విశాఖపట్నం: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 8న విశాఖపట్నంలో భూమి పూజ చేస్తున్న, ప్రారంభిస్తున్న ప్రాజెక్టులన్నీ గత ప్రభుత్వంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చొరవతో సాధించనవని విశాఖ జిల్లా వెయస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వెల్లడించారు. అయినా అవన్నీ తమ ఘనతగా ఈ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని ఆయన ఆక్షేపించారు. టీడీపీ ప్రభుత్వం ఏనాడూ ఉత్తరాంధ్రపై దృష్టి పెట్టలేదని విశాఖలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి స్పష్టం చేశారు. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిందన్న ఆయన, ఈ విషయంపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన వైయస్ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్. లోకేష్ అవగాహనారాహిత్యం: – ప్రధాని పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం విశాఖ వచ్చిన మంత్రి నారా లోకేష్, ఈ ప్రాంతంపై అవగాహన రాహిత్యంతో అర్థం లేకుండా మాట్లాడారు. ఇప్పటికీ తన శాఖపై పట్టు సాధించలేకపోయిన లోకేష్, గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. – గత ప్రభుత్వంలో సీఎం వైయస్ జగన్, ఉత్తరాంధ్రకు ఏమీ చేయలేదని ఆరోపించే ముందు, దీర్ఘకాలం రాష్ట్రానికి సీఎంగా ఉన్న తన తండ్రి చంద్రబాబు, ఇదే ఉత్తరాంధ్రకు ఏం చేశారో ఆత్మావలోకనం చేసుకుంటే బాగుండేది. ఉత్తరాంధ్రలో ఇవన్నీ చేసి చూపాం: – ఉత్తరాంధ్రలో దీర్ఘకాలంగా ఉన్న ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారం కోసం రూ.700 కోట్లతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, వాటర్ ప్రాజెక్టు తీసుకొచ్చాం. – దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మూలపేట పోర్టు నిర్మాణం మొదలు పెట్టాం. – విజయనగరం, పాడేరుల్లో మెడికల్ కాలేజీలు నిర్మించాం. కురుపాంలో ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ తీసుకొచ్చాం. సెంట్రల్ యూనివర్సిటీ నిర్మాణానికి భూమి పూజ చేశాం. – కోర్టు కేసులను పరిష్కరించి అన్ని అనుమతులు సాధించి ప్రతిష్టాత్మకమైన భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం మొదలు పెట్టడంతో పాటు, 2002 ఎకరాలు సమీకరించి పునరావాస పనులు కూడా పూర్తి చేయడం ఖచ్చితంగా మా ఘనతే. ఆ మొత్తం భూమికి ప్రహరీ నిర్మించాం. 2023 మేలో పనులు ప్రారంభించాం. విశాఖ అభివృద్ధిలో వైయస్ జగన్ ఘనత: – గత ప్రభుత్వంలో సీఎం వైయస్ జగన్‌గారి చొరవ వల్లనే విశాఖలో పలు సాఫ్ట్‌వేర్ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్‌తో పాటు, కన్సల్టెంట్ కంపెనీ రాండ్‌స్టాండ్, హెచ్‌ఎస్‌బీసీ స్థానంలో బ్ల్యూఎన్‌ఎస్ తీసుకొచ్చి మూడు వేల మందికి ఉపాధి కల్పించాం. – ఐటీ హిల్స్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీల ఏర్పాటుకు బీజం వేసిందే వైఎస్‌ఆర్ కుటుంబం. గతంలో 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు చేసిందేంటి? – దివంగత వైయస్ఆర్ హయాంలో స్టీల్ ప్లాంట్ విస్తరణ, స్టీల్ ప్లాంట్ పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని అడ్డుకోవడం, బీహెచ్‌పీవీని బీహెచ్‌ఈఎల్‌లో విలీనం చేయడం, బీఆర్టీఎస్ రోడ్లు, ఐటీ టవర్లు, హిందుస్థాన్ షిప్‌యార్డ్‌కి ఆర్డర్లు తెచ్చి కాపాడటం.. ఇవన్నీ జరిగాయి. – విశాఖ, రుషికొండపై టూరిజం గెస్ట్‌హౌజ్ గురించి లోకేష్ పిచ్చిగా మాట్లాడారు. అదేమైనా మా సొంత నిర్మాణమా? ప్రభుత్వానిదే కదా? ఏ అవసరం కోసమైనా వాడుకోవచ్చు కదా? ఎందుకా పిచ్చి విమర్శలు?. – ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, విశాఖ స్టీల్ ప్లాంట్‌ౖను ప్రైవేటీకరించబోమని ప్రధాని మోదీతో నిర్దిష్ట ప్రకటన చేయించాలి. ఇంకా కర్నాటక తరహాలో ఈ ప్లాంట్ కోసం రూ.15 వేల కోట్లు సాధించాలి. ఈ ప్రాజెక్టులన్నీ మేం తెచ్చినవే: – ప్రధాని నరేంద్రమోదీ కార్యక్రమంలో ఉన్న ప్రాజెక్టులన్నీ మేం తెచ్చినవే. – ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్‌ను ప్రధానితో భూమి పూజ చేయిస్తున్నారు. ఇది గత ప్రభుత్వంలో జగన్‌గారి చొరవతో నేను పరిశ్రమల శాఖ మంత్రిగా తీసుకొచ్చిందే. – అచ్యుతాపురం ప్రాంతంలో ఎన్టీపీసీకి ఇచ్చిన 1300 ఎకరాలకు వయబిలిటీ లేదని చెప్పడంతో ప్రత్యామ్నాయంగా విశాఖ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సులో వారితో చర్చించి గ్రీన్ హైడ్రోజన్ హబ్‌పై అప్పటి సీఎం జగన్, ప్రకటన చేయించి ఒప్పందం చేసుకోవడం జరిగింది. – ఇందుకోసం అన్ని అనుమతులు ఇచ్చాం. సాధించాం. గతేడాది జనవరి–ఫిబ్రవరిలో భూమి పూజ చేయాలనుకున్నా, ప్రధానమంత్రి గారికి సమయం కుదరలేదు. ఆ తర్వాత కోడ్. ఇది నిజం కాదా?. – బల్క్ డ్రగ్ పార్క్ కోసం దేశంలో 17 రాష్ట్రాలు పోటీ పడితే దక్షిణ భారతదేశం నుంచి దాన్ని సాధించిన ఏకైక రాష్ట్రం ఏపీ. ఇది ఖచ్చితంగా నాటి సీఎం వైయస్ జగన్ గారి ఘనత కాదా?. – ఈ పరిశ్రమను మొదట కాకినాడలో పెట్టాలనుకున్నాం, సాధ్యం కాకపోవడంతో, నక్కపల్లిలో 5వేల ఎకరాలు గుర్తించి ప్రతిపాదనలు పంపాం. – రైల్వై జోన్‌కి మా ప్రభుత్వ భూములే ఇవ్వలేదని లోకేష్ పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. రైల్వే శాఖకు 52 ఎకరాలు కేటాయిస్తూ, జీవీఎంసీ కమిషనర్ గత ఏడాది జనవరి 2న, ఆర్డర్ ఇచ్చారు. (అంటూ ప్రెస్‌మీట్‌లో దాన్ని చూపారు). – ఇవేవీ నిజం కావని లోకేష్ చెప్పగలరా? ఉత్తరాంధ్ర, విశాఖ అభివృద్ధికి సంబంధించి, మేమేం చేశామనే వాటిపై బహిరంగ చర్చకు సిద్ధం. మరి మీకు ఆ దమ్ముందా? – అందుకే ఇకనైనా తమపై బురద చల్లడం మానాలని, వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, పనులు చేసి చూపాలని గుడివాడ అమర్‌నాథ్ తేల్చి చెప్పారు.