ప్రభం‘జనం’..మేమంతా సిద్ధం

నిబద్ధత, నిజాయితీతో పని చేసిన ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌కు జన నీరాజనం 

మాటపై నిలబడే నాయకుని నాయకత్వంలో పని చేసేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతల పోటా పోటీ 

వైయ‌స్ఆర్‌సీపీలో చేరేందుకు భారీ ఎత్తున ఆసక్తి చూపుతున్న నేతలు 

కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని పార్టీలో చేర్చుకుంటున్న సీఎం 

ప్రజా బలం ఉన్న నేతలు పార్టీ వీడుతుండటంతో కూటమి పెద్దల్లో ఆందోళన 

గేట్లు ఎత్తేస్తే ఆ పార్టీలు కుదేలవడం ఖాయమంటోన్న రాజకీయ పరిశీలకులు  

అమరావతి: సార్వత్రిక ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘మేమంతా సిద్ధం’ పేరుతో రాష్ట్రంలో నిర్వహిస్తున్న బస్సు యాత్రకు వస్తున్న ప్రజా స్పందన టీడీపీ–జనసేన–బీజేపీ నేతల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇచ్చిన మాటకు కట్టుబడి.. నిజాయితీతో, నిబద్ధతతో సుపరిపాలన అందించే నాయకుడిని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారనడానికి నిలువెత్తు నిదర్శనం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసి, పేదంటి భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దుతూ.. రాష్ట్రం రూపురేఖలు మార్చిన సీఎం వైఎస్‌ జగన్‌కు బస్సు యాత్రలో జనం అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు.  
మండుటెండైనా అర్ధరాత్రయినా ఊరూరా అభిమాన సంద్రం ఉప్పొంగుతోంది. వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో సీఎం వైయ‌స్‌ జగన్‌ నిర్వహించిన సిద్ధం సభలకు జనం పోటెత్తారు. రాప్తాడు, మేదరమెట్ల సభలు ఉమ్మడి రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల చరిత్రలో అతి పెద్ద ప్రజా సభలుగా నిలిచాయి. సిద్ధం సభలను మరిపించేలా బస్సు యాత్రకు జనం అడుగడుగునా బ్రహ్మరథం పడుతుండటంతో సార్వత్రిక ఎన్నికలకు ముందే వైఎస్సార్‌సీపీ ప్రభంజనం కన్పిస్తోందని ఇటు రాజకీయ పరిశీలకులు, అటు కూటమి నేతలు గుర్తించారు. మాటపై నిలబడే నాయకుని నాయకత్వంపై పని చేసేందుకు కూటమి నేతలు పోటీపోటీగా వైఎస్సార్‌సీపీలోకి చేరేందుకు క్యూ కడుతున్నారు.  
 
జన బలమే గీటురాయిగా చేరికలు 
► టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరేందుకు పోటీ పడుతున్న నాయకుల్లో.. జనబలమే గీటురాయిగా.. సచీ్ఛలత, నిజాయితీ, నిబద్ధత ఆధారంగా.. కార్యకర్తల మనోభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని సీఎం వైఎస్‌ జగన్‌ చేర్చుకుంటున్నారు.  

► టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వంచన వైఖరితో విభేదించిన ఆ పార్టీ రాయచోటి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే ఆర్‌.రమేష్ కుమార్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, 2019లో కావలి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కాటంరెడ్డి విష్ణువర్దన్‌రెడ్డి, కళ్యాణదుర్గం నుంచి 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఉమామహేశ్వర నాయుడు, పలమనేరు మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, చిత్తూరు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు రావూరి ఈశ్వరరావు, చిత్తూరు మాజీ మేయర్‌ సరళ మేరీ, 2019 ఎన్నికల్లో గంగాధర నెల్లూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎ.హరికృష్ణ, మాజీ ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌బాష తదితరులు తమ అనుచరులతో కలిసి బస్సు యాత్రలో సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. 

► జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ నాయకత్వంతో విభేదించిన ఆ పార్టీ విజయవాడ (పశ్చిమ) సమన్వయకర్త పోతిన మహేష్, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి (2019 ఎన్నికల్లో పి.గన్నవరం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు), అమలాపురం సమన్వయకర్త శెట్టిబత్తుల రాజాబాబు, ముమ్మడివరం సమన్వయకర్త పితాని బాలకృష్ణ తదితరులు తమ అనుచరులతో కలిసి బస్సు యాత్రలో సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. 

► అఖిల భారత యాదవ సంఘం, రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్, బీజేపీ సీనియర్‌ నేత ఏవీ సుబ్బారెడ్డి సహా పలువురు ప్రజా సంఘాల నేతలు తమ అనుచరులతో కలిసి సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.  
 
తలుపులు బార్లా తెరిస్తే కూటమి ఖాళీ 
తమ పార్టీలను వీడి ప్రజాబలం ఉన్న నేతలు వైఎస్సార్‌సీపీలో చేరుతుండటం కూటమి నేతల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఎలాంటి ప్రామాణికాలు పాటించకుండా సీఎం వైఎస్‌ జగన్‌ వైఎస్సార్‌సీపీ తలుపులు బార్లా తెరిస్తే.. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఖాళీ కావడం ఖాయమని రాజకీయ పరిశీలకులు చేస్తున్న విశ్లేషణ ఆయా పార్టీల అభ్యర్థుల్లో నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీస్తోంది. ఓ వైపు బస్సు యాత్రతో సీఎం వైఎస్‌ జగన్‌ సృష్టిస్తున్న ప్రభంజనం.. మరో వైపు తమ పార్టీల నుంచి వైఎస్సార్‌సీపీలోకి నేతలు క్యూ కడుతుండటంతో సార్వత్రిక ఎన్నికలకు ముందే టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు కాడి పారేస్తున్నారు.     

Back to Top