తిరోగమనం వైపు ఏపీ.. 

వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఫైర్‌

గత ఐదేళ్లు విప్లవాత్మక అడుగులు పడ్డాయి..

ఇప్పుడు ఆ విప్లవాత్మక అడుగులు అన్నీ వెనక్కి పడుతున్నాయి 

కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రశంసిస్తూ సెకీ లేఖ రాసింది

రైతుల పట్ల ప్రదర్శిస్తున్న ప్రత్యేక శ్రద్ధను సెకీ అభినందించింది. 

యూనిట్‌కు రూ.2.49కే.. మొత్తంగా 9 వేల మెగా వాట్ల పవర్‌ను అందుబాటులోకి తెస్తామ‌ని సెకీ ఒప్పందం 

ఈనాడు, ఆంధ్ర‌జ్యోతికి 48 గంటల టైం ఇస్తా

క్షమాపణలు చెప్పకపోతే.. రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తా :  వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి:  గత ఐదేళ్లు విప్లవాత్మక అడుగులు పడ్డాయి.. ఇప్పుడు ఆ విప్లవాత్మక అడుగులు అన్నీ వెనక్కి పడుతున్న బాధాకరమైన పరిస్థితి ఉంది అంటూ వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ధ్వజమెత్తారు.  రెడ్ బుక్ పరిపాలనలో రాజ్యాంగం తూట్లు పొడుస్తున్నారు.. రాష్ట్రంలో లిక్కర్ స్కామ్‌లు, సాండ్ స్కామ్‌లు కనపడుతున్నాయి.. పేకాట క్లబ్‌లు, మాఫీయా వ్యవహారం నడుస్తోంది.. ఏ పని చేయాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా చంద్రబాబుకి, ఎమ్మెల్యేకు ఇంతా అని ముట్ట చెప్పాల్సిన పరిస్థితి ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. పాదయాత్రలో నేను గుర్తించిన ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చే ప్రయత్నం చేశాను.. DBT ద్వారా లంచాలు లేకుండా సంక్షేమం అందించాం.. అవినీతికి తావులేకుండా సచివాలయాల ద్వారా అన్ని సేవలు ప్రజలకు అందించాం.. రూ.2.73 లక్షల కోట్లు DBT ద్వారా అవినీతి, వివక్ష లేకుండా మేం ఇచ్చామని వైయ‌స్ జ‌గ‌న్ గుర్తుచేశారు. గురువారం వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో వైయ‌స్ జ‌గ‌న్ మీడియాతో మాట్లాడారు.
 
పాదయాత్రలో కష్టాలను చూశా..
నా పాదయాత్రలో కష్టాలను చూశా. అందుకు తగ్గట్లు..  గత ఐదేళ్ల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ప్రతీ ఇంటికి మంచి చేశాం. ఇప్పుడు ఆ అడుగులు వెనక్కి ఎలా వెళ్తున్నాయో చూస్తున్నాం. కూటమి పాలనలో తిరోగమనంలో ఇప్పుడు రాష్ట్రం ఉంది. రెడ్‌బుక్‌ పాలనతో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. బడ్జెట్‌తో భరోసా ఇవ్వలేకపోయారు. లిక్కర్‌, ఇసుక స్కాంలతో పాటు.. ఎక్కడ చూసినా పేకాట క్లబ్‌లు కనిపిస్తున్నాయి. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి..

రాష్ట్రంలో గత ఐదేళ్లలో విప్లవాత్మక అడుగులు పడ్డాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ అడుగులు వెనక్కు పడుతున్నాయి. సూపర్‌ సిక్స్‌లు కనిపించవు. ఎన్నికలప్పుడు చెప్పిన మాటలు కనిపించవు. రెడ్‌బుక్‌ పరిపాలనలో రాజ్యాంగానికి తూట్లు పొడవడమే కనబడుతోంది. 

ఊహించ‌ని మార్పులు..

ప్రజలకు మంచి చేయాలనే మేం ప్రతి అడుగు ముందుకు వేశాం. ఎన్నడూ ఊహించని మార్పులు తీసుకురాగలిగాం. ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం. లంచాలు, వివక్ష లేకుండా ప్రతి పథకం ఇంటి వద్దకే డోర్‌ డెలివరీ ఇచ్చాం. బడ్జెట్‌లో కేలండర్‌ ఇచ్చి మరీ పథకాలను అమలు చేశాం. ఇదంతా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. 

వైయ‌స్ఆర్‌సీపీ హయాంలోనే సంపద సృష్టి

ఒక రాష్ట్రానికి ఉన్న ఆదాయం కాకుండా.. ఇంకా అదనపు ఆదాయం వచ్చేలా చేయడాన్ని సంపద సృష్టి అంటారు.  రాష్ట్ర పురోగతిని.. భవిష్యత్తులో ఎక్కువ మార్గాలు వచ్చేలా ఉంటే.. అది సంపద సృష్టి అని వైయ‌స్‌ జగన్‌ వివరించారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే వైయ‌స్ఆర్‌సీపీ హయాంలోనే సంపద సృష్టి జరిగింది. మూడు కొత్త పోర్టులు.. అదీ నిర్మాణం వేగంగా సాగింది. దాదాపుగా పూర్తి కావొచ్చిన వాటి వల్ల అభివృద్ధి జరుగుతుంది. అదనపు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగాలు వస్తాయి. మెడికల్‌ కాలేజీల వస్తే ఖర్చులు తగ్గుతాయి. వాటి వల్ల కలిగే ప్రయోజనాలతో.. సంపద సృష్టి జరుగుతుంది. ఈ పోర్టులు, మెడికల కాలేజీలు భవిష్యత్తు సంపద. ఇలాంటి అదనపు ఆదాయం వచ్చే కార్యక్రమాలు చేయాలి అంటూ చంద్రబాబుకు సూచనలు చేశారు. 

అంత మంచి ఆఫర్‌ను తిరస్కరించి ఉంటే నన్నేమనేవారు? 
 
విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల విషయంలో గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని బద్నాం  చేసేందుకు జరుగుతున్న కుట్రలను.. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎండగట్టారు. ఒప్పందం జరిగింది కేంద్ర ప్రభుత్వం(సెకి), రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమేనని.. ఏపీ చరిత్రలోనే నిలిచిపోయే అత్యంత చవకైన ఈ ఒప్పందంపై బురద జల్లుతూ రాతలు రాయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రైతులకు ఉచిత కరెంట్‌ అనేది ఒక కల. దీనివల్ల రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి. 

చంద్రగ్రహణం..

చంద్ర‌బాబు హయాంలో డిస్కంల పరిస్థితి దయనీయంగా మారింది. డిస్కంలను నిర్వీర్యం చేశారాయన. చంద్రబాబు చేసిన సోలార్‌ పవర్‌ ఒప్పందాలు రూ.5.90తో చేసుకున్నారు. డిస్కంల అప్పులను 86 వేల కోట్లకు పెంచారు. మా హయాంలో డిస్కంలను నిలబెట్టే ప్రయత్నం చేశాం. పగటి పూటే రైతులకు 9 గంటల కరెంట్‌ ఇవ్వగలిగాం. ఉచిత కరెంట్‌ కోసం రూ.9 వేల కోట్లు ఖర్చు చేశాం. ఆ టైంలో యూనిట్‌ను 2.40 నుంచి 2.50 రూ. చొప్పున సప్లై సేందుకు 24 బిడ్లు వచ్చాయి. కానీ, చంద్రగ్రహణం(చంద్రబాబును ఉద్దేశించి).. ఆ ప్రక్రియకు అడ్డం పడింది. కోర్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనికోసం మేం వివిధ కోర్టులో పోరాడాల్సి వచ్చింది. 

సెకి నుంచి తియ్య‌టి క‌బురు
 
2021 సెప్టెంబర్‌ 15వ తేదీన కేంద్ర ప్రభుత్వం (సెకి) నుంచి తియ్యటి కబురుతో ఓ లేఖ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను పొగుడుతూ.. రైతుల పట్ల ప్రదర్శిస్తున్న ప్రత్యేక శ్రద్ధను సెకీ అభినందించింది. యూనిట్‌కు రూ.2.49కే.. మొత్తంగా 9 వేల మెగా వాట్ల పవర్‌ను అందుబాటులోకి ఇస్తాం అంటూ పేర్కొంది. ఇందులో 2024 సెప్టెంబర్‌లో 3 వేల మెగా వాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందని చెప్పింది. ఇది ఏపీ చరిత్రలోనే అతితక్కువ ధరకు అందించిన పవర్‌ ఆఫర్‌ ఇది.

ఏపీ చరిత్రలోనే అతితక్కువ ధరకు ఒప్పందం
 కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రశంసిస్తూ.. ఆ సంకల్పానికి తోడుగా ఉంటామని లేఖ రాసింది. మేమే పవర్‌ సప్లై చేస్తామని చెప్పింది. ఇక్కడ మూడో పార్టీ ఎక్కడుంది?. రెండోది.. రూ.2.49కి  అందుబాటులోకి ఇస్తాం అంటూ పేర్కొంది. ఇది ఏపీ చరిత్రలోనే అతితక్కువ ధరకు అందించే ఒప్పందం. ఐఎస్‌టీఎస్‌ (ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ ఛార్జీలు) ఛార్జీలు లేకుండా(యూనిట్‌కు రూ.1.98పైసా చొప్పున).. స్పెషల్‌ ఇంటెన్సివ్‌ ఇస్తానంది. 

న‌న్ను ఏమ‌నేవారు..

యూనిట్‌ రూ.2.61 మనకు కలిసి వస్తుంది. ఏడాది 4,400 కోట్లు కలిసి వస్తాయి. ఒప్పందం ప్రకారం పాతికేళ్లకు.. లక్షల కోట్లు కలిసి వచ్చేవి. ఏపీ చరిత్రలోనే అత్యంత చవకైన విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం ఇది. లక్షల కోట్లు ఆదాయం ఆదా కావడం సంపద సృష్టి కాదా?. ఇది చరిత్రలో నిలిచిపోయే ఒప్పందం. ఇలాంటి ఒప్పందానికి స్పందించకున్నా.. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా ఊరుకునేవా?. నన్ను ఏమనేవారు.

ఎవ‌రు మంచోళ్లు?

 చంద్రబాబు హయాంలో చేసుకున్న విండ్‌, సోలార్‌ పవర్‌ ఒప్పందాలతో ఏపీకి అదనపు భారం పడింది. చంద్రబాబు పీపీఏల వల్ల రూ.2 వేల కోట్ల భారం పడింది. అదనంగా రూ.3.41రూ. కట్టాల్సి వచ్చింది.  రూ.5.90 తక్కువా? రూ.2.49 తక్కువా?. అంత దిక్కుమాలిన రేట్లకు ఒప్పందాలు చేసిన చంద్రబాబు మంచోడా?. ఇంత తక్కువ ధరకు ఆఫర్‌కు స్పందించి.. రాష్టట్రానికి మంచి జరిగే ఒప్పందం చేసుకున్న నేను మంచివాడినా?.  జగన్‌ ఆలోచనలతో.. 25 ఏళ్లకు లక్షల కోట్ల ఆదాయం కలిసొస్తే.. చంద్రబాబు ఒప్పందాలతో అదే పాతికేళ్లకు 87 వేల కోట్ల సంపద ఆవిరి అయ్యేది. సంపదను ఆవిరి చేసిన చంద్రబాబు మంచోడా?. భవిష్యత్తు కోసం ఆలోచించిన నేను మంచోడినా?. చంద్రబాబు తెలిసి చేస్తోంది ధర్మమేనా?. 

అగ్రిమెంట్‌లో మూడో పార్టీనే లేదు

కేంద్రం ప్రతిపాదన టైంలోనే.. కేబినెట్‌ సమావేశం జరిగింది. సెకి ప్రతిపాదనపై.. మంచి చెడులు చెప్పాలని ఇంధన శాఖను ఆదేశించాం. సుమారు 40 రోజలు అధ్యయనం జరిగింది. కేబినెట్‌ సుదీర్ఘంగా చర్చించి జరిపిన ఒప్పందం ఇది. 2021 నవంబర్‌ 11న ఏపీఈఆర్సీ అనుమతించింది. ఏపీ గవర్నమెంట్‌(+డిస్కంలు), సెకి మధ్య జరిగిన ఒప్పందమే ఇది.  2021 డిసెంబర్‌ 1వ తేదీన జరిగిన ఈ పవర్‌ సేల్‌ అగ్రిమెంట్‌లో మూడో పార్టీనే లేదు. చారిత్రక ఘట్టం జరిగితే.. దుష్‌ప్రచారం చేస్తున్నారు.

ఈ ఒప్పందాన్ని వక్రీకరిస్తున్నారు

ఇదే సెకి మరికొన్ని స్టేట్స్‌తో కూడా పవర్‌ సేల్‌ ఒప్పందం చేసుకుంది. అన్నింటికంటే తక్కువ ఇచ్చింది ఏపీకే. ఇంత చవకైన ఒప్పందం ఇంతకు ముందెన్నడూ జరగలేదు.కానీ, చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా, సగం సగం తెలివి ఉన్న ఆయన తరఫునవాళ్లు కొందరు ఈ ఒప్పందాన్ని వక్రీకరిస్తున్నారు. గుజరాత్‌లో 1.90తో ఒప్పందం చేసుకుంటుందని చంద్రబాబు అంటున్నారు. ఈనాడు గుజరాత్‌ను రిఫరెన్స్‌గా చెబుతోంది. కానీ, గుజరాత్‌ నుంచి తెప్పించి ఉంటే.. ఇంటర్‌ మిషన్‌ ట్రాన్స్‌మిషన్‌ ఛార్జీలు పడేవి. గుజరాత్‌, రాజస్థాన్‌ పవర్‌ జనరేషన్‌ కాస్ట్‌ గురించి మాట్లాడుతున్నారు. 

మంచి చేసిన వాళ్ల మీద రాళ్లు 

ట్రాన్స్‌మిషన్‌ ఛార్జ్‌ గురించి ఎందుకు మాట్లాడడం లేదు. ఈనాడుగానీ, ఆంధ్రజ్యోతిగానీ ఇవేం చెప్పడం లేదు. ఇప్పుడు గుజరాత్‌లో సెకీ పిలిచిన టెండర్లు రూ.2.62కి తక్కువ లేవు. మంచి చేసిన వాళ్ల మీద రాళ్లు వేస్తునన్నారు. ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. అయినా.. చంద్రబాబు, ఆయన సోషల్‌ మీడియా ఇంతలా వక్రీకరించి మాట్లాడడం ధర్మమేనా?. ఈనాడు, ఆంధ్రజ్యోతి.. ఇంతలా వకక్రీకరించాలా?. టీవీ రేట్లు తగగ్గినట్లు కరెంట్‌ రేట్లు తగ్గాలని ఈనాడు రాసింది. ఇక్కడే వక్రీకరణ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అని వైయ‌స్‌ జగన్‌ అన్నారు. 

ఈనాడు, ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం దావా  

ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీపై అమెరికాలో నమోదైన కేసులో.. తన పేరు ఉందన్న ప్రచారంపైనా వైయ‌స్‌‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. ఆ ఆరోపణల్లో తన పేరు ఎక్కడా లేదని, అది ఉత్త మూర్ఖపు ప్రచారమేనని, కొంతమంది కావాలని చేస్తున్న రాద్ధాంతమని అన్నారాయన. అలాగే తనపై తప్పుడు ఆరోపణలు చేసేవాళ్లపై పరువునష్టం దావా వేస్తా అని హెచ్చరించారాయన.

 సీఎంలు పారిశ్రామిక వేత్తలను కలుస్తారు. నేను ఐదేళ్ల కాలంలో అదానీని కలిశాను. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వాళ్లపై పరువు నష్టం దావా వేస్తా. ఈనాడు,  ఆంధ్రజ్యోతి.. టీడీపీ కోసం పని చేసే మీడియా సంస్థలు. వాస్తవాల్ని వకక్రీకరించి పదే పదే అబద్ధాలు రాస్తున్నాయి. 

 నా పరువు ప్రతిష్టలు దెబ్బ తీసేలా అబద్ధాలతో ప్రచారం చేస్తున్నాయి. వాటికి లీగల్‌ నోటీసులు పంపిస్తా. 48 గంటల టైం ఇస్తా. ఆ లోపు క్షమాపణలు చెప్పకపోతే.. రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తా’’ అని జగన్‌ హెచ్చరించారు.

Back to Top