పలాస: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ పథకానికి నీరుగార్చడమే కాకుండా తాజాగా హైబ్రిడ్ మోడల్ పేరుతో దాదాపు రూ.6 వేల కోట్ల దోపిడికి కుట్ర చేస్తోందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు దుయ్యబట్టారు. ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పనంగా చెల్లించే ఆ డబ్బంతా తిరిగి నారా లోకేశ్ జేబుల్లోకే చేరబోతుందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ట్రస్టు మోడల్ కన్నా ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న హైబ్రిడ్ మోడల్‌తో ఏం ఉపయోగాలున్నాయో మంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు శనివారం మీడియాతో మాట్లాడారు. – దేశానికే తలమానికంగా ఉన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా ట్రస్టు మోడల్ నుంచి హైబ్రిడ్ మోడల్‌లోకి మారుస్తామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ చెబుతున్నారు. – గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో 5 లక్షల ఆదాయ పరిమితి ఉన్న 1.43 కోట్ల కుటుంబాలకు రూ.25 లక్షల వరకు రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ సేవలను ఉచితంగా అందించడం జరిగింది. – ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన విధానం ప్రకారం రూ.2.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ కంపెనీలు, ఆపై మరో రూ.2.5 లక్షలు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యసేవలందిస్తామని చెబుతున్నారు. – ఇదే జరిగితే కాంక్లియర్ ఇంప్లాటేషన్, బోన్ మ్యారో సర్జరీ వంటి ఖరీదైన చికిత్సలు పేదవారికి ఉచితంగా అందే పరిస్థితి ఉండదు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు క్లైయిమ్‌లు తిరస్కరిస్తే పరిస్థితి ఏమిటి? అత్యవసర వైద్యానికి అప్రూవల్ రావడంలో ఆలస్యమైతే ఎవరు బాధ్యులు?. – ఆరోగ్యశ్రీలో 3257 ప్రోసీజర్లకు వైద్యం అందిస్తే, ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చే హైబ్రిడ్ మోడల్‌లో, అన్ని ప్రొసీజర్లకు వైద్యం అందుతుందన్న గ్యారెంటీ ఉండదు. ఉచితంగా మందులు ఇవ్వరు. రోగి హెల్త్ ప్రొఫైల్‌ని పరిగణలోకి తీసుకుంటే ఇన్సూరెన్స్ వర్తింపజేయరు. – ప్రైవేట్ ఇన్సూరెన్స్‌లో ఉన్న ఇబ్బందులను అధిగమించడమే లక్ష్యంగా దివంగత వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ట్రస్ట్ మోడల్‌లో తీసుకొచ్చి వేగంగా వైద్య సేవలందించే విధానం తీసుకొచ్చారు. కానీ చంద్రబాబు మళ్లీ పాత విధానానికి తీసుకెళ్తున్నారు. – ఇదంతా మంత్రి లేదా నారా లోకేష్‌కు సంబంధించిన వారి బీమా కంపెనీ కోసమే అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. – గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కోసం ఐదేళ్లలో రూ.12,677 కోట్లు ఖర్చు చేయగా.. రాష్ట్రంలో కోవిడ్ సమయంలో వైరస్ బారిన పడ్డ రెండు లక్షల మందికిపైగా బాధితులకు ఉచితంగా చికిత్స అందించి, అందు కోసం మరో రూ.744 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. – ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రకటించిన హైబ్రిడ్ మోడల్‌లో ప్రీమియమ్ చెల్లింపులు, రాష్ట్రంలో పథకం లబ్ధిదారులను పరిగణలోకి తీసుకుంటే, దాదాపు రూ.19,218 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. – అంటే గత ప్రభుత్వ హయాంలో కంటే, చాలా ఎక్కువగా వ్యయం చేస్తూ.. ఇందులో రూ.5,800 కోట్ల దోపిడికి కుట్ర కనిపిస్తోంది. – కాగా, ఇప్పుడున్న రేట్ల ప్రకారమే ఇంత అదనంగా వెచ్చిస్తుంటే రాబోయే రోజుల్లో రేట్ల పెంపు పేరుతో మరింత దోపిడీకి పాల్పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. – ఇదంతా చూస్తుంటే చంద్రబాబు జేబులు నింపుకోవడమే సంపద సృష్టి అనుకోవాలేమో!. ఏ పథకం అమలు చేయకుండానే కేవలం జీతాలు చెల్లించడానికి, పింఛన్లు ఇవ్వడానికి ఏడు నెలల్లో రూ.1.19 లక్షల కోట్ల అప్పు చేయడం ఏంటి? – ఈ ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన అప్పులకు, చేస్తున్న పనులకు ఎక్కడా పొంతన లేదు. – ఈ అప్పుల దెబ్బకు రాష్ట్రం శ్రీలంక కాదు. ఏకంగా సోమాలియా అయిపోతుందేమో అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆందోళన వ్యక్తం చేశారు.