అమరావతి : సీఆర్‌పీసీ 164 వాంగ్మూలాలు మార్చాలి.. సుప్రీంకోర్టును ఏమార్చాలి.. ఏం చేసినా ఈ నెల 21లోగా చేసేయాలి.. అందుకు ఎంతకైనా బరితెగించాలన్నది టీడీపీ కూటమి ప్రభుత్వ కుట్రగా స్పష్టమవుతోంది. సీఐడీని అడ్డుపెట్టుకుని ఈ కుతంత్రానికి పాల్పడుతోంది. చంద్రబాబుపై అవీనీతి కేసులను నీరుగార్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. న్యాయస్థానంలో సీఆర్‌పీసీ 164 కింద వాంగ్మూలాలు ఇచ్చిన అధికారుల సంగతి తేలుస్తామని ఎన్నికల ముందు లోకేశ్ హెచ్చరించినట్టుగానే.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం న్యాయస్థానాల్లో ఉన్న కేసులను ప్రభావితం చేసేలా అక్రమాలకు పాల్పడుతోంది. అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించి ఏకంగా సుప్రీంకోర్టునే ఏమార్చేందుకు బరితెగిస్తోంది. చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై ప్రస్తుతం సీఐడీ వరుసగా వాయిదాలు కోరుతుండటంపై సుప్రీంకోర్టు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేయడంతో టీడీపీ కూటమి ప్రభుత్వం హడలిపోతోంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టు అయిన చంద్రబాబు.. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే. ఆయనకు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని గతంలోనే సీఐడీ దాఖలు చేసిన పిటిషన్, సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పిటిషన్ అంశంలో సీఐడీ ప్లేటు ఫిరాయించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణకు ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహత్గీ వరుసగా వాయిదాలు కోరుతుండటం గమనార్హం. గత విచారణకు కూడా ఆయన నేరుగా హాజరు కాకుండా వర్చువల్‌గా పాల్గొని వాదనలు వినిపించకుండా మరోసారి వాయిదా కోరారు. వరుస వాయిదాలు కోరడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి వాయిదా ఇవ్వమని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. దాంతో ఈ నెల 21న సుప్రీంకోర్టు విచారణకు హాజరై చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సీఐడీ తరఫు న్యాయవాది తప్పనిసరిగా తన వాదనలు వినిపించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఆ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన కేసునే ఆయన వాదిస్తున్నారు. అంటే నిబంధనల ప్రకారం చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఆయన వాదనలు వినిపించాలి. కానీ ఈ పిటిషన్ వీగిపోయేలా చేసేందుకే ప్రస్తుత సీఐడీ ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు కుట్రలకు పదును పెడుతున్నారు. ఈ నెల 21లోగా తిమ్మిని బమ్మి చేసేందుకు బరితెగిస్తున్నారు. అబద్ధపు వాంగ్మూలాలతో ‘సుప్రీం’ను ఏమార్చే కుట్ర 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో కుంభకోణాలకు చంద్రబాబే ప్రధాన కుట్రదారు అని ఐఏఎస్ అధికారులు చెరుకూరి శ్రీధర్, అజయ్ జైన్, కాంతిలాల్ దండే స్పష్టం చేశారు. ఆమేరకు 164 సీఆర్‌పీసీ కింద న్యాయస్థానంలో వాంగ్మూలాలు నమోదు చేశారు. ఈ కేసులో ఆ వాంగ్మూలాలు కీలక సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అందుకే వారిపై టీడీపీ కూటమి ప్రభుత్వం గురి పెట్టింది. గతంలో ఇచ్చిన వాంగ్మూలాలకు పూర్తి విరుద్ధంగా అబద్ధపు వాంగ్మూలాలను సీఆర్‌పీసీ 164 కింద మరోసారి నమోదు చేయించేందుకు కుతంత్రం పన్నుతోంది. సీఆర్‌పీసీ 164 కింద ఓసారి ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరో వాంగ్మూలం ఇవ్వడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయినా సరే ఈ నెల 8న ఆ అధికారులతో అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించాలని సీఐడీ పట్టుబడుతోంది. ఈ నెల 21లోగా అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించి, ఆ విషయాన్ని ప్రస్తావించడం ద్వారా సుప్రీంకోర్టును ఏమార్చేందుకు పన్నాగం పన్నింది. అప్పుడే హెచ్చరించిన లోకేశ్ సీఆర్‌పీసీ 164 కింద న్యాయస్థానంలో వాంగ్మూలం ఇవ్వడమన్నది రాజ్యాంగం కల్పించిన అవకాశం. ప్రమాణ పూర్తిగా ఇచ్చే ఆ వాంగ్మూలాలకు న్యాయస్థానం రక్షణ కల్పిస్తోంది. కానీ అంతటి కీలకమైన 164 వాంగ్మూలాలను కూడా నారా లోకేశ్ ప్రశ్నించడం విభ్రాంతికరం. ఎన్నికల ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అవినీతిని బట్టబయలు చేస్తూ ఐఏఎస్ అధికారులు 164 సీఆర్‌పీసీ కింద వాంగ్మూలాలు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. అందుకే రెడ్‌బుక్ రాస్తున్నామని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారుల సంగతి తేలుస్తామని హెచ్చరించారు. అప్పటికే న్యాయస్థానంలో విచారణలో ఉన్న అంశంపై ఆయన మాట్లాడటం, సాక్షులను బెదిరించడం న్యాయ ధిక్కారమేనని పరిశీలకులు స్పష్టం చేశారు. లోకేశ్ ముందుగా చెప్పినట్టుగానే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. గతంలో 164 సీఆర్‌పీసీ వాంగ్మూలాలు ఇచ్చిన అధికారులను ప్రభుత్వం వేధిస్తోంది. వారితో అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించేందుకు సీఐడీ ద్వారా బరితెగిస్తోంది. ఇది కచ్చితంగా చంద్రబాబుపై అవినీతి కేసుల విచారణను ప్రభావితం చేయడమేనని పరిశీలకులు తేల్చి చెబుతున్నారు. దీన్ని న్యాయస్థానాలు తీవ్రంగా పరిగణించాలని కోరుతున్నారు.