మ్యానిఫెస్టో మాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ 

మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

విశాఖ‌:  మ్యానిఫెస్టో మాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని మా నాయకులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చెప్పార‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు. పేద‌ల బ‌తుకులు మార్చే మేనిఫెస్టో విడుద‌లైన క్ర‌మంలో ప్రతీ ఒక్కరూ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వెయ్యాల‌ని బొత్స సత్యనారాయణ కోరారు. ఇవాళ వైయ‌స్ఆర్‌సీపీ 2024 మేనిఫెస్టో విడుద‌ల చేయ‌డం ప‌ట్ల ఆయ‌న స్పందించారు. 

మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఏమ‌న్నారంటే..

*ఉత్తరాంధ్రలో ‘ఫ్యాన్‌’ ప్రభంజనంః*

నిన్నటితో నామినేషన్ల పర్వం పూర్తయింది. స్న్రూట్నీల తర్వాత ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను నిన్న ప్రకటించడం జరిగింది. విశాఖపట్ణణం పార్లమెంట్‌కు సంబం«ధించి మొత్తం 32 మంది అభ్యర్థులు పోటీ లో ఉన్నారు. అందులో వైఎస్‌ఆర్‌సీపీ పార్లమెంట్‌ అభ్యర్థిగా శ్రీమతి బొత్స ఝాన్సీలక్ష్మి సీరియల్‌లో మొదటి స్థానంలో ఉన్నారనేది విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఆమెతో పాటు విశాఖ పార్లమెంట్‌ పరిధిలోని మిగతా శాసనసభ నియోజకవర్గ వైఎస్‌ఆర్‌ సీపీ అభ్యర్థులందర్నీ కూడా గెలిపించేందుకు రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై ఓట్లు వేయాలని కోరుతున్నాం. విశాఖతో పాటు ఉత్తరాంధ్రలో ఫ్యాన్‌ ప్రభంజనం మార్మోగుతోంది.  

 

*2024 ఎన్నికల మ్యానిఫెస్టో విడుదలపై హర్షంః*

ఎన్నికల వేళ కీలక దశ ఆరంభమైంది. ఇవాళ మా పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు. గత ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించి అమలు చేసిన  నవరత్నాల పథకాలుతో పాటు అదనంగా కొన్ని కార్యక్రమాల్ని ఆయన ఈసారి ప్రకటించారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమమే పరమావధిగా ప్రకటించిన వైఎస్‌ఆర్‌సీపీ – 2024 ఎన్నికల మ్యానిఫెస్టోపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

*చెప్పింది చేసే ముఖ్యమంత్రి జగన్‌ గారు ఒక్కరేః*

కిందటి ఎన్నికలప్పుడే మా అధినేత శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాకొక మాట చెప్పారు. రాజకీయాల్లో ఎవరెన్ని చెప్పుకున్నా.. మనకు మాత్రం ఎన్నికల మ్యానిఫెస్టో అనేది ఒక బైబిల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీతగా ఉంటుందన్నారు. కనుక, దాన్ని పవిత్రంగా చూసుకుంటూ గడచిన ఐదేళ్ల కాలంలో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం మ్యానిఫెస్టోలోని ప్రతీ అంశాన్ని తూ.చా తప్పకుండా పాటించి అమలు చేసింది. 99 శాతం హామీల్ని నెరవేర్చింది. అలవికాని హామీలు కాకుండా.. చేసేదే చెప్పడం.. చెప్పిందే చేసి చూపే ముఖ్యమంత్రి దేశంలోనే జగన్‌ గారు ఒక్కరేనని ఆయన నిరూపించుకున్నారు.

 

*మంచి జరిగితేనే ఆశీర్వదించమన్న ధైర్యం జగన్‌ గారిదిః*

చంద్రబాబు పాలన మాదిరిగా చెప్పిందొకటి చేసిందొకటిగా.. మోసం, దగాలను ఆశ్రయించే దౌర్భాగ్య పరిస్థితి వైఎస్‌ఆర్‌సీపీకి లేదు. మా నాయకుడి విధానం అది కాదు. గడచిన ఐదేళ్లకాలంలో రూ.2.75 లక్షల కోట్లు లబ్ధిని డీబీటీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అమ్మ ఒడి, ఆసరా, చేయూత, చేదోడు, జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన, ఆరోగ్యశ్రీ, రైతుభరోసా వంటి పథకాల్ని సమర్ధంగా అమలు చేసి వీటన్నింటితో మీ ఇంట్లో మంచి జరిగితేనే మరోమారు మమ్మల్ని ఆశీర్వదించమన్న ధైర్యం మా జగన్‌ గారిది. ఆ ధైర్యంతోనే మేమూ ప్రజల ముందుకు వెళ్లి ఓట్లు అడుగున్నాం. ఇవాళ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా ప్రతీ అంశాన్ని నెరవేర్చి అభివృద్ధిని ప్రజల కళ్లముందు సాక్షాత్కరించే విధంగా పనిచేస్తామని చెబుతున్నాం. 

 

*పేదల జీవనప్రమాణాలు పెంచే ధ్యేయంతో..ః*

పేద, మధ్యతరగతి కుటుంబాల జీవనప్రమాణాలు పెంచడమే ధ్యేయంగా అన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకుని వైఎస్‌ఆర్‌సీపీ ఎన్నికల మ్యానిఫెస్టోను కిందటి ఎన్నికల్లో ప్రకటించారు. అమల్లో నిరూపించారు. ఆ ప్రకారంగానే మళ్లీ ఈసారి కూడా మ్యానిఫెస్టో రూపకల్పన చేశారు. గతంలో మాదిరిగానే నవరత్నాల పథకాలన్నీ కొనసాగిస్తూ .. పేద మధ్యతరగతి వర్గాల ఆత్మ గౌరవాన్ని పెంపొందించేలా మరిన్ని కొత్త కార్యక్రమాలను జోడించడం జరిగింది. ఏడాదికేడాదికి పేదల అభివృద్ధి, సంక్షేమం తాలుకూ ప్రగతి కనిపించేలా అడుగులు వేయబోతున్నాం. 

 

*రుణమాఫీలపై చంద్రబాబు మోసాలు మరువలేని చరిత్రః*

చంద్రబాబు మోసాలు, దగాలను నమ్ముకునే రాజకీయం చేయడంలో దిట్ట. ఆయన 2014 ఎన్నికల హామీల్లో రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ అన్నాడు. ప్రజలు నమ్మి ఓట్లేసి అధికారంలో తెస్తే.. రుణమాఫీల అమల్లో చేతులెత్తేసి రైతుల్ని, డ్వాక్రా అక్కచెల్లెమ్మలను దారుణంగా మోసం చేశాడు. కనుకే, 2019లో వారంతా కలిసి ఫ్యాన్‌ గుర్తుపై ఓట్లేసి సైకిల్‌ను తుక్కుతుక్కు చేస్తే.. చంద్రబాబు పెట్టిన రుణమాఫీ బకాయలన్నీ మా నాయకులు శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారు చెల్లించడం జరిగింది. ఇది వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం తాలుకూ నిబద్ధత. చంద్రబాబు చేసిన మోసాలు అనేవి మరువలేని చరిత్రగా మిగిలాయి. మహిళలకు వడ్డీలేని రుణాలతో పాటు ఆసరా సాయం ఎంత గానో వారికి సాయపడింది. పొదుపుసంఘాల ఆర్థిక పరిపుష్టికి జగన్‌ గారి పాలన దోహదపడిందని మేం గర్వంగా చెప్పుకుంటున్నాం. 

 

*మహిళలు, రైతులు, కార్మికుల్లో ఆనందంః*

మహిళలు, రైతుల పట్ల మనసున్న ప్రభుత్వం మాది. పేద కుటుంబాల్లో పిల్లల విద్య ఆర్థికభారం కాకూడదనే ఉద్దేశంతో అమ్మఒడి కింద ఏటా రూ.15వేలకు తోడు ఈసారి మరో రూ.2వేలు అదనంగా కేటాయిస్తూ జగన్‌ గారు హామీనిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల ఆర్థికపరిస్థితిని మెరుగుపరుచు కోవడానికి ఏడాదికి రూ.18,750 చొప్పున చేయూత కింద లబ్ధిని ఇప్పటికే మూడు దఫాలుగా జమచేశాం. నాల్గో దఫాకు కూడా మా అధినేత జగన్‌ గారు బటన్‌ నొక్కడం జరిగింది. అయితే, ఆ నాల్గో దఫా పంపిణీ ఎన్నికల కమిషన్‌ పరిశీలనలో ఉంది. కాపునేస్తం, ఈబీసీ నేస్తం పథకాలనూ పకడ్బందీగా అమలు చేయగలిగాం. రైతులకు పంట పెట్టుబడి కింద అందించే రైతుభరోసా విషయానికొస్తే.. గతంలో మూడు దఫాలుగా ఏటా ఇస్తున్న రూ.13,500 ను ఈసారి కూడా మూడు దఫాల కిందనే రూ.16 వేలకు పెంచారు. సొంత ఆటో, ట్యాక్సీ నడిపేవారికి వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర కింద ఏటా రూ.10 వేల చొప్పున గతంలో ఒక్కొక్కరికీ రూ.50వేలు అందించాం. ఇక నుంచి ఆటో, ట్యాక్సీలతో పాటు సొంత లారీ, ట్రక్‌ డ్రైవర్లకు సైతం ఈ పథకాన్ని అమలు చేయాలని జగన్‌ గారు నిర్ణయించడం ఆనందించదగ్గ విషయంగా మీతో పంచుకుంటున్నాను. అదేవిధంగా వారికి రూ.10 లక్షల ప్రమాదబీమా సౌకర్యం కల్పించడం జగన్‌గారి మంచిమన సుకు నిదర్శనం. 

 

*అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు తీపికబురుః*

ఉద్యోగ సంఘాల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన సబ్‌కమిటీలో నేనొక సభ్యుడ్ని. గతంలో సమావేశానికి వెళ్లిన ప్రతీసారి అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ప్రభుత్వ సంక్షేమ పథకాల వర్తింపుపై సబ్‌కమిటీని పదేపదే అడిగేవారు. అరాకొరా జీతాలతోనూ ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్నంత మాత్రాన తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించడం లేదని.. తమ పిల్లల చదువు, వైద్యం భారంగా ఉందనే వారు. పారిశుద్ధ్య కార్మికులు, అంగన్‌వాడీలు, మిగతా ప్రభుత్వ శాఖల్లో అవుట్‌సోర్సింగ్‌ కింద పనిచేసే అప్కాస్‌ ఉద్యోగులంతా గతంలో మాకు వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. ఆనాడు మేం కూడా వారి విన్నపాలను తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామినిచ్చాం. ఆమేరకు మనసున్న ముఖ్యమంత్రిగా జగన్‌ గారు అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కుటుంబాల కష్టాలు ఆలకించిన వ్యక్తిగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. జీతాలకింద వచ్చే రూ.10వేల, రూ.12వేలు వారి ఆర్థికభరోసాకు సరిపోదని తలచి.. ప్రభుత్వం పేద వర్గాలకు అందించే ప్రతీ పథకానికి వారు కూడా అర్హులని నిర్ణయించి తీపి కబురు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని ఎన్నో వేలమంది అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కుటుంబాలకు మేలు జరుగనున్నది. 

 

*రూ.3,500 పింఛన్‌తో అవ్వాతాతల్లో సంతోషంః*

అవ్వాతాతలకు, వితంతువులకు ప్రతీ నెలా మొదటి తేదీ తెల్లవారుజామునే ఇంటికొచ్చి మరీ అందించే ప్రభుత్వ పింఛన్‌ కానుకనూ జగన్‌ గారు పెంచారు. నిన్నటిదాకా రూ.3వేలుగా అందిన పింఛన్‌ కానుక రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి రూ.3,500 గా పెరగనుంది. వృద్ధాప్యంలో ప్రతీ చిన్న విషయానికి ఎవరిపైనా ఆధారపడకుండా ప్రభుత్వ ఆసరా కోసం ఎదురుచూసే వారికి ఇకనుంచి పింఛన్‌ కానుక పెరుగుతూ రూ.3,500 గా అందుతోందని చెప్పేందుకు సంతోషిస్తున్నాం. 

 

*రాష్ట్ర సమున్నత అభివృద్ధికి 3 రాజధానుల ఏర్పాటుః*

రాష్ట్ర సమున్నత అభివృద్ధికి, పరిపాలనా వికేంద్రీకరణే ధ్యేయంగా రాష్ట్ర రాజధాని విషయంలోనూ జగన్‌ గారు మ్యానిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పారు. విశాఖపట్టణాన్ని ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా , అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించడం మా నాయకుడి ధైర్యం.

    *పట్టణ పేదల సొంతింటి కల నెరవేరుస్తాంః*

2019 మేనిఫెస్టోలో చెప్పినట్టుగా పట్టణ పేదల ఇళ్ల నిర్మాణంపై అప్పులభారం ప్రభుత్వమే భరించి సొంతింటి కలను సాకారం చేశాం. అదేమాదిరిగా ఈసారి కూడా పట్టణ ప్రాంతాల్లో అర్బన్‌ వెంచర్లను డెవలప్‌ చేసి వచ్చే ఐదేళ్లల్లో రూ.వెయ్యి కోట్లు ఏటా ఇస్తూ రూ.2 వేల కోట్లు కార్పస్‌ ఫండ్‌తో ఎంఐజీ ఇళ్ల అభివృద్ధి బాధ్యతను ప్రభుత్వం తీసుకోనుందని సంతోషంగా చెబుతున్నాం.  

 

*పోర్టులు, హార్బర్ల పూర్తితో ఉపాధి అవకాశాలుః*

ఇప్పటికే సుమారు రూ.20వేల కోట్లతో నాలుగు పోర్టులు, 10 ఫిష్షింగ్‌ హార్బర్లు, 6 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లుతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తికానుంది. విశాఖలో స్టార్టప్‌హబ్, ప్రతీ జిల్లా కేంద్రంలో స్కిల్‌ కాలేజీ, ప్రతీ నియోజకవర్గంలో స్కిల్‌హబ్‌ ఏర్పాటు చేసేందుకు హామీనిస్తున్నాం. క్రమం తప్పకుండా గ్రూప్‌–1, గ్రూప్‌ 2 పరీక్షల నోటిఫికేషన్లు ప్రకటించి.. యూపీఎస్సీ తరహాలో పరీక్షల నిర్వహణ ఉంటుందని యువత ఉపాధికి ఎలాంటి ఢోకా ఉండదని మేనిఫెస్టో హామీని అక్షరాలా నెరవేర్చుతామని చెబుతున్నాం. 

 

*చంద్రబాబు హయాంలో అప్పులు అధికంః*

రాష్ట్ర ఆర్థికపరిస్థితిపై చంద్రబాబుతో పాటు మిగతా నేతలు రోజుకో మాట మాట్లాడుతూ విషప్రచారం చేస్తున్నారు. మేము అప్పులు చేస్తున్నామని.. చేసిన అప్పులనూ వృథా చేస్తున్నామంటున్నారు. అయితే, మేమెక్కడా వృథా చేయలేదు. మానవ వికాశం కోసం, ఆర్థికవనరుల్ని వెచ్చించి మన జీడీపీని, పర్‌క్యాప్టివ్‌ ఇన్‌కమ్‌ను పెంచుకుంటూ వెళ్లాం. ప్రజల కొనుగోలు శక్తిని పెంచుకుంటూ విద్య, వైద్యంకు పెట్టే ఖర్చును కూడా పెట్టుబడిగా చూశాం. చంద్రబాబు హయాంలో ప్రతేటా రూ.15,227 కోట్లు మాత్రమే క్యాపిటల్‌ ఎక్సెపెండిచర్‌గా ఖర్చు చేస్తే .. మరి, మేము రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాల భవనాలు, విలేజ్‌ క్లినిక్‌లు, నాడు–నేడు కింద ఇలా తీసుకుంటే ఏటా రూ.17,757 కోట్లు ఖర్చు చేశాం. అంటే, ప్రతేటా రూ.2,500 కోట్లు అదనంగా క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌ కింద ఖర్చు పెట్టాం. చంద్రబాబు హయంలోనే అప్పులు అధికంగా చేశారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులకు మించి రూ.28,457 కోట్లు అధిక అప్పు తీసుకున్నారు. అదే వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చేసరికి, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి లోపే మైనస్‌ రూ.366కోట్లు మాత్రమే అప్పు చేసింది. బాబు హయాంలో  రాబడి కంటే 7.5 శాతం అదనంగా అప్పులు చేశారు. అదే ఇప్పుడు చూస్తే అది 5 శాతమే అని చెప్పాలి. ఇది మా ప్రభుత్వం తాలుకూ ఘనతగా చెప్పుకోవచ్చు. 

 

*పవిత్ర మ్యానిఫెస్టోను ఆదరించి వైఎస్‌ఆర్‌సీపీని గెలిపించండిః*

ఆర్థిక వనరులు, ఆర్థికభారంపై కులంకూషంగా విశ్లేషణ చేసి మేం నవరత్నాల పథకాల అమలుకు ఐదేళ్ల కిందట ధైర్యం చేశాం. ఈరోజు ప్రభుత్వ పనరులు, ఆదాయం, ఖర్చులను బేరీజే వేసుకుని వాటిని కొనసాగిస్తూనే అదనంగా ఇంకా కార్యక్రమాల అమలుకు జగన్‌ గారు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు మాదిరిగా మోసం, దగాలను మనసులో ఉంచుకుని ప్రజలకు మాటిచ్చి తప్పే వైఖరి మా నాయకుడు జగన్‌ గారిలో ఉండదు. లేదు. అదే ఆయన విశ్వసనీయత. వైఎస్‌ఆర్‌సీపీకి ఉన్న బలం. ఆ నమ్మకంతోనే ప్రజల తాలూకూ ఆశీర్వాదం కోరుతూ ఇవాళ పవిత్ర మ్యానిఫెస్టోను ప్రకటించడం జరిగింది. కర్షక, కార్మిక, రైతు, యువత, మహిళల అభ్యున్నతికి వైఎస్‌ఆర్‌సీపీ మ్యానిఫెస్టో ఒక దిక్సూచిలా పనిచేస్తుందనడంలో ఎలాంటి సందేహంలేదు. ప్రతీ ఒక్కరీ ఇళ్లల్లో పేదల భద్రతకు భరోసాగా మ్యానిఫెస్టో కాపీని ఉంచుకుని వైఎస్‌ఆర్‌సీపీ గుర్తు ఫ్యాన్‌కు ఓట్లేసి జగన్‌ గారి ప్రభుత్వాన్ని మరలా తెచ్చుకోవాలని విన్నవించుకుంటున్నాను. 

Back to Top