రెండు ఓట్లు ఫ్యాన్‌ మీద వేస్తే వైయ‌స్ జగన్‌ మార్క్‌ పాలన  

పొరపాటు చేస్తే చంద్రముఖి నిద్ర లేచి మీ భవిష్యత్తు నాశనం చేస్తుంది

కాకినాడ స‌భ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

వైయ‌స్ జగన్‌ ద్వారా అందుతున్న పథకాలు ఇక ముందుకూడా అందాలా.. లేదా?

వైయ‌స్ఆర్‌సీపీకి ఓటేస్తే జగన్‌ మార్క్‌ సచివాలయాలు కొనసాగుతాయి

లేకుంటే చంద్రబాబు మార్క్‌ జన్మభూమి కమిటీలు మళ్లీ వస్తాయి

14 ఏళ్లలో బాబు చేసిన మంచి పని కూడా లేదు.

దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పడిన కూటమి కాదు

దత్తపుత్రుడికి జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్‌ పారిపోయాడు

బాబు సిట్‌ అంటే పవన్‌ సిట్‌.. స్టాండ్‌ అంటే పవన్‌ స్టాండ్‌

ప్యాకేజీ స్టార్‌కు పెళ్లిళ్లే కాదు.. నియయోజకవర్గాలు కూడా నాలుగు అయ్యాయి.

చంద్రబాబు తన సంకలోని పిల్లిని పిఠాపురంలో వదిలాడు

బీఫామ్‌ బీజేపీ, కాంగ్రెస్‌, గాజుగ్లాస్‌దే అయినా..యూనిఫామ్‌ మాత్రం చంద్రబాబుదే

రాష్ట్రాన్ని హోల్‌సేల్‌గా దోచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు.

బాబు పొడవమంటే పురందేశ్వరి తన తండ్రినే వెన్నుపోటు పొడిచింది.

నక్కలు, తోడేళ్లు కూటమిగా వస్తున్నాయి.

ఎవరు ఉంటే మీ ఇంటికి మంచి జరుగుతుందో ఆలోచించి ఓటేయండి

ఫ్యాన్‌కు ఓటేస్తే పథకాలు అన్నీ కొనసాగుతాయి.

కూటమికి ఓటేస్తే పథకాలన్నీ ముగిసిపోతాయి

మంచి చేసిన మీ బిడ్డ పాలన కావాలా?

పెత్తందారులతో  కలిసి దోచుకునే కూటమి కావాలా :  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

 కాకినాడ‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ కొనసాగుతాయని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ రద్దవుతాయని హెచ్చ‌రించారు. ఫ్యాన్‌కు ఓటేస్తే.. అవ్వతాతలకు రూ.3వేల పెన్షన్‌ వస్తుందని తెలిపారు. బాబుకు ఓటేస్తే జన్మభూమి కమిటీలతో దోచుకుంటారని విమర్శించారు. ఫ్యాన్‌కు ఓటేస్తే ఇంటింటికి పౌర సేవలు అందుతాయని పేర్కొన్నారు. బాబుకు ఓటేస్తే.. పసుపుపతి నిద్రలేచి వదలా బొమ్మాళి అంటాడని సీఎం వైయ‌స్ జగన్‌ మండిపడ్డారు.  ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 18వ రోజు తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా కాకినాడ అచ్చంపేట జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రసంగించారు.  

సీఎం వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..

 

ఉప్పొంగి సంద్రమైన అభిమాన గోదావరి.*

కాకినాడ రూరల్‌లో కాకినాడ జిల్లా సిద్ధం.. ఇక్కడ ఉప్పొంగి ప్రవహిస్తున్న నిండు గోదావరి ఇక్కడ కనిపిస్తోంది. ఇది ఓ మహాసముద్రంగా మారి అభిమాన వరద గోదావరి ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ మీలో 5 ఏళ్లుగా మనందరి ప్రభుత్వం మంచి చేసిందన్న నమ్మకం, ఆ మంచిని కాపాడుకోవాలన్న సంకల్పం ఈరోజు మీ అందరిలోనూ కనిపిస్తోంది. మీ అభిమానానికి, మీ నమ్మకానికి, ఈ సభకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ, నా అక్కలకు, నా చెల్లెమ్మలకు, నా అవ్వలకు, నా తాతలకు, నా ప్రతి సోదరుడికీ, నా ప్రతి స్నేహితుడికీ మీ అందరికీ ముందుగా మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులూ జోడించి పేరు పేరునా ముందుగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు. 

 

*మరోసారి జైత్రయాత్రకు సిద్ధం అంటూ సింహ గర్జన.*

ఎన్నికలకు కేవలం 25 రోజులే ఉన్నాయి. ఒకవైపున ఎన్నికల నోటిఫికేషన్ నగారా మోగింది. మరోవంక ప్రజలంతా కూడా, పేదలంతా కూడా మరోసారి జైత్రయాత్రకు సిద్ధం.. సిద్ధం అంటూ గర్జిస్తూ సింహ గర్జన చేస్తున్నారు. ఇంటింటి ఆత్మగౌరవాన్ని, పేద వర్గాల ఆత్మగౌరవాన్ని, అక్కచెల్లెమ్మల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్న మనందరి ప్రభుత్వానికి, మన వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు పలకడానికి మీరంతా కూడా సిద్ధమేనా? 

 

జన్మభూమి కమిటీలతో మొదలు చంద్రబాబు దాకా పెత్తందార్ల దోపిడీ వర్గానికి మన పేదల అనుకూల వర్గానికి ఈరోజు ఒక క్లాస్ వార్ జరుగుతోంది. ఈ యుద్ధంలో పేదల భవిష్యత్తు కోసం, ఈ పేదల వ్యతిరేక కూటమిని చిత్తుగా ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా? 

 

ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు. రాబోయే 5 ఏళ్లు అంటే రాబోయే 1825 రోజులు.. 60 నెలల పాటు మన బతుకులు ఎలా ఉంటాయి అని నిర్ణయించే మన ఓటు ద్వారా మనం ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం. ఆ వచ్చే ప్రభుత్వం మన తలరాతలు, మన బతుకులు మారుతాయి అన్నది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతున్నాను. 

 

*స్కీములు అందాలా? లేదా? అన్నది మీ ఓటు ద్వారా నిర్ణయం.*

వచ్చే 5 ఏళ్లు అంటే 60 నెలలు. ఈ కాలంలో మీకు ఈరోజు జగన్ ద్వారా అందుతున్న స్కీములు, ఈ పథకాలు ఇకమీదట కూడా అందాలా? లేక వాటి రద్దా? అన్నది మీ ఓటు మీదనే ఆధారపడి ఉంటుందన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. జగన్ కు ఓటు వేస్తే, ఫ్యాను మీద రెండు ఓట్లు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. లేదంటే పథకాలకు బాబు మార్క్ మోసాలతో పథకాలన్నీ కూడా ముగిసిపోతాయి. ఇదీ బాబు చెబుతున్న చరిత్ర. బాబును చూసిన ఏ ఒక్కరికైనా కూడా అర్థమయ్యే చరిత్ర. సాధ్యం కాని హామీలతో తాను ఇప్పటికే చెప్పిన, మోసాల మేనిఫెస్టో చెబుతున్న వాస్తవం. కచ్చితంగా ఈ అంశం కూడా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని అడుగుతున్నాను. 

 

మీరు ఫ్యానుకు ఓటు వేస్తే గ్రామ గ్రామాన, పట్టణాల్లోనూ, వార్డుల్లోనూ సేవలందిస్తున్న జగన్ మార్క్ సచివాలయాలన్నీ కూడా కొనసాగుతాయి. లేదంటే సచివాలయాల సేవలకు బాబు మార్క్ కత్తిరింపులు, ముగింపు జరుగుతుంది. ఫ్యానుకు ఓటు వేస్తే అవ్వాతాతలకు ఇంటి వద్దే రూ.3 వేల పెన్షన్ అందుతుంది. ఇంటికే వచ్చి సేవలందిస్తున్న వాలంటీర్లకు జగన్ మార్క్ పౌర సేవల వ్యవస్థ కొనసాగుతుంది. 

 

రెండు ఓట్లు ఫ్యాను మీద పడితే ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు వివిధ పథకాల ద్వారా ఈ 58 నెలల కాలంలోనే డీబీటీ ద్వారా, అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి, చేతుల్లోకి వెళ్లిపోవడం, ఎక్కడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా వెళ్లే మీ జగన్ మార్క్, మీ బిడ్డ మార్క్ పాలన కొనసాగుతుంది. లేదంటే ఇప్పుడు జరుగుతున్న వాలంటీర్ సేవలకు బాబు మార్క్ ముగింపు. మళ్లీ గ్రామాల్లో జన్మభూమి కమిటీలు, లంచాలు, వివక్ష పాలన. మళ్లీ దోచుకోవడం, పంచుకోవడం.. ఇదీ జరుగుతుంది. 

 

*బాబుకు ఓటేస్తే చంద్రముఖిని లేపినట్లే...*

పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ ఒక చంద్రముఖి నిద్ర లేస్తుంది. మళ్లీ పసుపుపతి నిద్ర లేస్తాడు. వదల బొమ్మాళీ వదల అంటూ.. మళ్లీ మీ రక్తం తాగేందుకు మళ్లీ 5 ఏళ్లు మీ రక్తం తాగేందుకు మీ ప్రతి ఇంటికీ కూడా వస్తాడు. జాగ్రత్త సుమా..

 

*ఫ్యాన్‌కు ఓటేస్తే పథకాలు కొనసాగింపు - బాబుకు ఓటేస్తే కత్తిరింపు.*

ఫ్యానుకు ఓటు వేస్తే విత్తనం నుంచి పంట అమ్మకం వరకు సేవలు అందిస్తున్న రైతు భరోసా కేంద్రాలన్నీ కూడా కొనసాగుతాయి. లేదంటే ఆర్బీకే వ్యవస్థకు బాబు మార్క్ కత్తింపులు, ముగింపు. ఫ్యానుకు ఓటు వేస్తేనే రైతన్నలకు వైయస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడికి సాయంగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఆ రైతన్నకు ఆదుకుంటూ వైయస్సార్ రైతు భరోసా కార్యక్రమం జరుగుతుంది. 

 

ఫ్యాను మీద రెండు ఓట్లు వేస్తేనే ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీకే పంట రుణాలు, సకాలంలో ఇన్ పుట్ సబ్సిడీ, పగటిపూటే రైతన్నకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్, దళారీలు లేని ఆర్బీకే వ్యవస్థతో ధాన్యం  కొనుగోలు అన్నది, ఇతర పంటల కొనుగోలు అన్నది.. ఇవన్నీ కూడా జరగాలంటే ఒక్క ఫ్యాను గుర్తు మీద రెండు ఓట్లు వేస్తేనే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి. లేదంటే మళ్లీ చంద్రబాబు మార్క్ పాలన, మళ్లీ కత్తిరింపులు, మళ్లీ పథకాలన్నీ కూడా ముగింపు. ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఆలోచన చేయండి. 

 

*చదువుల విప్లవం..*

ఫ్యానుకు ఓటు వేస్తేనే గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీషు మీడియం, గవర్నమెంట్ బడుల్లో రూపురేఖలు మారుస్తూ నాడునేడు, మూడో తరగతి నుంచే టోఫెల్ శిక్షణ, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్టు, మూడో తరగతి నుంచే బైజూస్ కంటెంట్, 6వ తరగతికి వచ్చే సరికే క్లాస్ రూములల్లో ఏకంగా డిజిటల్ బోధన, ఐఎఫ్ పీ ప్యానల్స్, 8వ తరగతికి వచ్చే సరికే ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు. పెద్ద చదువులకు 100 శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తూ, ఏ తల్లీ, తండ్రీ అప్పులపాలయ్యే పరిస్థితి రాకుండా ఆ తల్లిదండ్రులకు, పిల్లలకు తోడుగా విద్యాదీవెన, వసతి దీవెన. డిగ్రీ చదువుతున్న పెద్ద పిల్లలకు ఆ పెద్ద చదువుల్లో సర్టిఫైడ్ ఆన్ లైన్ వర్టికల్స్ ద్వారా విదేశాల్లోని అత్యున్నత విశ్వవిద్యాలయాలకు మన కాలేజీలు అనుసంధానం. తొలిసారిగా డిగ్రీలో మాండేటరీ ఇంటర్న్ షిప్.. ఇవన్నీ కూడా కొనసాగి మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడి ఎదగాలి అంటే మరో 10 సంవత్సరాలు మీ బిడ్డ, మీ జగన్ ఇదే స్థానంలో ఇక్కడే ఉంటే 10 సంవత్సరాల్లో మన పేద పిల్లలు ఏ స్థాయిలో ఇంగ్లీషులో మాట్లాడతారంటే వాళ్లు అనర్గళంగా మాట్లాడే మాటలకు పెద్దల పిల్లలు కూడా అసూయ పడే పరిస్థితి వస్తుంది. 

 

జగన్ మార్కు విప్లవాలన్నీ కూడా కొనసాగుతాయి ఫ్యాను మీద రెండు ఓట్లు పడితే. లేదంటే గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీషు మీడియం రద్దు, గవర్నమెంట్ బడుల రూపురేఖలు మార్చే నాడు నేడు కార్యక్రమం రద్దు. బడి పిల్లలకు రోజుకో మెనూతో ఇచ్చే గోరుముద్ద కార్యక్రమం రద్దు. బడి తెరిచే టయానికే ఆ పిల్లల చేతుల్లో విద్యా కానుక రద్దు. 6వ తరగతి నుంచి డిజిటల్ బోధన, 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబ్స్.. ఇవన్నీ కూడా కత్తిరింపులు, ముగింపు. 

 

పెద్ద చదువులకు 100 శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తున్న మీ బిడ్డ పాలనలో జరుగుతున్న విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలు ఇక కత్తిరింపులు, ముగింపు. ఆలోచన చేయమని అడుగుతున్నాను. పొరపాటు జరిగిందంటే.. మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. మీ పిల్లల చదువులు, పిల్లల బడులు అన్నీ కూడా లకలకా లకలకా అంటూ అన్నీ కూడా ముగింపే.

 

*జగన్ మార్క్ వైద్య విప్లవం కొనసాగాలంటే..*

 ఫ్యానుకు ఓటు వేస్తేనే గ్రామాల్లోనే విలేజ్ క్లినిక్, గ్రామాల్లోనే ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే ఆరోగ్య సురక్ష, ఇంటి వద్దనే టెస్టులు, గ్రామంలోనే మందులు, గవర్నమెంట్ ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తూ నాడు నేడు. రూ.25 లక్షల వరకు ఉచితంగా ఆరోగ్యశ్రీ. ఆపరేషన్ అయిన తర్వాత ఆ పేదవాడు ఇబ్బంది పడకుండా ఆరోగ్య ఆసరా. కొత్తగా కడుతున్న 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం వంటి ప్రతి పేదవాడికీ, ప్రతి మనిషినీ బతికించే జగన్ మార్క్ వైద్య విప్లవాలన్నీ కూడా ఫ్యాను మీద రెండు ఓట్లు పడితే అన్నీ కూడా కొనసాగుతాయి. లేదంటే మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. వదల బొమ్మాళీ వదల అంటుంది. పేదవాడు అప్పులపాలై వైద్యం అందని పరిస్థితిలోకి ఆ పేదవాడిని తీసుకుని పోతుంది ఈ చంద్రముఖి. 

 

*ఫ్యానుకు ఓటు వేస్తేనే అక్కచెల్లెమ్మల రాజ్యం.*

పిల్లలను బడికి పంపే తల్లులకు అమ్మ ఒడి అనే పథకం, ఆ పిల్లల చదువులకు ఆ తల్లి ఇబ్బంది పడకుండా విద్యాదీవెన, వసతి దీవెన, ఆ అక్కచెల్లెమ్మలకు ఆసరా ఇచ్చిన చేతితో సున్నా వడ్డీ అనే కార్యక్రమం, ఓ చేయూత కొనసాగింపు, కాపు నేస్తం కొనసాగింపు, ఓ ఈబీసీ నేస్తం కొనసాగింపు, ఓ వైయస్సార్ జగనన్న కాలనీలు, అందులో 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో కడుతున్న 22 లక్షల ఇళ్లు.. అన్నీ కూడా వేగంగా అడుగులు ముందుకు పడ్డాయి. 

 

*నామినేషన్, నామినేటెడ్ పనులు, పదవుల్లో 50శాతం అక్కచెల్లెమ్మలకు*

ఫ్యానుకు ఓటు వేస్తేనే నామినేటెడ్ పదవుల్లో నా అక్కచెల్లెమ్మలకు అగ్ర తాంబూలం ఇస్తూ  50 శాతం రిజర్వేషన్లలో నామినేషన్లలో ఉన్న పనులు, నామినేటెడ్ లో ఉన్న పదవులు అన్నీ కూడా నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చే మహిళా సాధికారత ప్రభుత్వం ఒక్క ఫ్యానుకు ఓటు వేస్తేనే మీ బిడ్డ జగన్ మళ్లీ వస్తేనే అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి. లేదంటే మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. పసుపుపతి నిద్ర లేస్తాడు. వదల బొమ్మాళీ వదల అంటాడు. అక్కచెల్లెమ్మలకు గుర్తుందా? పొదుపు సంఘాల విషయాలు గుర్తున్నాయా? మోసం చేసిన విషయాలు గుర్తున్నాయా? మళ్లీ అక్కచెల్లెమ్మల బతుకులన్నీ కూడా అతలాకుతలం అవుతాయి. గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. 

 

*ఓటు వేసే ముందు ప్రతి కుటుంబం ఆలోచన చేయండి.*

అందుకే ఓటు వేసే ముందు మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి. మీ పిల్లలతో ఆలోచన చేయండి. మీ భార్యలతో ఆలోచన చేయండి. అవ్వాతాతలతో, ఆడ పడుచులందరితో ఆలోచన చేయండి. ఓటు వేసే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచన చేయండి. ఎవరి వల్ల మంచి జరిగింది? ఎవరు ఉంటే మీ ఇంటికి మంచి జరుగుతుంది అన్న ఆలోచనతో ఓటు వేయండి అని మీ అందరితో కోరుతున్నాను. 

 

అందుకే మళ్లీ మళ్లీ చెబుతున్నాను. ఈసారి జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు. వచ్చే 60 నెలలు అంటే 5 సంవత్సరాలు మీ జీవితాలను, మీ తలరాతలను మార్చేవి ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోమని మీ అందరినీ కోరుతున్నాను.

 

మీకు మంచి చేసిన మీ బిడ్డ పాలన కావాలా? మన రాష్ట్రాన్ని తాను, తన పెత్తందార్లు అందరూ కలిసి దోచుకోవడం, పంచుకునే కూటమి పాలన కావాలా? చంద్రబాబు పాలన కావాలా? అన్నది ఆలోచన చేయమని కోరుతున్నాను. మీకు మంచి చేసిన మీ బిడ్డ పాలన మీ ఎదురుగా 5 సంవత్సరాలుగా 58 నెలల పాలనగా కనిపిస్తోంది. ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని మీ అందరితో కోరుతున్నాను. 

 

*మనకి ఓటువేయని వారికీ మేలు చేశాం ఆలోచన చేయండి.*

గత ఎన్నికల్లో వివిధ కారణాల వల్ల ఇతర పార్టీలకు ఓటు వేసిన వారిని కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. ఇదే సందర్భంగా అడుగుతున్నాను. కులం కారణం కావచ్చు, లేదా ఎప్పటి నుంచో ఆ పార్టీలో ఉన్నామన్న కారణం, లేదా మరే ఇతరత్రా కారణం కావచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతున్నాను. వాళ్లను కూడా అడుగుతున్నా. ఆ అన్నలను, అక్కలను, తమ్ముళ్లను, చెల్లెమ్మలు, అవ్వలు, తాతలను కూడా అడుగుతున్నా. మీరు నాకు గత ఎన్నికల్లో ఓటు వేయకపోయినా కూడా మీకు ఈ 5 ఏళ్లలో మంచి చేసిన ప్రభుత్వం మనది కాదా? అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నాను. 

 

*పసుపు నాయకులు, గ్లాస్ నాయకులు అబద్దాలు చెప్పినా..*

మీ ఇంటికి వచ్చిన పసుపు నాయకులు, గ్లాస్ నాయకులు, అబద్ధాలు చెప్పవచ్చు గానీ, మీ కుటుంబానికి మీ బ్యాంకు ఖాతాల్లోకి, మీ చేతికి గత 58 నెలల పాలనలో జమ అయిన, చేతికి అందిన స్కీముల డబ్బుల వివరాలు మీకు నిజాలే చెబుతాయి అన్నది ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతున్నాను. మీ ఇళ్లకు వచ్చిన వాలంటీర్ సేవలు, మీ ఇంటి ముంగిటకే వచ్చిన పెన్షన్, రేషన్, వైద్య సేవలు, సర్టిఫికెట్లు, పౌర సేవలు, మీకు అందిన ఇళ్ల పట్టాలు.. ఇవన్నీ కూడా మీకు నిజాలే చెబుతాయి. 

మారిన మన గవర్నమెంట్ బడులు, మన పిల్లల చదువులు, గ్రామంలోనే వైద్య సేవలు, మారిన మన వ్యవసాయం, ఇవన్నీ కూడా మీకు నిజాలే చెబుతాయి. అందుకే చెబుతున్నాను. మళ్లీ మళ్లీ ఆలోచన చేయండి.

 

*ఎవరిపాలనలో మంచి జరిగిందో ఆలోచన చేయండి.*

ఎవరి పాలనలో మీకు మంచి జరిగింది? ఎవరు ఉంటే మీ బతుకులకు మంచి జరుగుతుంది అన్నది ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. 

 

ఈ ఎన్నికల్లో ఇంటింటికీ మంచి చేశాం కాబట్టి, మీ బిడ్డ ఒంటరిగా ఎన్నికల్లో యుద్ధానికి బయల్దేరాడు. అందర్నీ మోసం చేశారు కాబట్టి, చెప్పుకునేందుకు ఏ మంచీ లేదు కాబట్టి కూటమిగా వారందరూ ఏకమయ్యారు. మీ బిడ్డ ఒక్కడు.. నక్కలు, తోడేళ్లు అనేక మంది. జరగబోతోంది కురుక్షేత్ర సమర యుద్ధం. సిద్ధమేనా? 

 

*ఇదీ ప్యాకేజీ స్టార్ పరిస్థితి.*

వారి కూటమి ఎలాంటిదో మీరే చూస్తున్నారు కదా. ఆ కూటమిలో అదీ వ్యక్తిత్వం ఉన్న పార్టీలు కలిస్తే ఏర్పడిన కూటమి కాదు. అది మిగతా పార్టీల్లోకి చంద్రబాబు తన మనుషులను పంపితే ఏర్పడిన కూటమి. అది దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పడిన కూటమి కాదు. దత్తపుత్రుడికి ఎన్ని టికెట్లు ఇవ్వాలో, ఆ టికెట్లలో ఎవరు పోటీ చేయాలో, చివరికి ఆ ప్యాకేజీ స్టార్ కు ఎక్కడ టికెట్ ఇవ్వాలో కూడా బాబు నిర్ణయిస్తే ఏర్పడిన పొత్తు. ఆలోచన చేయమని అడుగుతున్నాను. బాబు ఆ ప్యాకేజీ స్టార్ ను నువ్వు భీమవరం అంటే భీమవరం. గాజువాక అంటే గాజువాక. పిఠాపురం అంటే పిఠాపురం. బాబు ప్రయోజనం కోసం ఎక్కడ నిలబెడితే బాబుకు ప్రయోజనం కలుగుతుందంటే అక్కడ నిలబెట్టడం. ఎక్కడ కావాలంటే అక్కడ బాబు సిట్ అంటే సిట్. స్టాండ్ అంటే స్టాండ్. ఎక్కడ కావాలంటే అక్కడ బాబు.. జగన్ ను తిట్టు అంటే తిట్టు, ఇంకా కొట్టు అంటే కొట్టు. దత్తపుత్రా నీకు ఇచ్చేది 80 కాదు 20 అంటే దానికి కూడా జీ హుజూర్. ఇదీ ప్యాకేజీ స్టార్ పరిస్థితి. 

 

రాష్ట్రాన్ని హోల్ సేల్ గా దోచుకునేందుకు, దోచుకున్నది పంచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తుంటే, కులాన్ని హోల్ సేల్ గా బాబుకు అమ్మేయగలననే భ్రమతో ప్యాకేజీ స్టార్ రాజకీయం చేస్తున్నాడు. ఈ ప్యాకేజీ స్టార్ కు మన రాష్ట్రం అంటే ఎంత చులకనంటే జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్లిపోయేటంత చులకన. ఇంతకు ముందు ఈ ప్యాకేజీ స్టార్ కు పాలకొల్లు, భీమవరం, గాజువాక మూడు అయ్యాయి. ఇప్పుడు పిఠాపురం నాలుగోది. ఏ ప్రాంతమైనా ప్రేమ ఉండదు, ఈ మ్యారేజీ స్టార్ కు ఏ భార్య అయినా ప్రేమ ఉండదు. పెళ్లిళ్లే కాదు.. ఇప్పుడు నియోజకవర్గాలు కూడా నాలుగు అయ్యాయి. 

 

*పిల్లిని చంకన పెట్టుకుని పిఠాపురం పెళ్లికెళ్లినట్లు...*

మామూలుగా ఇక్కడొక సామెత ఉంది. చాలా ఫేమస్ సామెత కూడా. పెళ్లికి పిఠాపురం వెళ్తూ వెనకటికి ఒకడు.. పిల్లిని చంకన పెట్టుకుని వెళ్లాడన్నది సామెత. ఆ పిల్లిని చంకన పెట్టుకుని వెళ్లింది ఎవరా ఎవరా అని ఇంత కాలం ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థం అయ్యింది.. చంద్రబాబు తన చంకలో ఉన్న ఆ పిల్లిని ఇప్పుడు పిఠాపురంలో వదిలాడు అని. ఇదీ గాజు గ్లాసు పార్టీ పరిస్థితి. ఈ గ్లాసుతో గటగటా తాగేది బాబు. దాన్ని తోమి, తుడిచి మళ్లీ బాబుకు అందించేది మాత్రం.. ఈ ప్యాకేజీ స్టార్. 

 

*బీ ఫామ్ ఎవరిదైనా- యూనిఫామ్ చంద్రబాబుదే.*

ఇక ఈ కూటమిలో వదినమ్మ గురించి మాట్లాడదామా? బాబు చేరమంటే ఈ వదినమ్మ కాంగ్రెస్ లో చేరింది. ఇదే బాబు బీజేపీకి ట్రాన్స్ ఫర్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే బీజేపీకి చేరింది. బాబు పొడవమంటే సొంత తండ్రినే వెన్నుపోటు పొడిచేసింది. 30 ఏళ్లుగా ఏ పార్టీలో ఉన్నా బాబు కోవర్ట్ గా ఇదే పనిలోనే ఉంది. బీజేపీలో ఉన్నా, బాబు సీటు ఎవరికి ఇవ్వమంటే వారికే ఇస్తుంది. ఎవరికి వద్దంటే వారిని ఆపుతుంది. మారుస్తుంది. బాబు ప్యాకేజీలు, ప్రలోభాలు ఏ స్థాయిలో ఉంటాయంటే.. బీ ఫామ్ బీజేపీది అయినా, బీ ఫామ్ కాంగ్రెస్ ది అయినా, బీ ఫామ్ గ్లాసుది అయినా కూడా యూనిఫాం మాత్రం అంతా చంద్రబాబుదే. 

 

ఆయన మేనిఫెస్టో కూడా ఎప్పుడూ ఎలా ఉంటుంది అంటే ఎన్నికలు అయ్యేదాకా మాత్రం రంగు రంగుల స్వప్నాలు చూపిస్తుంటుంది ఆ మేనిఫెస్టో. ఎన్నికలు అయిపోయిన తర్వాత అదే మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని వెతికినా కూడా కనపడదు. అది చెత్తబుట్టలో కనిపిస్తుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలకు ఆయన ఎప్పుడూ చేసేది మోసాలే. ఇదీ చంద్రబాబు నైజం, ఇదీ చంద్రబాబు క్యారెక్టర్. 

 

*బాబు పొత్తులు గురించి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి.*

మరి బాబు ఎందుకింత దిగజారాడో, ఎందుకు ఇన్ని కుట్రలు చేస్తున్నాడు, కుతంత్రాలు చేస్తున్నాడు. మోసాలు చేస్తున్నాడు, ఎందుకిన్ని అబద్ధాలు చెబుతున్నాడు, పొత్తులు పెట్టుకుంటున్నాడు? వీటన్నింటితో కూటమి కడుతున్నది ఎందుకు అని ప్రతి ఇంటా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. కారణం ఏమిటో తెలుసా? కారణం చంద్రబాబు పాలనలో చరిత్రలో నిలిచిపోయే మైలు రాళ్లు ఏవీ లేవు. వ్యవస్థలుగానీ, మంచి పథకాలు గానీ మంచి స్కీములు గానీ, ప్రజలకు చేసిన మంచి గానీ ఇలాంటి పునాది రాళ్లు ఏవీ కూడా చంద్రబాబు పాలనలో లేవు. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానంటాడు. 3 సార్లు తాను ముఖ్యమంత్రిగా పాలన చేశానంటాడు. కానీ తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్కటైనా కూడా మంచి గుర్తుకొస్తుందా? అని మీ అందరినీ అడుగుతున్నాను. 

 

తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్క స్కీమైనా గుర్తుకొస్తుందా? అని అడుగుతున్నాను. కాబట్టే ఈ చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూటమి నా మీద వేయటానికి, నా మీద వేయించడానికి వీళ్లందరికీ గులకరాళ్లే మిగిలాయి. మన 58 నెలల పాలనలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా మనం వేసిన అలాంటి మైలు రాళ్లు, అలాంటి పునాది రాళ్లు చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోయే విప్లవాలుగా కనిపిస్తుంటాయి. కాబట్టే మన జెండా తలెత్తుకుని ఎగురుతోంది. అక్కడే కనిపిస్తూ ఎగురుతోంది. వారి జెండా మరో 4 జెండాలతో జతకట్టినా కూడా ఎగరలేక కింద పడుతున్నాయి. 

 

మరి ఈ ఇంటింటి అభివృద్ధి కొనసాగాలా? వద్దా? అని ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఇవి కొనసాగాలంటే ఈ ఎన్నికల్లో వేసే మన ఓటు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే కాదు, రాబోయే మీ 5 సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది కాబట్టి ప్రతి ఇంటా కూడా చర్చించుకునే అవకాశం రావాలి. ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలి. ఫ్యానుకు రెండు ఓట్లు వేస్తేనే ఇంటింటి అభివృద్ధి అని ప్రతి ఒక్కరినీ కూడా స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు రావాలి అని మీరందరూ కూడా ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలి. బాబు చరిత్రను కూడా వివరించాలి. బాబు చరిత్రను, ఆ కూటమి చరిత్రను, వారంతా కూడా గతంలో ఏం చేశారు అన్నది కూడా ప్రతి ఇంట్లోనూ చెప్పాలి. 

 

*గతం గుర్తుకు తెచ్చుకుంటే....*

గతం గుర్తుందా? 2014 మీ అందరికీ గుర్తుందా? మరీ దూరం కాదు 2014 ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. 2014లో గతంలో చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడి బాబు సంతకంతో ముఖ్యమైన హామీలంటూ ఇదే ముగ్గురి ఫొటోలతో ఇంటింటికీ పంపించిన పాంప్లెట్ ఇది. గుర్తుందా? అక్కా, చెల్లెమ్మా, అన్నా గుర్తుందా ఈ పాంప్లెట్. కనపడుతోందా చంద్రబాబు బాబు సంతకం, కనపడుతున్నాయా ఫొటోలు. ఇదే కూటమి, ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే వాళ్లు ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫొటో. కింద చంద్రబాబు సంతకం పెట్టి ఈ పాంప్లెట్ ను ప్రతి ఇంటికీ పంపించాడు. పంపిస్తే ఎక్కడ మీ అందరికీ మర్చిపోతారేమో అని ఆరోజుల్లో గుర్తుందా? ఏ టీవీ చూసినా కూడా ఈటీవీ నుంచి ఏబీఎన్ నుంచి టీవీ5.. ఎక్కడ చూసినా అడ్వర్టైజ్ మెంట్లు ఊదరగొట్టారు. గుర్తున్నాయా?

 

*చంద్రబాబు విఫలహామీలు.*

మరి ఈ ముఖ్యమైన హామీలు ఒక్కసారి చదవమంటారా? 

 

రైతు రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. రూ.87,612 కోట్లు చేశాడా? రెండో హామీ చదవమంటారా? పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. అక్కా, చెల్లెమ్మా.. రూ.14205 కోట్లు.. ఒక్క రూపాయి అయినా చేశాడా? ఇంకా ముందుకు పొమ్మంటారా? ఆ బిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు. రూ.25 వేలు కథ దేవుడెరుగు.. కనీసం ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశాడా? అని అడుగుతున్నాను. 

 

*ఇంకా ముందుకు పొమ్మంటారా?*

 ఇంటింటికీ ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి నెలా రూ.2 వేల నిరుద్యోగభృతి. 5 సంవత్సరాల ఆయన పాలన అంటే 60 నెలల్లో నెల నెలా రూ.2 వేల చొప్పున ప్రతి ఇంటికీ రూ.1.20 లక్షలు ఇచ్చాడా? ఇంకా ముందుకు పొమ్మంటారా? ముఖ్యమైన హామీలు కదా.. అర్హులైన వాందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు ఇళ్లు. మూడు సెంట్ల స్థలం కథ దేవుడెరుగు. కనీసం మీలో ఇంత మంది ఉన్నారు. ఒక్కరికైనా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? 

 

రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అన్నాడు, చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. అయ్యాయా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా? సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. నిర్మించాడా? మరి కనిపిస్తోందా మీ కాకినాడలో హైటెక్ సిటీ, లేదా పిఠాపురంలో కనిపిస్తోందా? మరి ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఇందులో ఇచ్చిన ఒక్కటంటే ఇక్క హామీ అయినా ఇదే ముగ్గురి ఫొటోలతో ఇదే కూటమి చంద్రబాబు నాయుడు గారు స్వయానా సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన, ఈ పాంప్లెట్ లో పెట్టిన ముఖ్యమైన హామీలంటూ ఇందులో చెప్పిన ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చాడా అని మిమ్మల్నందరినీ అడుగుతున్నాను. 

 

పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? అదీ లేదు. మరి ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఇవ్వకపోగా మళ్లీ ఈ ముగ్గరే, ఇదే ఫొటో, ఇదే చంద్రబాబు కూటమి, మళ్లీ ఈ ముగ్గురు కలిసి ఇప్పుడు ఏమంటున్నారు. సూపర్ సిక్స్ అంట. సూపర్ సెవెన్ అంట. ఇంటింటికీ కేజీ బంగారమంట. ఇంటింటికీ బెంజ్ కారు కొనిస్తాడంట అక్కా, చెల్లెమ్మా.. ఇంటింటికీ బెంజ్ కారంట.. నమ్ముతారా? చెల్లెమ్మా, అన్నా, తమ్ముడూ నమ్ముతారా? ఇన్ని మోసాలతో, ఇన్ని అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? 

 

*మీ సెల్‌ఫోన్‌ లైట్లు వెలిగించి సిద్దమే అని చెప్పండి.*

సిద్ధమే అయితే వారి చీకటి యుద్ధాన్ని, వారి సోషల్ మీడియా, ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జేబుల్లోంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి. అందులోని లైట్ బటన్ ఆన్ చేయండి. పేదల భవిష్యత్ కోసం యుద్ధం చేసేందుకు మేమంతా సిద్ధమే అని గట్టిగా చెప్పండి. వాలంటీర్లు మళ్లీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మళ్లీ మారాలన్నీ, పథకాలన్నీ కొనసాగాలన్నీ, లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లల చదువులు, బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, మన హాస్పిటళ్లు మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కి 175కు 175 స్థానాలు, 25 ఎంపీలకు 25 స్థానాలూ తగ్గడానికి వీలే లేదు. సిద్ధమేనా? 

 

*ప్రతి మత్స్యకార కుటుంబానికి మేలు జరిగేలా..*

కాసేపటి కింద కన్నబాబు అన్న మాట్లాడుతూ మత్స్యకారుల సమస్య గురించి ప్రస్తావించాడు. మీ అందరికీ నేను ఒకటే చెబుతున్నాను. జగన్ మంచి చేసే వాడు. జగన్ మనసున్న వాడు. మనసు ఉంది కాబట్టే ముమ్మిడివరంలో జరిగిన నష్టాన్ని ఎప్పటి నుంచో సంవత్సరాల నుంచి పరిష్కారం కాని సమస్యకు ఆ మత్స్యకారులకు పరిష్కారం చూపించింది మీ బిడ్డ మాత్రమే. మత్స్యకారులందరికీ హామీ ఇస్తున్నాం. ఈరోజు ఓఎన్జీసీ వాళ్లు కమిటీ ఫాం చేశారు అంటే దానికి కారణం మీ బిడ్డ, మన వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి. ఈరోజు కమిటీ ఫాం అయ్యింది. త్వరలో ఆ కమిటీ రికమెండేషన్లు ఇస్తుంది. వాటి ఆధారంగా ప్రతి మత్స్యకార కుటుంబానికి కూడా మంచి జరిగేట్టుగా మీ బిడ్డ తోడుగా ఉంటాడు అని మీ అందరికీ మాట ఇస్తున్నాను. 

 

*మన అభ్యర్ధులను ఆశీర్వదించి గెలిపించండి.*

ఈ రోజు ఇదే కాకినాడ జిల్లాలో మన పార్టీ తరఫు నుంచి నిలబడుతున్న అభ్యర్థులను మీ అందరికీ కూడా పరిచయం చేయబోతున్నాను. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు మన పార్టీ తరఫున నిలబడబోతున్న మన అభ్యర్థులపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. 

మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా సునీల్ నిలబడుతున్నాడు. మంచి వాడు, సౌమ్యుడు, మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకు ఉన్నాయి, నాకు మంచి స్నేహితుడు కూడా. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు సునీల్ పై ఉంచవలసిందిగా మీ అందరితో కూడా ప్రార్థిస్తున్నాను. 

 

కాకినాడ రూరల్ నుంచి కన్నబాబు అన్న నిలబడుతున్నాడు. మీ అందరికీ పరిచయస్తుడు. మంచి చేసే దాంట్లో మాత్రం ఎప్పుడూ నాలుగు అడుగులు ముందే ఉంటాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు కన్నబాబు అన్నపై ఉంచవలసిందిగా మీ అందరితో సవినయంగా ప్రార్థిస్తున్నాను. 

 

కాకినాడ నుంచి చంద్ర(ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి) నిలబడుతున్నాడు. తాను కూడా మంచి వాడు, సౌమ్యుడు. పేదలకు మంచి చేసే విషయంలో ఎప్పుడూ ముందు ఉంటాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు చంద్రపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. 

 

జగ్గంపేట నుంచి తోట నరసింహం అన్న నిలబడుతున్నాడు. నరసింహం అన్న గురించి నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మనసున్న వాడు, వెన్నలాంటి మనసున్న వాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. 

 

పెద్దాపురం నుంచి దొరబాబు నిలబడుతున్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేయడానికి అడుగులు వేగంగా ముందుకు వేస్తున్నాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు దొరబాబుపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. 

 

ప్రత్తిపాడు నుంచి సుబ్బారావు అన్న నిలబడుతున్నాడు. పొట్టివాడైనా గట్టివాడు. మనసున్న వాడు అని కూడా చెప్పాలి. సుబ్బారావు అన్నకు మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. 

 

రాజా గురించి నేను చెప్పాల్సిన పని లేదు. తుని నుంచి నిలబడుతున్నాడు. నాకు మంచిస్నేహితుడు. మంచి వాడు, సౌమ్యుడు. మీ అందరికీ మంచి చేస్తాడు అన్న నమ్మకం పూర్తిగా ఉంది. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు రాజాపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. 

 

*పిఠాపురం నుంచి లోక్‌ల్ హీరో లేదా సినిమా హీరో ఎవరు కావాలో తేల్చుకొండి.*

పిఠాపురం నుంచి నాకు తల్లిలాంటిది, నా అక్క గీతమ్మ నిలబడుతోంది. ఒకటే ఒకటి నేను చెబుతున్నాను. పిఠాపురంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నాను. లోకల్ హీరో కావాల్నా? లేకపోతే సినిమా హీరో కావాల్నా? అని ఆలోచన చేసుకోమని కోరుతున్నాను. అక్కకు ఓటేస్తే ఎప్పుడూ మీతోనే ఉంటుంది. మీకు మంచి చేస్తుంది. నేను కూడా దగ్గరుండి అక్కతో మంచి చేయిస్తాను.  కానీ సినిమా హీరోకు మాత్రం ఓటు వేస్తే ఓటు వేయించుకున్న సమయంలో మాత్రమే ఇక్కడ ఉంటాడు. జ్వరం వచ్చినా తాను మళ్లీ హైదరాబాద్ కు వెళ్లిపోతాడు. గుర్తుపెట్టుకోమని మీ అందరితో కోరుతున్నాను. అక్కపై మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉంచవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. 

 

*మంచి చేసిన ఫ్యాను గుర్తునే గుర్తుపెట్టుకొండి.*

అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరైనా మన గుర్తు తెలియని వాళ్లో, మర్చిపోయిన వాళ్లో ఉంటే మన గుర్తు ఫ్యాను. అక్కా మన గుర్తు ఫ్యాను అక్కా. అక్కడున్న అవ్వలు, అక్కలూ మన గుర్తు ఫ్యాను. అన్నా మన గుర్తు ఫ్యాను. మన గుర్తు ఫ్యాను తమ్ముడూ. ఫ్యాను మంచి చేసింది. మంచి చేసి చూపించింది. మంచి చేసిన ఈ ఫ్యాను ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి. సైకిల్ ఎప్పుడూ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ కూడా సింక్ లోనే ఉండాలి. ప్రతి ఒక్కరూ ఈ అంశాన్ని గుర్తు పెట్టుకోమని కోరుతూ ఒక్కసారి అక్కడికి వచ్చి మిమ్మల్నందరినీ వీడ్కోలు పలుకుతూ సెలవు తీసుకుంటాను అని సీఎం శ్రీ వైయస్.జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.

 

Back to Top