భయపడొద్దమ్మా.. నేనున్నా..

క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారికి సీఎం వైయ‌స్‌ జగన్‌ భరోసా 

వైద్యం చేయిస్తామని చిన్నారి తల్లిదండ్రులకు హామీ 

అత్తిలి: క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ చిన్నారి కుటుంబానికి సీఎం వైయ‌స్‌ జగన్‌ అండగా నిలిచారు. ఆమె వైద్యానికయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని సీఎం వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా మంగళవారం రాత్రి పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలంలోని దువ్వ వెంకయ్య కాలువ గట్టు వద్ద నివసిస్తున్న ప్రజలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మమేకమయ్యారు. ఈ సందర్భంగా కోనాల ఆంజనేయులు, కామాక్షి దంపతులు తమ కుమార్తె దానేశ్వరిని తీసుకువచ్చి సీఎం వైయ‌స్ జగన్‌ను కలిశారు.  
తమ కుమార్తె కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతోందంటూ కన్నీరుపెట్టుకున్నారు. వైద్యం కోసం చాలా ఖర్చు చేశామని.. అయినా ఉపయోగం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మీరే ఆదుకోవాలి జగనన్నా అంటూ విలపించారు. సీఎం వైయ‌స్ జగన్‌ ఆ పాపను ఆప్యాయంగా పలకరించారు. ఆంజనేయులు దంపతులకు ధైర్యం చెప్పారు. పాప విషయంలో భయపడొద్దని.. వైద్యానికయ్యే ఖర్చు రూ.40 లక్షలను ప్రభుత్వం భరిస్తుందంటూ భరోసా ఇచ్చారు. దీంతో ఆంజనేయులు దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. దేవుడిలా వచ్చి ఆదుకుంటున్నారంటూ ఆనందం వ్యక్తం చేశారు.

Back to Top