బందర్‌ పోర్టు బాధితులకు జననేత బాసట

  • భూ సమీకరణ విషయంలో మాట తప్పిన సర్కార్‌
  • భూ సేకరణను వ్యతిరేకిస్తున్న 28 గ్రామాల ప్రజలు
  • ప్యాకేజీ పేరుతో మభ్యపెడుతున్న టీడీపీ నేతలు
  • బాధితుల న్యాయ పోరాటానికి వైయస్‌ఆర్‌సీపీ మద్దతు
  • డిసెంబర్‌ 1న బాధిత గ్రామాల్లో వైయస్‌ జగన్‌ పర్యటన
 కృష్ణా: ముందుకు ఒకటి చెప్పడం..తరువాత మరొకటి చేయడం చంద్రబాబుకు బాగా అలవాటైంది.  అధికారంలోకి రాకముందు ఒక మాట..అధికారంలోకి వచ్చిన తరువాత మరొక మాట మాట్లాడుతూ బాబు రెండు నాల్కలధోరణితో రైతులను నిలువునా దగా చేస్తున్నారు. రాజధాని భూముల విషయంలోనూ, బందరు పోర్టు భూముల అంశంలోనూ ప్రభుత్వం నిర్బంధ సూత్రాన్నే అమలు చేస్తోంది. రాజధానికోసం అవసరానికి మించి వేలాది ఎకరాలను స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు బందరు పోర్టు విషయంలోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. వేలాది ఎకరాలను రైతుల నుంచి బలవంతంగా లాక్కుంటూ ప్రశ్నిస్తున్న వారిని అణిచివేసేందుకు ప్రయత్నిస్తోంది. అభివృద్ధి పేరు చెప్పి.. రైతుల్లో అలజడి రేపుతోంది. పచ్చని సాగు భూములను బలవంతంగా తీసుకుంటూ ఏకపక్షంగా ముందుకెళ్తోంది. బందరు పోర్టుతో పాటు పరిశ్రమల కోసం వెలువడిన భూసేకరణ నోటిఫికేషన్‌ తో  రైతుల్లో ఆందోళన నెలకొంది. 

                      మచిలీపట్నం బందర్‌ పోర్టులో భూములును భూ సమీకరణ ద్వారా తీసుకుంటామని చెప్పిన టీడీపీ ప్రభుత్వం మాట తప్పింది. బందరు పోర్టు నిర్మాణం కోసం 4,800 ఎకరాలు కావాల్సి ఉన్నా.. సర్కార్‌ మాత్రం అవసరానికి మించి భూములను దోచుకోవాలని చూస్తోంది. దీంతో, పోర్టు బాధితుల పోరాటానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుగా నిలిచింది. బాధిత రైతులకు బాసటగా  ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రేపు అక్కడ పర్యటిస్తున్నారు. తమ బాధలు చెప్పుకునేందుకు పోర్టు బాధితులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కోసం ఎదురుచూస్తున్నారు. 

                             2012లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి 5,324 ఎకరాలను పోర్టు నిర్మాణం కోసం సేకరించేందుకు జీవో నెంబరు 11ను జారీ చేశారు. అయితే టీడీపీ ప్రభుత్వం భూసమీకరణకు ముందడుగు వేయటం వివాదాస్పదమవుతోంది. గత ఏడాది జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌ను, భూసమీకరణ అంశాన్ని ఒకేసారి తెరపైకి తేవడం రైతుల్లో గందరగోళాన్ని సృష్టిస్తోంది. భూ సేకరణ ద్వారా 14,427.06 ఎకరాలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. 6 గ్రామాల్లో మచిలీపట్నం ఓడరేవు అభివృద్ధికి 2282.20 ఎకరాలు... 21 గ్రామాల్లో పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటుకు 12,144.86 ఎకరాల భూమి సేకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాజధాని రైతులకు ఇచ్చిన ప్యాకేజీ అమలు చేస్తామని తొలుత ప్రభుత్వం పేర్కొంది. కానీ భూ సమీకరణ అని భూ సేకరణకు నోటిఫికేషన్‌ ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. బందరు పోర్టు, పోర్టు ఆధారిత పరిశ్రమల కోసం భూసేకరణ నోటిఫికేషన్‌  గత ఏడాది ఆగస్టు 29వ తేదీన ప్రభుత్వం జారీ చేసింది. 14,427 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించేందుకు భూసేకరణ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దీని గడువు ఆగస్టు 29వ తేదీతో ముగియడంతో పునరుద్ధరిస్తూ మరో నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేశారు. మచిలీపట్నం ఓడరేవు అభివృద్ధి కోసం మేకవానిపాలెం, గోపువానిపాలెం, కరగ్రహారం, మంగినపూడి, పోతేపల్లి, తపసిపూడి గ్రామాల్లో 2,282 ఎకరాలను కేటాయించారు. పారిశ్రామిక అభివృద్ధి కోసం 12,144 ఎకరాలను భూసేకరణ నోటిఫికేషన్‌లో చేర్చారు. గత ఏడాది జారీ చేసిన నోటిఫికేషన్‌నే మళ్లీ పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేయటం గమనార్హం.

రైతుల అభ్యంతరాలు..!
గత ఏడాది ఆగస్టులో భూసేకరణ నోటిఫికేషన్‌ జారీచేయడంతో రైతులు తమ భూములను ఇచ్చేది లేదని ఆర్డీవో కార్యాలయంలో 4,800కు పైగా అభ్యంతరాలను అందజేశారు. ఈ నేపథ్యంలో భూసేకరణ నోటిఫికేషన్‌ను పక్కనపెట్టి భూసమీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎంఏడీఏ)ను ఏర్పాటు చేశారు. ఎంఏడీఏ పరిపాలనా సౌలభ్యం కోసం వైస్‌చైర్మన్‌ను, 16 మంది డిప్యూటీ కలెక్టర్లను నియమించారు.  ఎంఏడీఏ ద్వారా భూసమీకరణ చేస్తామని పాలకులు ప్రకటించారు. పుష్కరాలకు ముందే భూసమీకరణ నోటిఫికేషన్‌ జారీ అవుతుందని అధికారులు చెప్పారు. వివిధ కారణాలతో భూసమీకరణ నోటిఫికేషన్‌ను విడుదల చేయకుండా జాప్యం చేశారు. భూసేకరణ నోటిఫికేషన్‌ మరో ఏడాది పాటు గడువును పెంచి భూసమీకరణ ద్వారా భూములు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించటం దారుణం. భూసమీకరణ ద్వారా ప్రైవేటు ల్యాండ్‌ 14వేల ఎకరాలు, అసైన్డ్‌భూమి 8వేల ఎకరాలు సమీకరించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రైతులు అంగీకారపత్రం ఇవ్వకుండా సెంటుభూమి కూడా సమీకరించడానికి అవకాశం లేకపోవడంతో రాజధాని ప్రాంత రైతులకు ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామని టీడీపీ నేతలు రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. 
               తొలుత పోర్టు నిర్మాణం జరిగే మేకవానిపాలెం, గోపువానిపాలెం, కరగ్రహారం, మంగినపూడి, పోతేపల్లి, తపసిపూడి గ్రామాల్లో 2,282 ఎకరాలను సేకరిస్తారని గతంలో ప్రకటించారు. అనంతరం ఈ నిర్ణయాన్ని మార్చి 22వేల ఎకరాల వరకు భూసమీకరణ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఏడాది కాలంగా భూ సమీకరణకు వ్యతిరేకంగా పోర్టు పరిసర ప్రాంతాల్లో 28 గ్రామాల రైతులు ఆందోళన బాట పట్టారు.  పార్టీలకు అతీతంగా భూసమీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. బందరు పోర్టు భూ సేకరణకు భూములు ఇచ్చేది లేదంటూ రైతులు  స్పష్టం చేశారు.  బందర్‌ పోర్టుకు సంబంధించి దాదాపు 28 గ్రామాలలో గ్రామసభను నిర్వహించిన అధికారులు 21 గ్రామాలకు చెందిన రైతులు భూములిచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు తెలిపారు. దీంతో రైతులను ఒప్పించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెస్తున్నారు. 

భూసేకరణకు వైయస్‌ఆర్‌సీపీ వ్యతిరేకం
పోర్టు భూముల విషయంలో రైతులతో ఇప్పటికీ సంప్రదింపులు పూర్తికాలేదు. ఇంతలోనే పరిశ్రమల కోసం భూ సేకరణ అనడం రైతులను మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ నిర్ణయాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకిస్తోంది. పొలాలు, స్థలాలే కాకుండా ఇళ్లు, వాకిళ్లు కోల్పోతామనే బాధ రైతులకు నిద్రపట్టకుండా చేస్తుండటంతో వారి పక్షాన పోరాటం చేసేందుకు ముందుకు వచ్చింది. ఇదివరకే రైతుల తరపున వైయస్సార్సీపీ నేత పేర్నినాని ప్రభుత్వం తిరుగుబాటు చేశారు. దీంతో, ఆయనపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ లకు పాల్పడింది. 
                  చంద్రబాబు భూ దాహం మితిమీరిపోయిందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పేర్ని నాని విమర్శించారు. పోర్టు పరిశ్రమల పేరుతో  రైతుల భూములు లాక్కోవాలని చూస్తే సహించేది లేదని, బాబు తలకిందులుగా తపస్సు చేసినా రైతులు ఒక్క ఎకరం భూమి కూడా ఇవ్వరని చెప్పారు. జైలు కైనా వెళ్తాం. ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు.  పోర్టుకు అవసరమైన 4,800 ఎకరాల భూమి ఇవ్వడానికి రైతులు సిద్ధమని, అంతకుమించి ఒక్క ఎకరం కూడా తీసుకోవడానికి వీల్లేదన్నారు. అందులో కూడా రైతులకు భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించి భూములు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోర్టు భూముల విషయంలో చంద్రబాబుపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.

  
 
Back to Top