నా విజయం మహానేత చలవే
హైదరాబాద్
: ‘నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గానికి ఇటీవలి ఉపఎన్నికలలో విజయం నాది కాదు. అది పూర్తిగా దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్‌దే. నన్ను చూసి ప్రజలు ఓట్లు వేయలేదు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుట్రలకు బలైపోయిన వైయస్ఆర్ కుమారుడు ఎంపీ శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడినందుకే వేశారు. అందుకే 2004లో కేవలం 50 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన నేను ఈ ఉపఎన్నికలలో రెండున్నర లక్షల మెజార్టీతో గెలవగలిగాను’ అని ఎంపీ మేకపాటి రాజ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘కదలిక' పత్రిక ఇమామ్ రాసిన ‘జనం చెక్కిన శిల్పం వైయస్’ పుస్తకావిష్కరణ సభలో ఆయన పాల్గొన్నారు. మహానేత చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల హృదయాలలో ఆయనకు శాశ్వత స్థానాన్ని సంపాదించి పెట్టాయన్నారు. మహానేత కారణంగా ఎందరో లబ్ధి పొందారు. కనీస అర్హత లేని వారు సైతం మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా ఎంపికయ్యారు. ఆయన అకాల మరణం తర్వాత జన హృదయాలలోంచి ఆయనను చెరిపేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా దేశం గర్వించదగ్గ నాయకుడవుతాడని మేకపాటి స్పష్టంచేశారు. కార్యక్రమంలో పార్టీ సీఈసీ సభ్యురాలు విజయారెడ్డి, రచయిత భూమన్, ఐటీ సెల్ కన్వీనర్ చల్లా మధుసూదన్‌రెడ్డి, నాయకులు శ్రీనివాసులు నాయుడు, నాగిరెడ్డి, శరత్, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు సామాజిక వైద్యుడు కిరణ్‌కుమార్‌రెడ్డి మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. మాజీ ఎమ్మెల్యే శివరామిరెడ్డి, పార్టీ అధికార ప్రతినిధులు వాసిరెడ్డి పద్మ, గట్టు రామచంద్రరావు, ఇమాం కూడా మాట్లాడారు.