చిలకలూరిపేట: రాష్ట్రంలో అమలవుతున్న రెడ్‌బుక్ పాలనకు పరాకాష్టే తనపై బనాయించిన ఏసీబీ కేసులని మాజీ మంత్రి విడదల రజనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిలకలూరిపేటలోని క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగుదేశం ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు వ్యక్తిగత కక్షసాధింపుల్లో భాగంగానే తప్పుడు ఫిర్యాదులు చేసించి ఈ కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే కుమారుడే ఎస్పీగా ఉండటం వల్ల తనపై జరుపుతున్న విచారణ అంతా కూడా శ్రీకృష్ణదేవరాయలు డైరెక్షన్‌లోనే సాగుతోందని ధ్వజమెత్తారు. ఏసీబీ కేసులతో భయపెట్టాలనుకోవడం వారి అవివేకమని, వాటిని చూసి భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇంకా ఆమె ఏమన్నారంటే... కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి పది నెలలుగా నాపై రకరకాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులు చివరికి ఒక కట్టుకథను తయారు చేసి ఏసీబీ కేసు నమోదు చేశారు. నాపై ఫిర్యాదు చేసిన వ్యక్తిని గతంలో ఎక్కడా కలవలేదు, మాట్లాడలేదు. మా మధ్య ఎలాంటి లావాదేవీలు జరగలేదు. ఈ కేసుల నమోదుకు వెనకుండి నడిపించే డైరెక్టర్ మాత్రం టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. నాపై ఫిర్యాదు చేసిన వ్యక్తికి సంబంధించిన అక్రమ వ్యాపారాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చి ఇలా నాపై తప్పుడు కేసులు నమోదయ్యేందుకు కుట్ర చేశారు. శ్రీకృష్ణదేవరాయుల నిర్వాకంపై ఆనాడే అధిష్టానం మందలించింది వైయస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలో 2020, సెప్టెంబర్ 2న వైయస్ఆర్ వర్ధంతి కార్యక్రమం రోజున గురజాల సర్కిల్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న సీఐ, డీఎస్పీ ద్వారా ఎంపీగా ఉన్న కృష్ణదేవరాయలు నాతో పాటు మా కుటుంభ సభ్యులు, ఆఫీస్ స్టాఫ్‌కు సంబంధించిన సెల్‌ఫోన్లపై నిఘా పెట్టించారు. మా కాల్ రికార్డులు తెప్పించే ప్రయత్నాలు చేశాడు. కాల్ డేటా కోసం తప్పుడు ఫిర్యాదులతో కేసు పెట్టించి, ఎఫ్ఐఆర్ నమోదు చేయించాడు. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్ జగన్ గారి దృష్టికి తీసుకురాగానే ఆయన వాస్తవాలు తెలుసుకుని ఎంపీ శ్రీకృష్ణదేవరాయులను మందలించారు. పోలీస్ శాఖ కూడా చట్ట పరిధిని అతిక్రమించిన సీఐ, డీఎస్పీలపై శాఖపరంగా విచారించి సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి నాపై ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వ్యక్తిగత కక్షను పెంచుకున్నారు. ఒకేపార్టీలో ఉండటం వల్ల ఈ విషయాన్ని కూడా బయటకు వెళ్ళడించకుండా సంయమనం పాటించాను. ఎంపీ వ్యక్తిగత లెటర్‌హెడ్‌పై ఫిర్యాదు ప్రస్తుతం నాపై కేసు నమోదు చేయడం వెనుక కూడా టీడీపీ ఎంపి శ్రీకృష్ణ దేవరాయలు హస్తం ఉందని చెప్పడానికి ఆయన లెటర్ హెడ్ మీద నాపై చేసిన ఫిర్యాదు కాపీనే సాక్ష్యం. డీజీపీకి, హోంమంత్రికి, విజిలెన్స్, సీఐడీ, ఏసీబీకి కూడా నాపై వరుస ఫిర్యాదులు చేయించాడు. ఈ తప్పుడు ఆరోపణలపై ఎల్లో మీడియాలో కథనాలు రాయించారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు, ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావులు కలిసి చివరికి నాపైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, జర్మనీలో ఉంటున్న నా మరిదిని, వృద్దుడైన మా మామగారిని కూడా వదలకుండా తప్పుడు కేసులు నమోదు చేయించారు. తప్పుడు కేసులపై భయపడేది లేదు నన్ను బాధపెట్టి నా కళ్లల్లో కన్నీళ్లు చూడాలని వీరి తాపత్రయం. కానీ వారి కోరిక ఎప్పటికీ నెరవేరదు. నన్ను భయపెట్టడం వారి వల్లకాదు. విద్యావేత్తగా లావు రత్తయ్యపై గౌరవం ఉంది. ఆయన కుమారుడు తప్పు చేశాడు కాబట్టే ఈ విషయాలను ఇప్పుడు బయటపెడుతున్నాను. శ్రీకృష్ణదేవరాయులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కారుచౌకగా భూములను కాజేస్తున్నారు. గతంలో విశాఖలోనూ ఇలాగే భూదందా చేశారు. ప్రస్తుతం చెరువు భూములను కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ తప్పుడు కేసులపై న్యాయపోరాటం చేస్తాం. ఎక్స్ వేదికగా రజనీ.. మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్రలు వ్యక్తిత్వాన్ని హరించాలనే కుయుక్తులు ఒక మహిళ నైన నా పై అక్రమ కేసులు, విష ప్రచారాలే మీ లక్ష్యమైతే అలాంటి వంద కేసులను, వేయి ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కొడానికి నేను సిద్ధం నా ధైర్యం నా నిజాయితీ నా ధైర్యం నేను నమ్మే సత్యం, ధర్మం నేను ఎదురు చూస్తూ ఉంటా నిజం బయట పడ్డాక మీ ముఖాలు ఎలా ఉంటాయో చూడటానికి…..