న్యూఢిల్లీ: ఈవీఎంల పనితీరుపై దేశమంతటా నెలకొన్న అనుమానాలను, ఆందోళనలను మరింత పెంచే మరో పరిణామం చోటుచేసుకుంది. వాటి విశ్వసనీయతపై స్వయంగా భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్‌వై ఖురేషీ కీలక సందేహాలు లేవనెత్తారు. తాజాగా ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతానికి సంబంధించి నెలకొన్న వివాదంపై గురువారం ప్రముఖ న్యూస్ చానల్ ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో నవంబర్ 20న రాష్ట్రవ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ జరగడం తెలిసిందే. ‘ఆ రోజు సాయంత్రం 5 గంటలకల్లా 55 శాతం మేరకు ఓటింగ్ (ప్రొవిజనల్ ఓటర్ టర్నౌట్–పీవోటీ) న మోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ.. మర్నాడు ఈసీ ప్రకటించిన తుది గణాంకాల్లో అది కాస్తా ఏకంగా 66.05 శాతానికి పెరిగిపోయింది’ అని రాజ్‌దీప్ పేర్కొనగా.. ఇంతటి వ్యత్యాసం అత్యంత ఆందోళన కలిగించే అంశమని ఖురేషీ చెప్పారు. దీనిపై తన అనుమానాలు, అభ్యంతరాలు, ఆందోళనలను ఖురేషీ ఈ సందర్భంగా పంచుకున్నారు. ఓటింగ్ శాతం గణాంకాలు ఎప్పటికప్పుడు (రియల్ టైమ్) నమోదవుతూనే ఉంటాయన్నారు. అలాంటప్పుడు పోలింగ్ నాటి సాయంత్రానికి, మర్నాటికి ఇంతటి వ్యత్యాసం కచి్చతంగా అత్యంత ఆందోళన కలిగించే విషయమేనని స్పష్టం చేశారు. ‘ఓటింగ్ శాతం ఇలా నమోదవుతుంది’ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ శాతం నమోదు ప్రక్రియ ఎలా జరుగుతుందో ఖురేషీ వివరించారు. ‘ఓటేయడానికి వచ్చే ప్రతి ఒక్కరి హాజరునూ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి విధిగా ఫారం–17సీలో నమోదు చేస్తారు. పోలింగ్ ముగిశాక ఆనాటి పరిణామాలన్నిటినీ అందులో నమోదు చేస్తారు. అలా ఫారం–17సీని పూర్తిగా నింపి, దానిపై అభ్యర్థులకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్ల సంతకం తీసుకున్న తర్వాతే ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ బూత్‌ను వీడతారు’ అని వివరించారు. ‘ప్రతి పోలింగ్ బూత్‌లోనూ పోలైన మొత్తం ఓట్ల సంఖ్యను 17సీ నమోదు చేస్తుంది. పైగా ఇది అదే రోజు, రియల్ టైమ్ (ఎప్పటికప్పుడు)లో నమోదయ్యే డేటా’ అని తెలిపారు. అలాంటప్పుడు పోలింగ్ జరిగిన మర్నాడు అది మారడం ఎలా సాధ్యమన్నది తనకే అర్థం కావడం లేదని ఆశ్చర్యం వెలిబుచ్చారు. ఇది ఎన్నో సందేహాలకు తావిచ్చే పరిణామమన్నారు. ‘దీనిపై ఎన్నికల సంఘం వివరణ ఇచ్చి తీరాల్సిందే. ఇప్పటికే ఆ పనిచేసి ఉండాల్సింది. ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియడం లేదు’ అన్నారు. ‘కీలకమైన ఈ సందేహాలకు ఈసీ ఇప్పటికైనా బదులివ్వాలి. జాతీయ మీడియాను పిలిచి పోలింగ్ గణాంకాలకు ³Nర్తిస్థాయిలో వివరణ ఇవ్వాలి’ అన్నారు. ‘ఈవీఎంల పనితీరు తదితరాలపై ఇప్పటికే దేశమంతటా అనుమానాలు వ్యాప్తి చెందుతున్నాయి. వాటిని ఈసీ వెంటనే తీర్చకపోతే జనాల మెదళ్లలోకి మరింతగా చొచ్చుకుపోతాయి. అప్పుడు మొత్తం వ్యవస్థల మీదే విశ్వాసం పోతుంది’ అంటూ ఖురేషీ ఆందోళన వెలిబుచ్చారు. ఓటింగ్ శాతంలో అనూహ్య పెరుగుదల అంశం ఐదేళ్ల కింద సుప్రీంకోర్టు వరకు వెళ్లిందన్నారు. ఈసీ తుది గణాంకాల మేరకు మహారాష్ట్రలో సాయంత్రం 5 గంటల తర్వాత ఏకంగా 11 శాతం ఓటింగ్ జరిగినట్టు భావించాలని కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ అన్నారు. ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు. ఈ అనుమానాలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్టు ఖురేషీ చెప్పారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాల్సి ఉందన్నా్డరు. ఆయన 2010–12 మధ్య కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా పనిచేశారు. ఏపీ పోలింగ్ శాతంలో 12.54 శాతం తేడా! ఆంధ్రప్రదేశ్‌లో మే 13న నాలుగో దశలో ఎన్నికలు నిర్వహించగా.. అదే రోజున రాత్రి 8 గంటలకు 68.12 శాతం పోలింగ్ జరిగినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆ తర్వాత రాత్రి 11.45 గంటలకు 76.50 శాతం పోలింగ్ జరిగినట్టు ప్రకటించింది. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన నాలుగు రోజులకు అంటే మే 17న తుది పోలింగ్ శాతం 80.66 అని ప్రకటించింది. అంటే.. తొలుత ప్రకటించిన పోలింగ్ శాతానికి తుది పోలింగ్ శాతానికి మధ్య 12.54 శాతం పెరుగుదల ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఎన్నికల సంఘం తొలుత ప్రకటించిన పోలింగ్ శాతానికి, ఆ తర్వాత వెల్లడించిన పోలింగ్ శాతానికి భారీ తేడా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా.. ఒడిశా (12.48 శాతం) రెండో స్థానంలో నిలిచాయి. పోలింగ్ శాతం పెరుగుదలకు ప్రధాన కారణం ఈవీఎంలను హ్యాకింగ్ చేయడం లేదా ఈవీఎంలు మార్చేయడం లేదా ఈవీఎంలు సక్రమంగా పనిచేయకపోవడం వంటి ఏదో ఒకటి అయి ఉండొచ్చని ఏడీఆర్ (అసోషియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫారŠమ్స్), వీఎఫ్‌డీ (వోట్ ఫర్ డెమొక్రసీ) సంస్థల ప్రతినిధులు అనుమానం వ్యక్తం చేశారు. ఇదే ఫలితాలను తారుమారు చేసిందని ఆరోపించారు. పోలింగ్ శాతంలో భారీగా తేడా ఉండటం వల్ల పోలైన ఓట్లలో 49 లక్షల ఓట్లు పెరిగాయి. రాష్ట్రంలో 25 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. పోలింగ్ శాతంలో పెరుగుదల వల్ల ఒక్కో లోక్‌సభ స్థానంలో సగటున 1.96 లక్షల ఓట్లు అదనంగా పోలయ్యాయి. ఇది లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని వీఎఫ్‌డీ సంస్థ వెల్లడించింది. ఎన్నికల సంఘం పోలింగ్ శాతం తొలుత వెల్లడించిన దానికీ, ఆ తర్వాత ప్రకటించిన దానికీ తేడా ఉండకపోయి ఉంటే ఎన్‌డీఏకు 14, వైఎస్సార్‌సీపీకి 11 లోక్‌సభ స్థానాలు దక్కేవని స్పష్టం చేసింది. పోలింగ్ శాతంలో తేడా వల్ల ఒంగోలు, నరసరావుపేట, ఏలూరు, హిందూపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం లోక్‌సభ స్థానాల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని పేర్కొంది.