బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్‌  అభివృద్ధి ఇంటింటా..!

వైయ‌స్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌గాంధీ 

వైయ‌స్ జగన్‌ గారి పాలనలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు

కేంద్ర నివేదికల్లో అభివృద్ధి సూచికలే ఇందుకు కొలమానం

వైయ‌స్ జగన్‌ గారి హయాంలో నిరుద్యోగ రేటు తగ్గింది- పెట్టుబడులు పెరిగాయి

వాస్తవాల్ని దాచి అబద్ధాలను ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా, ప్రతిపక్షాలు

వైయ‌స్‌ఆర్‌సీపీ రాష్ట్ర్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌ గాంధీ

తాడేప‌ల్లి:  చంద్ర‌బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. వైయ‌స్ జగన్‌ గారి అభివృద్ధి ఇంటింటా..! క‌నిపిస్తుంద‌ని వైయ‌స్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌గాంధీ తెలిపారు. చంద్రబాబు, వైయ‌స్ జగన్ హాయంలో ఎవరెంత అప్పు చేశారనేది గణాంకాలు క్లియర్‌గా చెబుతున్నాయి. గడచిన ఐదేళ్ల కాలంలో వైయ‌స్‌ జగన్‌ గారి ప్రభుత్వం చేసింది రూ.2.80 లక్షల కోట్లు కాగా, ప్రతిపక్షాలు, పచ్చమీడియా చేస్తున్న ప్రచారం ప్రకారం.. రూ.11 లక్షల కోట్లు అప్పు ఎక్కడ్నుంచి వచ్చిందో వారే సమాధానం చెప్పాలి. దీనికి సమాధానం చంద్రబాబు చెబుతాడా..? ఈనాడు రామోజీరావు చెబుతాడా..? అని నిల‌దీశారు. తాడేపల్లి వైయ‌స్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర‌ అధికార ప్రతినిధి  కొండా రాజీవ్‌గాంధీ మీడియాతో మాట్లాడారు.

అబద్ధాల ప్రచారంలో ప్రతిపక్షాలు, పచ్చమీడియాః
ముఖ్యమంత్రి జగన్ గారి నాయకత్వంలో ఈ 5 ఏళ్ళలో జరిగిన సంక్షేమం - అభివృద్ధిపై చర్చించేందుకు ప్రతిపక్షాలు, పచ్చమీడియాకు ధైర్యం లేక, వారు ప్రతీరోజూ మూడు మోసాలు, ఆరు అబద్ధాలతో కాలం వెళ్లదీస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక పరిస్థితి, అప్పుల గురించి చెప్పిన అబద్ధాన్నే పదేపదే చెబుతూ ఊదరగొడుతున్నారు. లేని విషయాన్ని ఉన్నట్లు.. ఉన్న విషయాన్ని లేనట్లు ప్రజల్ని నమ్మించే విధంగా రోజూ విషపూరిత కథనాలను ఎల్లో మీడియా వండి వారుస్తుంది. 

రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టింది చంద్రబాబేః
జగన్‌మోహన్‌రెడ్డి గారి హయాంలో చేసిన అప్పులెంత..? చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అప్పుల సంగతేంటని ప్రభుత్వ అధికారిక లెక్కలను చూస్తే.. ప్రతిపక్షాల బూటకపు ప్రచారం, ఎల్లో మీడియా చెత్తరాతల బండారం బయటపడుతుంది. చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేనాటికి ఏపీ అప్పు రూ.1.53 లక్షల కోట్లు ఉంది. దాన్ని చంద్రబాబు రూ.4.12 లక్షల కోట్లుకు పెంచాడు. అంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉండి రూ.2.70 లక్షల కోట్లు అప్పులు చేశాడనేది అర్ధం. అదే జగన్‌మోహన్‌రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పులు రూ.7 లక్షల కోట్లుకు పెరిగింది. అంటే, గడచిన ఐదేళ్ల కాలంలో రూ. 2.80 లక్షల కోట్లు అప్పులు చేయడం జరిగింది. 

- చంద్రబాబు, జగన్‌ గారి హాయంలో ఎవరెంత అప్పు చేశారనేది గణాంకాలు క్లియర్‌గా చెబుతున్నాయి. గడచిన ఐదేళ్ల కాలంలో జగన్‌ గారి ప్రభుత్వం చేసింది రూ.2.80 లక్షల కోట్లు కాగా, ప్రతిపక్షాలు, పచ్చమీడియా చేస్తున్న ప్రచారం ప్రకారం.. రూ.11 లక్షల కోట్లు అప్పు ఎక్కడ్నుంచి వచ్చిందో వారే సమాధానం చెప్పాలి. దీనికి సమాధానం చంద్రబాబు చెబుతాడా..? ఈనాడు రామోజీరావు చెబుతాడా..? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెబుతాడా..? చంద్రబాబును ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాన్న ఆలోచనతో, ఒకవైపు టీడీపీ, మరోవైపు ఎల్లోమీడియా సంస్థలు రాష్ట్ర అప్పులు మీద పదేపదే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. వీళ్ళ ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. 

కేంద్ర నివేదికల గణాంకాలనూ నమ్మరా..?
దేశ ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌గారు ఆంధ్రప్రదేశ్‌ అప్పుల పరిస్థితిపై చాలా స్పష్టంగా పార్లమెంటు సాక్షిగా  చెప్పారు. 31 జూలై 2023న ఆమె లోక్‌సభలోనే కేటగిరీల వారీగా రాష్ట్ర అప్పులను ప్రకటించారు. అప్పటికి, జగన్‌ గారి ప్రభుత్వం చేసిన అప్పు రూ.1.78 లక్షల కోట్లుగా గణాంకాలతో సహా వివరించారు. మరి, కేంద్ర ఆర్థిక గణాంకాలను మీరు పరిగణలోకి తీసుకోరా..? అయితే, ప్రభుత్వం నేరుగా చేసే అప్పు, ప్రభుత్వ పూచీకత్తుతో ప్రభుత్వ రంగ సంస్థలు చేసే అప్పులంటూ చాలా రకాలు ఉంటాయి. వాటన్నింటినీ, ఇప్పటి వరకు మొత్తం కలుపుకున్నప్పటికీ సుమారు రూ.7 లక్షల కోట్లు ఉంటుంది. అందులో గడచిన ఐదేళ్లలో జగన్‌ గారి ప్రభుత్వం చేసిన అప్పులు రూ.2.80 లక్షల కోట్లు మాత్రమే. అయితే, ప్రతిపక్షాలు గానీ, వాటికి వత్తాసుపలికే ఎల్లోమీడియా గానీ రోజుకో రీతిగా తమదైన శైలిలో అబద్ధాలను ప్రజల మెదళ్లలోకి చొప్పించాలని ప్రయత్నిస్తున్నాయి. 

2019లో టీడీపీ దిగేనాటికి ఖజానాలో రూ.100 కోట్లే ఉన్నాయని చెప్పలేదా?
చంద్రబాబు అధికారంలో నుంచి దిగిపోయే నాటికి రాష్ట్ర బడ్జెట్, అప్పుల పరిస్థితిపై ఆనాడు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు స్వయంగా ఒక మాట చెప్పారు. మేము చేయాల్సిన అప్పులన్నీ చేసేశాం. పరిమితికి మించి అప్పులు చేసేశాం. ఇంక, ఈ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా అప్పు పుట్టదు. రాష్ట్ర ఖజానాలో రూ. 100 కోట్లు మాత్రమే ఉన్నాయి.  అలాంటప్పుడు ఈ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని ఎలా ఇస్తాడు..? అంటూ ప్రశ్నించాడు. ఇది వాస్తవం కాదా..? చంద్రబాబు నాయుడు ఆయన పాలన ముగిసే నాటికి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, జగన్‌ గారి చేతిలో పెట్టి వెళ్లాడు. మరి, ఆయన రాష్ట్ర పగ్గాలు చేపట్టాక, సంక్షేమం-అభివృద్ధిలో నెంబర్‌.1గా రాష్ట్రాన్ని పరుగులు పెట్టించారు.  మరి, అదే ప్రభుత్వం, అదే రాష్ట్రం, జగన్ గారు డీబీటీ ద్వారా రూ. 2.70 లక్షల కోట్లు పేదలకు నేరుగా అందించారు. 

బాబు అభివృద్ధి అంతా ఎల్లో మీడియా రాతల్లోనే
రాష్ట్రం అభివృద్ధి చెందిందా .. ? లేదా..?అనే విషయంపై కొలమానాలు ఆ రాష్ట్ర అభివృద్ధి సూచికలే కదా..? జీఎస్‌డీపీ వృద్ధిరేటును పరిగణలోకి తీసుకుని ఒక రాష్ట్ర అభివృద్ధిని మనం చెప్పుకోవచ్చు. అలా చూస్తే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే 2015లో జీఎస్‌డీపీ వృద్ధిరేటు 9.2 శాతంతో ఏపీ 7వ స్థానంలో ఉండేది. ఆయన పదవి నుంచి దిగిపోయే సమయానికి అంటే 2019లో 5.4 శాతంతో ఈ రాష్ట్రాన్ని 22వ స్థానానికి దిగజార్చాడు. దీన్నిబట్టి అప్పట్లో చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడా..? లేదంటే, అధఃపాతాళానికి తొక్కాడా..? అనేది అందరూ ఆలోచించాలి. 

జగన్‌ గారు చేసిన అభివృద్ధి ఇంటింటా కనిపిస్తోందిః
మరి, అదే జగన్‌మోహన్‌రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర అభివృద్ధి ఇంటింటా కనిపిస్తోంది. ప్రతి గ్రామం మారింది. కొత్తగా వ్యవస్థలు ఏర్పడ్డాయి. సంస్కరణలు తెచ్చారు. చంద్రబాబు దిగిపోయేటప్పుడు 5.4 శాతం వృద్ధిరేటు ఉన్న రాష్ట్రాన్ని, ఇప్పుడు 18.4 శాతం వృద్ధిలోకి తెచ్చి అభివృద్ధిలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టించారు జగన్ గారు.  చంద్రబాబు, ఆయన పార్టీ తెలుగుదేశం నాయకుల్లా మేము కాకిలెక్కలు చెప్పడం లేదు. వైఎస్‌ఆర్‌సీపీ కాగ్‌ లెక్కలనే గర్వంగా చెబుతోంది. 

16 లక్షల ఈపీఎఫ్ అకౌంట్లు పెరిగాయంటే, దానర్థం ఏమిటి..?
ఏపీలో ఉద్యోగాలు పెరిగాయి. ఆదాయం పెరిగిందని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కొత్తగా తెరుచుకున్న ఈపీఎఫ్‌ అకౌంట్ల సంఖ్య సుమారుగా 16 లక్షలకు పైగా ఉన్నాయి. ఈ విషయాన్ని రాజ్యసభలో స్వయంగా కేంద్ర కార్మికశాఖ మంత్రి అధికారికంగా వెల్లడించారు. అంటే, 16 లక్షల కొత్త ఉద్యోగాలను జగన్‌మోహన్‌రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సృష్టించారు. మరి, ఇది అభివృద్ధి కాదా..? అని పచ్చమీడియాను, ప్రతిపక్షాలను ప్రశ్నిస్తున్నాను. 

తలసరి ఆదాయంలో 18 నుంచి 9వ స్థానానికి పెరిగాంః
రాష్ట్ర తలసరి ఆదాయం లెక్కలు చూస్తే, చంద్రబాబు ఉన్నప్పుడు 2018–19కి గాను రూ.1.5లక్షల తలసరి ఆదాయంతో ఏపీ 18వ స్థానంలో ఉండేది. అదే జగన్‌మోహన్‌రెడ్డి గారి హయాంలో తలసరి ఆదాయం 2.1 లక్షలకు పెరగడంతో పాటు దేశంలో మన రాష్ట్రం 9వ స్థానానికి చేరింది.

జగన్‌ గారి హయాంలో తగ్గిన నిరుద్యోగ రేటుః
ఇక, చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగ శాతం రేటు 5.3 శాతం ఉండేది. కానీ, ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే అది 4.1 శాతానికి తగ్గింది. దీన్నిబట్టి నిరుద్యోగ శాతం తగ్గడం అంటే కొత్త ఉద్యోగాలు రావడామా..? కాదా..? అనే విషయంపై చంద్రబాబు, ఆయన వత్తాసుపలికే పచ్చమీడియా సమాధానం చెప్పాలి. ఇలా చెప్పుకుంటూపోతే, నిప్పుకు చెదపట్టడం ఎంత అబద్ధమో.. జగన్‌మోహన్‌రెడ్డి గారి పాలనలో అభివృద్ధి లేదు అనేదీ అంతే అబద్ధం. 

అభివృద్ధిలో జగన్ గారి విజన్ ఇదిః
– అభివృద్ధి విషయంలో జగన్‌మోహన్‌రెడ్డి గారిది విజన్‌ అయితే.. చంద్రబాబుది పాయిజన్‌.
– అభివృద్ధికి కేరాఫ్‌ అడ్రస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారైతే.. అవినీతికి, అరాచకాలకు కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబు నాయుడు అని చెప్పాలి. 
– చంద్రబాబు నాయుడు పాలనలో అభివృద్ధి అంటే కేవలం పచ్చ మీడియాలో మాత్రమే కనబడుతుంది. అదే జగన్‌ గారి పాలనలో అభివృద్ధి అంటే ప్రజల్లో వినబడుతుంది.
– జగన్‌ గారు వచ్చాక రాష్ట్రంలో అప్పులు తగ్గాయి. పెట్టుబడులు పెరిగాయి. ఉద్యోగాలు పెరిగాయి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. 
– జగన్‌ గారు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాక, అభివృద్ధి, సంక్షేమాన్ని జోడుగుర్రాల్లా చేసుకుని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. 
– 4 పోర్టులు, 10 షిప్పింగ్‌ హార్బర్లు, 127 పరిశ్రమలు, 3 ఇండస్ట్రీయల్‌ కారిడార్లు, 10 వేలకు పైగా రైతుభరోసా కేంద్రాలు, 15వేలకు పైగా సచివాలయాలు, 17 కొత్త మెడికల్‌ కాలేజీలు, భారీ ప్రాజెక్టులు, పెట్టుబడులు ఇవన్నీ కేవలం గడచిన 5 ఏళ్లల్లో జగన్‌మోహన్‌రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తెచ్చినవి కావా..?
– మారుతోన్న బడులు, బాగుపడుతున్న ఆస్పత్రులు, ప్రజల ఇంటి వద్దనే అందుతోన్న పౌరసేవలు, దేశానికి తలమానికంగా ఉన్నటువంటి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, గ్రామస్వరాజ్యాన్ని తలపించే వాలంటరీ వ్యవస్థ ఈరకంగా అన్ని వర్గాలకు మేలు చేసేవిధంగా జగన్‌ గారి పాలన ఉంది. ఈ విషయం ఎక్కడ చూసినా ప్రజల నోట వినిపిస్తోంది. 

14 ఏళ్ళు అధికారంలో ఉండి ఏం మేలు చేశారు బాబూ..?
ప్రజలకు మేలు చేసే ముఖ్యమంత్రిని పట్టుకుని నోటికిరాని విధంగా విమర్శించే చంద్రబాబూ.. మీరు 14 ఏళ్ళు అధికారం వెలగబెట్టి ఈ రాష్ట్రానికి ఏం మేలు చేశారు..? కొత్తగా ఒక్క పోర్టునైనా కట్టగలిగావా..? ఒక ఫిష్షింగ్‌ హార్బర్‌ నైనా నిర్మించలేనందుకు మీరు సిగ్గుపడాలి. కనీసం, ఒకే ఒక్క మెడికల్‌ కాలేజీనైనా తేలేకపోయావే..? సొంత నియోజకవర్గం కుప్పంకు రెవెన్యూ డివిజన్‌ తెచ్చుకోలేని అసమర్ధుడు చంద్రబాబు. 

- చంద్రబాబు, ఏ వర్గానికీ మేలు చేయలేదు. అదే మా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి గారు మాత్రం అణగారిన వర్గాలకు అండగా ఉండి వారిని అభివృద్ధిలోకి తెచ్చిన మహోన్నతుడు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలను అక్కునజేర్చుకుని ప్రతీ ఒక్కరినీ అభివృద్ధిలో భాగస్వామ్యుల్ని చేస్తున్నారు. 

పెట్టుబడులు రాబట్టడంలో గుజరాత్ కంటే మెరుగ్గా ఉన్నాంః
ప్రాజెక్ట్స్‌టుడే సర్వే ప్రకారం.. గడచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల్లో గుజరాత్‌ రాష్ట్రం కంటే ఆంధ్రప్రదేశ్‌ చాలా మెరుగైన స్థితిలో ఉంది. ఈ వాస్తవాలను పచ్చమీడియా ఎప్పుడూ చెప్పదు. కాబట్టే.. ప్రజలకు తెలిసేలా మేం నిజాలు తెలియజెబుతున్నాం. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుంది కాబట్టే.. జగన్‌మోహన్‌రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రతిపక్షాలు, పచ్చమీడియా ఎన్ని తప్పుడు కథనాలు, అబద్ధాలతో దుష్ప్రచారం చేసినా ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. 

Back to Top