బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. లాటరీలో ఎవరికైనా షాపులు వస్తే వారి దగ్గర నుంచి రాయించుకున్నారు. పైగా గ్రామంలో వీళ్లే వేలం పాటలు పెట్టి బెల్ట్‌షాప్‌లు ఇస్తున్నారు. ఈరోజు బెల్ట్‌షాప్‌లు లేని వీధి, గ్రామం లేదు. ఒక్కో బెల్ట్‌షాప్‌కు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వేలం పాట పెడుతున్నారు.
    ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి.
ఏ నియోజకవర్గంలో పరిశ్రమ నడుపుకోవాలన్నా, మైనింగ్‌ యాక్టివిటీ జరగాలన్నా, ఏది కావాలన్నా ఎమ్మెల్యేకు ఇంత కడితే తప్ప జరిగే పరిస్థితి లేదు. ప్రతి దానికీ కమీషన్లు ఇచ్చుకోవాల్సిందే. మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతున్నారు. ఎమ్మెల్యేలకు ఇంత, చంద్రబాబుకు ఇంత అని చెల్లించుకోవాల్సిందే. రౌడీ మామూళ్ల కోసం కూడా గొడవలు జరుగుతున్నాయి. నెల్లూరులో ఏకంగా క్వార్ట్‌›్జ గనులు కొట్టేయడానికి పక్కా ప్లాన్‌ చేశారు. 

కార్యాచరణ అమలు చేయాల్సిన అవసరం:
    కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో కోపం ఈరోజు తీవ్రస్ధాయిలో కనిపిస్తోంది. మనం కూడా ప్రజల తరఫున గళం విప్పాల్సిన సమయం వచ్చింది. అనుకున్న దానికంటే ముందుగానే ఆ సమయం వచ్చింది. మామూలుగా ఏడాది వరకు వేచి చూసే పరిస్థితి నుంచి.. ఆరు నెలలకే అలాంటి పరిస్థితి తలెత్తింది. 
కరెంటు ఛార్జీలు పెంపు, ధాన్యం సేకరణలో దళారీల రాజ్యం, మద్దతు ధర దక్కకపోవడం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అంశాలు ప్రజలను ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాయి.
    మీ మీ నియోజకవర్గాల్లో జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే అభ్యర్ధులు, సమన్వయకర్తలతో కలిసి వారిని ఇన్వాల్వ్‌ చేస్తూ, కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అవసరం అయినప్పుడు మనం వారి తరపున వాయిస్‌ ఇవ్వగలగాలి. అటువైపు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నప్పుడు మనం వారికి దగ్గరగా ఉంటూ వారి తరపున పోరాటం చేయాలి. వారి తరపున నిలబడాలి. ప్రతి ఎమ్మెల్యే అభ్యర్ది ఇది కచ్చితంగా చేయాలి.

మూడు ప్రధాన అంశాలు:
    ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి ముఖ్యంగా మూడు ప్రధానమైన అంశాలు.. రైతుల ఇబ్బందులు, కరెంటు ఛార్జీల బాదుడే బాదుడు, ఫీజులు కట్టలేని పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల మీద వైయస్సార్సీపీ ఉద్యమ బాట పట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.

ఇదీ ఆ కార్యాచరణ:
    ఇందులో భాగంగా డిసెంబరు 11న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్ల కార్యాలయాల వద్ద అన్ని జిల్లాల్లో వైయ‌స్ఆర్‌సీపీ  రైతులకు తరపున వారికి సంబంధించిన ప్రదాన అంశాలైన ధాన్యం సేకరణలో వారికి జరుగుతున్న అన్యాయంపై నిలదీస్తూ..  ధాన్యం సేకరణలో వారికి కనీస మద్ధతు ధర కల్పించాలని డిమాండ్‌ చేయడంతో పాటు, పెట్టుబడి సాయం కింద ఇస్తామన్న రూ.20వేల ఇవ్వాలని డిమాండ్‌ చేయడం, వీటితో పాటు ఇప్పటివరకు రైతులకు అందుతున్న ఉచిత పంటల బీమాను రైతులకు వర్తింప జేయాలన్న డిమాండ్‌ తో రైతులతో కలిసి ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం చేస్తుంది.
    
చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న కరెంటు ఛార్జీల బాదుడే బాదుడు కార్యక్రమానికి నిరసనగా డిసెంబరు 27న ఆందోళన. ఎన్నికలప్పుడు తాను కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని ఇచ్చిన హామీని విస్మరించిన నేపథ్యంలో పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించమని.. జనవరిలో పెంచబోయే కరెంటు ఛార్జీలు కూడా తగ్గించమని వైయస్సార్సీపీ డిమాండ్‌ చేస్తోంది. ఇప్పటికే రూ.6వేల కోట్ల బాదుడుతో పాటు, రానున్న నెలలో మరో రూ.9వేల కోట్ల ఛార్జీల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని డిమాండ్‌ చేస్తూ జిల్లాల్లో ఎస్‌ఈ కార్యాలయాలతో పాటు, సీఎండీ కార్యాలయాల వద్ద ప్రజల తరపున, ప్రజలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించమని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ, వినతి పత్రం ఇచ్చి, ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేయబోతున్నాం.
    
జనవరి 3న అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆందోళన చేపట్టబోతున్నాం. పిల్లలకు అందించాల్సిన పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, పిల్లలకు అందించాల్సిన వసతి దీవెన దాదాపు రూ.3900 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేయబోతున్నాం. ఇప్పటి వరకు ఏడాది అంటే నాలుగు త్రైమాసికాలకు సంబంధించిన ఫీజులు పెండింగ్‌లో ఉన్న వాటిని చెల్లించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. చదువుకుంటున్న పిల్లలకు తోడుగా నిలబడే కార్యక్రమంలో భాగంగా పిల్లలతో కలిసి కలెక్టర్ల కార్యాలయాలకు వెళ్లి, వినతిపత్రాలు సమర్పించి, డిమాండ్‌ చేసే కార్యక్రమం చేయబోతున్నాం. 

జిల్లాల పర్యటన:
    సంక్రాంతి తర్వాత నా జిల్లాల పర్యటన కార్యక్రమం మొదలవుతుంది. ప్రతి బుధవారం, గురువారం పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశం అవుతాను. ‘జగనన్న.. పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం’ పేరుతో నేను పర్యటిస్తాను. నా పర్యటన వచ్చేసరికి మీరు జిల్లా, నియోజకవర్గ, మండల కమిటీల నియామకాలు పూర్తి చేయాలి. ప్రతి కార్యకర్తకు ఫేస్‌ బుక్‌ , ట్విట్టర్, యూట్యూబ్‌ అకౌంట్‌ ఉండాలి. జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి కార్యకర్త ప్రశ్నించాలి. అప్పుడే గ్రామస్దాయిలో తెలుస్తుంది.
    మా ఆస్పత్రులు ఎందుకు ఇలా ఉన్నాయి? మా స్కూళ్లు ఎందుకు ఇలా ఉన్నాయి? మా ధాన్యాన్ని ఎందుకు కనీస మద్ధతు ధరకు అమ్ముకోలేకపోతున్నామని ప్రశ్నించాలి.    
    రాబోయే రెండున్నర సంవత్సరాలు మనం, మన ఆర్గనైజేషన్‌ను పూర్తిగా మరింత బలోపేతం చేయాలి. ఆప్పుడే మనం చేయబోయే పోరాటాలకు ఆర్గనైజేషన్‌ మద్ధతు బలంగా ఉంటుంది. ఇదంతా పక్కాగా జరగాలంటే పార్టీ కమిటీల నియామకాల్లో పెండింగ్‌ ఉన్న జిల్లాల్లో దాన్ని  త్వరితగతిన పూర్తి చేయాలని వైయస్‌ జగన్‌ నిర్దేశించారు.

Back to Top