జగన్ నిర్బంధం హక్కుల ఉల్లంఘనే: జూపూడి

చెన్నై‌ :

ఒక ఎం.పి.ని ప్రజాసేవ చేయనీయకుండా అక్రమంగా నిర్బంధించడం మానవ హక్కుల ఉల్లంఘనే అని వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు అభివర్ణించారు. చెన్నైలో ఆయన మంగళవారంనాడు మీడియా సమావేశంలో మాట్లాడారు. కడప ఎం.పి. శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిని అక్రమ కేసులతో ఏడాదిగా జైల్లో పెడితే నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించేది ఎవరని జూపూడి ఆవేదన వ్యక్తం చేశారు.

సిఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తోడుదొంగలై రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని జూపూడి దుయ్యబట్టారు. శ్రీ జగన్‌ను జైల్లోనే పెట్టి రాబోయే ఎన్నికల్లో గెలవాలని తాపత్రయపడుతున్న వారిద్దరికీ భంగపాటు తప్పదన్నారు. రాష్ట్రంలో కుక్కలు చింపిన విస్తరిలా తయారైన కాంగ్రెస్ రాజకీయాలను గమనిస్తే ఈ ఏడాది చివరికే ఎన్నికలు వచ్చే అవకాశం ‌ఎక్కువగా ఉందన్నారు. ఓటమి భయంతో చంద్రబాబు నాయుడు బిజెపితో స్నేహం కోసం అర్రులు చాస్తున్నారని ఎద్దేవా చేశారు.

రానున్న ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ 191కి పైగా అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలను గెలిచి తీరుతుందని ‌జూపూడి ప్రభాకరరావు ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ తమిళనాడు విభాగం ‌నాయకుడు శరత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Back to Top