'సిద్ధం' సభ సూపర్ హిట్..! ప్రత్యర‍్థులు ఫట్‌..!!

'మళ్లీ చారిత్రక విజయానికి మీరంతా సిద్దమా..? అవును సిద్దమే..!' ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి దెందులూరు 'సిద్దం' సభలో ఈ ప్రశ్న వేయగానే, మొత్తం ఆ ప్రాంతం అంతా సిద్దమే అంటూ ప్రతిధ్వనించింది. అది ఒక రణనినాదంగా మారుమోగింది. వైఎస్సార్‌సీపీ కార్యకర్తల కోసం మూడు జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసిన సభకు తరలి వచ్చిన వారిని చూస్తే ప్రత్యర్ధి పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెత్తవలసిందే. సభ ప్రాంగణంలో ఎంత మంది ఉన్నారో, అంతకు మించి రోడ్డుమీద నిలబడిపోయారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. జాతీయ రహదారికి సంబంధించిన విజువల్స్ చూస్తే సభకు వచ్చిన బస్‌లు, రోడ్లపై ఉన్న జనంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది.

అక్కడకు సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమాన్ జంక్షన్ వరకు ట్రాఫిక్ స్తంభించింది. ఇంకా చాలామంది జంక్షన్ నుంచి వెనుదిరగవలసి వచ్చింది. అలాగే రెండో వైపున కూడా జనం కిటకిటలాడారు. అయినా యధా ప్రకారం ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర తెలుగుదేశం మీడియా సంస్థలు ఏడుపుగొట్టు వార్తలు రాసి ఆత్మ సంతృప్తి చెందాయి. వారి ఆత్మవంచనను పక్కనబెడితే ఈ సభ సూపర్ హిట్ అయిందన్నది వాస్తవం. ఎక్కడైతే టీడీపీ, జనసేనలు తమకు బాగా బలం ఉందని అనుకుంటున్నాయో, అక్కడే ఈ రకంగా కార్యకర్తలు తండోపతండాలుగా తరలివస్తే, అదే ప్రజానీకంతో భారీ బహిరంగ సభ పెడితే అది ఇంకెలా ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.

లక్షల మందితో సభలు పెట్టడం జగన్‌మోహన్‌రెడ్డికు కొత్తకాదు. గతంలో ప్లీనరీ సందర్భంగా కూడా కిలోమీటర్ల కొద్ది జనం నిలబడిపోయిన ఘట్టాలు కూడా చూశాం. ఈసారి ఎన్నికల ముందు జరుగుతున్న ఈ సిద్దం సభలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. భీమిలిలో విజయవంతమైన సభ తర్వాత అంతకు కొన్ని రెట్ల కార్యకర్తలతో దెందులూరు సభ జరగడంతో వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలలో ఉత్సాహం ఇనుమడించిందని చెప్పాలి. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలలో కాపు సామాజికవర్గం అధికంగా ఉంటుంది. వారి మద్దతు తనకు లభిస్తుందని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఆశిస్తున్నారు. కాని ఆయన ఎప్పుడైతే చంద్రబాబు పల్లకి మోయడానికి సిద్దమయ్యారని తెలుసుకున్నారో, కాపు వర్గం అంతా మళ్లీ ఎవరి పార్టీలోకి వారు వెళ్లిపోయారని బీజేపీ సీనియర్ నేత పాకా సత్యనారాయణ వ్యాఖ్యానించడం గమనార్హం.

దీంతో వైఎస్‌ఆర్‌సీపీ బాగా పుంజుకుందని చెబుతున్నారు. ఒకవైపు ఎస్సీ, బీసీ వర్గాల అండదండలు, మరో వైపు కాపు వర్గం గతంలో మాదిరి వైఎస్‌ఆర్‌సీపీ పక్షానికి తిరిగి వచ్చేయడంతో ఈ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో విజయావకాశాలు బాగా పెరిగాయని సర్వేలు చెబుతున్నాయి. ఈ రెండు జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలో సైతం వైఎస్‌ఆర్‌సీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని అంచనాలు వేస్తున్నారు. దెందులూరు సభ బ్రహ్మండంగా విజయవంతం అవడం దానికి నిదర్శనంగా కనిపిస్తుంది.

పార్టీ నేతలు రవాణా సదుపాయం ఏర్పాటు చేసి ఉండవచ్చు. కాని ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే సభకు హాజరైన క్యాడర్‌లో కనిపించిన స్పందన. జగన్‌మోహన్‌రెడ్డి మీరు సిద్దమా అని ప్రశ్నించినప్పుడల్లా అవును సిద్దమే అని పెద్ద ఎత్తున బదులు చెబుతూ వచ్చారు. మీ బిడ్డ అని ఆయన అనగానే, జగన్‌మోహన్‌రెడ్డి అని కార్యకర్తలు నినదించారు. సభ ఆరంభంలో, తిరిగి ముగింపులోను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాక్‌వే గుండా జగన్‌మోహన్‌రెడ్డి అందరికి అభివాదం చేసుకుంటూ వెళుతున్నప్పుడు కార్యకర్తలు జండాలు ఊపిన వైనం, జేజేలతో హోరెత్తించిన తీరు చూశాక టీడీపీ, జనసేన పక్షాల నేతలకు దిమ్మదిరిగినంత పని అయింది.

గత నాలుగేళ్లుగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 వంటి ఎల్లో మీడియా సంస్థలతో ఎంత విష ప్రచారం చేసినా, ప్రతిపక్షంగా ఉంటూ టీడీపీ, జనసేన అధినేతలు ఎన్ని అబద్దాలు చెబుతున్నా ప్రజలు నమ్మడం లేదనడానికి ఈ సభ ఉదాహరణ అవుతుంది. ఇక జగన్‌మోహన్‌రెడ్డి సైతం తన స్పీచ్‌లో పంచ్ డైలాగులు, పదునైన వ్యాఖ్యలతో అదరగొట్టారు. మంచి ఉచ్చస్వరంతో ఆయన స్పీచ్ ఇస్తున్నంతసేపు జనం ఉర్రూతలూగుతూ మద్దతు ఇవ్వడం స్పష్టంగా కనిపించింది.

మహాభారతం, రామాయణం వంటి ఇతిహాసాలను ప్రస్తావిస్తూ విపక్షంపై జగన్‌మోహన్‌రెడ్డి చెలరేగిపోయారంటే అతిశయోక్తి కాదు.. ప్రస్తుతం అమలు అవుతున్న వివిధ సంక్షేమ పధకాలు యధావిధిగా కొనసాగాలంటే వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం తిరిగి రావల్సిన అవశ్యకతను ప్రజలకు వివరించాలని జగన్‌మోహన్‌రెడ్డి క్యాడర్‌ను కోరారు. ఈ ఏభై ఏడు నెలల్లో మీ బిడ్డ 124 సార్లు బటన్ నొక్కారని, ప్రజలు రెండు బటన్‌లను ఒక్కోసారి నొక్కి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో వైఎస్‌ఆర్‌సీపీకి మద్దతు ఇవ్వాలని కోరడం విశేషం. తను అమలు చేస్తున్న సంక్షేమ స్కీములపై ఆయనకు ఉన్న విశ్వాసాన్ని ఈ మాటలు తెలియచేస్తాయి.

ఈసారి జగన్‌మోహన్‌రెడ్డి సినిమా సన్నివేశాలను కూడా వాడారు. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును చంద్రముఖి సినిమా పాత్రతో పోల్చి అందరిని నవ్వించారు. 'అంతేకాక 2019 ఎన్నికలలో చంద్రముఖిని ఓట్ల పెట్టెలలో బంధించారని, ఈసారి దానిని రానివ్వకుండా చూస్తే రాష్ట్రానికి చంద్రముఖి బెడద శాశ్వతంగా పోతుందని, చంద్రగ్రహణాలు ఉండవని చెప్పడం ద్వారా ఈ ఎన్నికలలో టీడీపీ ఓడిపోతే, దానికి భవిష్యత్తు ఉండదని ఆయన పరోక్షంగా జోస్యం చెప్పారు. చంద్రముఖి బెడదను వదలించుకోకపోతే మళ్లీ నిద్ర లేస్తుందని, సైకిలెక్కి టీ గ్లాస్ పట్టుకుని లకలక అంటూ ప్రజల రక్తం తాగడానికి సిద్దం అవుతుందని ఆయన హెచ్చరించారు.' టీడీపీ, జనసేన పొత్తును అంటే ప్రజల రక్తం తాగడానికే అని ఆయన ప్రజలకు చెప్పదలిచారన్నమాట.

కాంగ్రెస్‌పై కూడా ఘాటైన విమర్శలు చేయడం గమనార్హం. రాష్ట్రానికి కాంగ్రెస్ నమ్మక ద్రోహం చేసిందని ఆయన అన్నారు. ఇది ఎవరికి తగులుతుందో అందరికి తెలుసు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చేసింది ఏమీ లేక పొత్తుల జిత్తులతో ప్రజల ముందుకు వస్తున్నారని ఆయన ఎద్దేవ చేశారు. 'రా కదలిరా.. అన్న టీడీపీ నినాదాన్ని అపహాస్యం చేస్తూ ప్యాకేజీ కోసం రా... కదలిరా' అని దత్తపుత్రుడిని పిలుస్తున్నారని జగన్‌మోహన్‌రెడ్డి అన్నప్పుడు సభికులలో విశేష స్పందన కనిపించింది. ఈ ఒక్కడిమీద దేశంలోని బలమైన పది వ్యవస్థలను ప్రయోగించినా, బెదరకుండా ప్రజలు మోసిన జెండా ఇది అని అంటూ వైఎస్‌ఆర్‌సీపీ బలాన్ని, ధైర్యాన్ని ఆయన తెలియచెప్పారు.

తద్వారా కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కలిసి తనపై పెట్టిన అక్రమ కేసుల గురించి జగన్‌మోహన్‌రెడ్డి పరోక్షంగా ప్రస్తావించారు. తన ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ స్కీములతో పాటు, ఈ సభలో ఆయన పోర్టులు, మెడికల్ కాలేజీలు తదితర అభివృద్ది పనుల గురించి కూడా ప్రస్తావించారు. కాగా కరోనా సంక్షోభ సమయంలో ప్రభుత్వం నిర్వర్తించిన సేవల గురించి కూడా ప్రజలకు గుర్తు చేస్తే బాగుంటుందని కొందరు సూచిస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి స్పీచ్, వచ్చిన జనం.. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత ఏమనిపిస్తుందంటే జగన్‌మోహన్‌రెడ్డి చెబుతున్నట్లు చారిత్రక విజయం మరోసారి వైఎస్‌ఆర్‌సీపీకి రాబోతుందన్న విశ్వాసం ఏర్పడుతుంది. అదే ఆత్మస్థైర్యం, మనో ధైర్యం వైఎస్‌ఆర్‌సీపీ క్యాడర్‌లో స్పష్టంగా కనిపించింది.

– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Back to Top