మా ప్ర‌భుత్వ ఒప్పందం కేంద్రంతోనే.. అదానీతో కాదు  

మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి వెల్లడి

విద్యుత్‌ ఒప్పందాలపై ఈనాడు వితండ వాదన

చంద్రబాబు పంపిన వార్తలనే ఆ పత్రిలో అచ్చేస్తున్నారు

ఈనాడు ఏనాడో తన క్రెడిబులిటీని కోల్పోయింది

కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టీకరణ

సెకీతో చంద్రబాబు 2016లో కొనుగోలు ఒప్పందం

యూనిట్‌ పవర్‌ రూ.4.50 చొప్పున కొనుగోల

అదే వైయ‌స్ జగన్ రూ.2.49కే కొనేలా ఒప్పందం

రాష్ట్రానికి మేలు చేసిందెవరో ఈనాడుకు తెలియదా?

సూటిగా ప్రశ్నించిన కాకాణి గోవర్థన్‌రెడ్డి

పవన్‌కళ్యాణ్‌ ప్రాపకం కోసమే బాలినేని అబద్ధాలు 

తనను మంత్రిని చేశారన్న కనీస విశ్వాసం లేదు

దారుణంగా దిగజారి బాలినేని మాట్లాడుతున్నారు

ప్రెస్‌మీట్‌లో గుర్తు చేసిన కాకాణి గోవర్థన్‌రెడ్డి

నెల్లూరు: విద్యుత్‌ కొనుగోలకు అప్ప‌టి వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకుంద‌ని, మధ్యలో అదానీ ఎందుకు వచ్చార‌ని వైయ‌స్ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్య‌క్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి ప్ర‌శ్నించారు. తక్కువ ధరతో సెకీతో ప్రభుత్వ ఒప్పందం చరిత్రాత్మకమ‌న్నారు. దాని వల్ల ఏటా దాదాపు రూ.4 వేల కోట్లు , అలా 25 ఏళ్లలో దాదాపు లక్ష కోట్లు ప్రభుత్వానికి ఆదా అవుతుంద‌న్నారు. అదానీ విషయంలో వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌జగన్‌పై బురదజల్లే ప్రయత్నం జరుగుతోందని,అయన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా దుష్ప్రచారం చేస్తున్నారని మండిప‌డ్డారు. గ‌త వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంపై ప్రచారంలో ఉన్నవన్నీ అభూతకల్పనలేనని కొట్టి పారేశారు.  నెల్లూరులో వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి సోమ‌వారం మీడియాతో మాట్లాడారు.
 

వైయ‌స్ జ‌గ‌న్‌పై కుట్ర:
– గత కొద్ది రోజులుగా వైయ‌స్‌ జగన్‌ లక్ష్యంగా అదానీపై యూఎస్‌లో చేసిన ఆరోపణలను పట్టుకుని బురద జల్లాలని చూస్తున్నారు. 
– వైయ‌స్ జగన్ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచే కాంగ్రెస్‌తో కుమ్మక్కైన చంద్రబాబు, ఆయనను అక్రమ కేసులతో, జైలుకు పంపిన విషయం అందరికీ తెలుసు. 
– లక్ష కోట్లు అవినీతి అని దుష్ప్రచారం చేసిన చంద్రబాబు అండ్‌ కో ఒక్కో సున్నా తగ్గించుకుంటూ పోయి, చివరకు అసలు అవినీతి జరిగిందని కూడా తేల్చలేకపోయారు. 
– ఇప్పుడు కూడా అదానీ కంపెనీ వ్యవహారంలో జగన్‌గారి పేరు లేదు. అయినా ఒక రిపోర్టు ఆధారంగా బురద జల్లడం కోసం అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారు. 
– యూఎస్‌కు సంబంధించిన హిండెన్‌బర్గ్‌కు, అదానీకి మధ్య జరిగిన విషయాన్ని తెచ్చి ఏం సంబంధం లేకుండా మా నాయకులకు ముడిపెట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఆ నిరాధార ఆరోపణలతో ఈనాడు తప్పుడు కథనాలు రాస్తోంది. 

సెకీతో ప్రభుత్వ ఒప్పందం:
– వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ ఇండియా’ (సెకీ)తో మాత్రమే ఒప్పందం చేసుకుంది. అంతేతప్ప, అదానీ కంపెనీతో కాదు.
– అలాంటప్పుడు అదానీ కంపెనీలకు, జగన్‌గారికి ఏం సంబంధం?.
అదానీ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి లావాదేవీలు జరపలేదు. 
– సెప్టెంబర్‌ 15, 2021న కేంద్ర ప్రభుత్వం సంస్థ సెకీ ఏపీ ప్రభుత్వానికి  లేఖ రాసింది. రూ.2.49కి సోలార్‌ పవర్‌ ఇస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిపై క్యాబినెట్‌లో సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్న తర్వాత, అన్ని అంశాల అధ్యయనం కోసం ఎనర్జీ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు.
– నెల రోజుల తర్వాత ఆ కమిటీ నివేదికపై మరోసారి చర్చించిన క్యాబినెట్, రైతులకు 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందించేలా సెకీ నుంచి పవర్‌ కొనాలని నిర్ణయించారు.
– ఆ మేరకు 6400 మెగావాట్లకు సంబంధించి సౌర విద్యుత్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాన్ని కూడా చంద్రబాబు కోర్టుకెళ్లి అడ్డుకున్నారు.
– అలా న్యాయ పరమైన చిక్కులు ఏర్పడుతున్న కారణంగా టెండర్ల సమస్య ఉన్న నేపథ్యంలో, ఆ బాధ్యత తామే తీసుకుంటామన్న సెకీ,  2024 సెప్టెంబరులో 3వేల మెగావాట్లు, 2025లో 3వేల మెగావాట్లు, 2026లో మరో 3వేల మెగావాట్లు.. మొత్తం 9వేల మెగావాట్లు ఇస్తామని హామీ ఇస్తూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. 

తక్కువ ధరకు కొంటే తప్పు చేసినట్లా!:
– ఒకవేళ వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం ఆరోజు సెకీతో ఒప్పందం చేసుకోకపోయి ఉంటే, కచ్చితంగా మరో విధంగా విమర్శ చేసేవాళ్లు. రూ.2.49కే యూనిట్‌ విద్యుత్‌ ఇస్తామన్నా, ప్రభుత్వం లాలూచీ పడి తీసుకోలేదని రాసే వారు.
– నరం లేని నాలుకను ఎటైనా తిప్పి మాట్లాడతారు. దాన్ని ఇష్టారీతిన ప్రచారం చేసే మీడియా వారికి ఎలాగూ ఉంది. 
– 2014–19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు విద్యుత్‌ కొనుగోలులో యూనిట్‌ విద్యుత్‌కు సగటున రూ.5.10 చెల్లించారు.
– అదే మా ప్రభుత్వ హయాంలో రూ.2.49కే కొనుగోలు చేస్తే, మంచి చేసినట్లా? లేక తప్పు చేసినట్లా?.

చంద్రబాబు హయాంలో అడ్డగోలు ఒప్పందాలు:
– సోలార్‌ పవర్‌కు సంబంధించి 2014 వరకు 11 పీపీఏలు ఉండగా, చంద్రబాబు అయిదేళ్లలో 2400 మెగావాట్లకు సంబంధించి 35 పీపీఏలు చేసుకున్నారు. వాటి విలువ రూ.22,868 కోట్లు .
– 2014లో యూనిట్‌ సోలార్‌ విద్యుత్‌ను దాదాపు రూ.7కు కొనుగోలు చేశారు. 2016లో 1500 మెగావాట్లకు రూ.3.74 నుంచి రూ.4.84  వరకు అగ్రిమెంట్లు జరిగాయి. 
– సెకీ తక్కువకు ఇస్తామని చెప్పినా వినకుండా అంత భారీ రేట్లకు కొనుగోలు చేశారు. దాని వల్ల విద్యుత్‌ పంపిణీ వ్యవస్థలు (డిస్కమ్‌లు) నాశనం అవుతున్నా, కేంద్రం చెప్పినా పట్టించుకోలేదు. 
– ఇక 2016లో యూనిట్‌ విద్యుత్‌ రూ.4.50 చొప్పున 500 మెగావాట్ల కొనుగోలు చేసేలా, సెకీతో ఒప్పందం చేసుకున్నారు. ఇంతకన్నా దౌర్భగ్యం ఎక్కడైనా ఉందా? మా ప్రభుత్వంలో కన్నా రూ.2 చొప్పున ఎక్కువ చెల్లించి కొనడం ఏమిటో?.
– 2019–20 నాటికి విద్యుత్‌ కొనుగోలుకు సంబంధించి రెగ్యులేటరీ కమిషన్‌ ఇచ్చిన టారిఫ్‌ల ధర రూ.4.63 నుంచి రూ.5.90 వరకు నిర్ధారించింది. 
– చంద్రబాబు బ్రహ్మాండంగా చేయడం అంటే అధిక ధరలకు కొనుగోలు చేయడమా.. 

విద్యుత్‌ రంగంలో చంద్రబాబు నిర్వాకం:
– 2014–19 మధ్య విద్యుత్‌ రంగంలో చంద్రబాబు నిర్వాకం చూస్తే.. ఉచిత విద్యుత్‌కు సంబంధించి దాదాపు రూ.8845 కోట్ల బకాయిలు పెట్టాడు. 
– విద్యుత్‌ ఉత్పత్తిదారులకు సంబంధించి దాదాపు రూ.21,541 కోట్లు బకాయిలు పెట్టాడు.
– చంద్రబాబు రాకమునుపు రూ.29,552 కోట్లు ఉన్న విద్యుత్‌ రంగం  బకాయిలు ఆయన దిగిపోయే నాటికి రూ.86,215 కోట్లకు చేరాయి.
– ఇదేనా సమర్థవంతమైన పాలన. ఆయన హయాంలో విద్యుత్‌ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పడానికి ఈ లెక్కలే ఉదాహరణ. 

– సెకీతో ఒప్పందానికి ముందు యూనిట్‌ కరెంట్‌కి సంబంధించి రూ.2.49 నుంచి రూ.2.58 వరకు 58 బిడ్లు దాఖలయ్యాయి. అయితే అంత తక్కువ రేటుకు ఏపీ ప్రభుత్వానికి రావడం ఇష్టం లేని చంద్రబాబు, వాటన్నింటినీ కోర్టులను ఆశ్రయించి అడ్డుకున్నారు.
– చివరకు సెకీతో యూనిట్‌ పవర్‌ రూ.4.50కి కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకున్నారు.

అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అబద్ధాలు:
– రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ వ్యయానికి యూనిట్‌ విద్యుత్‌ రూ.2.49కి కొనుగోలు ఒక గొప్ప విషయం. అది కూడా ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ ఛార్జీలు మినహాయించి 25 ఏళ్లకు ఒప్పందం చేసుకోవడం జరిగింది.
– ఇది జగన్‌గారి ప్రభుత్వ గొప్పతనం. అయితే ఎక్కడ ఆయనకు మంచి పేరొస్తుందనే సాకుతో, ఆ ఒప్పందం మీద అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు.
– ఇవన్నీ పబ్లిక్‌ డాక్యుమెంట్లు. ఎవరైనా దాచేస్తే దాగేవి కావు. 
– ఆ చరిత్రాత్మక ఒప్పందం వల్ల 25 ఏళ్ల పాటు ఏటా రూ.4వేల కోట్ల చొప్పున 25 ఏళ్లలో లక్ష కోట్లు ఆదా అవుతుంది. 

గతి తప్పి ఈనాడు దిగజారుడు రాతలు:
– ఆ అంశాలన్నింటినీ మరుగున పెడుతున్న ఈనాడు, గుజరాత్‌లో యూనిట్‌ విద్యుత్‌ రూ.1.99కే కొంటున్నారని రాస్తోంది. మరి ఇంటర్‌ ట్రాన్స్‌మిషన్‌ ఛార్జీలు ఈనాడు భరిస్తుందేమో చెప్పాలి.
– ఈనాడు రాతలు చూస్తుంటే, టీడీపీ ఆఫీసులో చంద్రబాబు తయారు చేసి పంపిస్తున్న స్క్రిప్ట్‌లను వారు అచ్చేస్తున్నారనిపిస్తుంది.
– గుజరాత్‌ ఊర్జ్య వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ కొన్న ధరలు చూపించి రూ. 1.99లకే కొన్నారని ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి కోవిడ్‌ సమయంలో కొనేవారు లేక గుజరాత్‌లో సోలార్‌ ప్యానెళ్ల ధరలు తగ్గిపోయాయి. దాన్ని ఈనాడు సాకుగా చూపించి 50 పైసలు అదనంగా కొన్నారని మరో తప్పుడు ప్రచారం చేస్తోంది. 

పవన్‌ ప్రాపకం కోసమే బాలినేని అబద్ధాలు:
– సెకీతో ఒప్పందంపై బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడారని దాన్ని పెద్ద భూతంలా ప్రచారం చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌ దయతో ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి అయ్యారు. మా జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా పనిచేశారు. ఆయనతో మాకు చాలా చనువుంది. ఇంత దారుణంగా మాట్లాడతారని ఊహించలేదు.
– పవన్‌ కళ్యాన్‌ దగ్గర మెహర్బానీ కోసం ఈ ఆరోపణలు చేసి ఉంటాడనిపిస్తుంది. వైయ‌స్‌ జగన్‌ గురించి, ఆయన ప్రభుత్వం గురించి మాట్లాడటానికి ఆయనకి ఎలా మనసొప్పిందో ఆయన ఆలోచించుకోవాలి. 
– మంత్రివర్గంలో నిర్ణయాలు ఎజెండాలు ఎలా ఉంటాయో ఆయనకు తెలియకపోవడం విడ్డూరం. టేబుల్‌ అజెండా కింద మంత్రులు అడిగిన అంశాలను వారి నియోజకవర్గ అంశాలను చేర్చడం మీకు తెలియదా?
– అర్థరాత్రి ఫైల్‌ వచ్చిందని బాలినేని పచ్చిఅబద్ధాలు చెబుతున్నారు. ఆ సమయంలో ఈ–ఫైలింగ్‌ విధానం ఉండగా ఇలా దారుణంగా మాట్లాడటం బాలినేనికి తగదు. ఎవరి దగ్గర నీ స్థాయి పెంచుకోవడానికి మాట్లాడుతున్నావో, ఏ ప్రయోజనాలు ఆశిస్తున్నావో మాకు అనవసరం.. కానీ వాటి కోసం మా నాయకుడి మీద బురద జల్లడం భావ్యం కాదు. 
– తెలుగు ప్రాచీన విశిష్ట అధ్యయన కేంద్రం నా నియోజకవర్గంలోకి వచ్చింది. దానిపై కేంద్రంతో ఇబ్బందులొస్తే టేబుల్‌ అజెండా కింద చేర్చి భూముల  కొనుగోలుకు కూడా నిధులు మంజూరు చేయించారు. ఇలాంటివి ప్రతి మంత్రికి ఎదురైన అనుభవాలే. మనం ఏదైనా అడిగితే కాదని లేదన్న సందర్భాలున్నాయా..? 

ఈనాడుకు ఆ అర్హత ఉందా?:
– సిగ్గు, బుద్ధి లేని ఈనాడు యాజమాన్యం మార్గదర్శి పేరుతో నిబంధనల విరుద్దంగా డిపాజిట్లు సేకరించి సుప్రీంకోర్టు ముందు దోషిగా నిలబడిన వీరికి వైఎస్‌ జగన్‌ మీద ఆయన ప్రభుత్వం మీద విమర్శించే అర్హత ఉందా? 
ఈనాడు పత్రికకు ఉన్న క్రెడిబులిటీ ఎప్పుడో పోయింది. నాకు కూడా సీబీఐ కేసులో క్లీన్‌ చిట్‌ వస్తే.. ఆ సీబీఐనే ఈనాడు విమర్శించింది. వారికి అవసరం ఉన్నప్పుడు మాత్రం సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తుంటారు. 
– వాస్తవాలతో వీరికి అవసరం లేదు. టీడీపీకి అనుకూలంగా చంద్రబాబు రాజకీయ అజెండాతో వార్తలు రాయడమే వీరి పని. వైయ‌స్ జగన్‌ ఎంత మంచి పని చేసినా దాన్ని తప్పుగా వెతకాలి. బురద జల్లాలి. చంద్రబాబును హీరోగా చూపించాలి.
– మొన్నటిదాకా జగన్‌ ప్రభుత్వంలో పెట్టుబడులే రాలేదని ప్రచారం చేశారు. ఇప్పుడు మాత్రం అదానీ చేత రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టించారని రాస్తున్నారు. అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు ఈనాడులో నిజాలు మారిపోతుంటాయని కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆక్షేపించారు.

Back to Top