ఏకగ్రీవాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ హవా

విజయవాడ:

కృష్ణా జిల్లా సహకార ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ అనేక చోట్ల జయకేతనాన్ని  ఎగరేసింది. మొదటిదశలో ఏకగ్రీవంగా ఎన్నికైన స్థానాల్లో మెజారిటీ ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులకే దక్కాయి. ప్రభుత్వం కుట్రలు, కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడినా ఫలితం లేకపోయింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమున్న స్థానాల్లో ఎన్నికలను వాయిదా వేసింది. కొన్నిచోట్ల కాంగ్రెస్, తెలుగుదేశం కుమ్మక్కయ్యాయి. జిల్లాలో ఏకగ్రీవమైనవాటిలో అత్యధిక స్థానాలను పార్టీ సొంతం చేసుకుంది. మచిలీపట్నం నియోజకవర్గంలో అన్ని స్థానాలనూ.. జగ్గయ్యపేట నియోజకవర్గంలో 11 స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. జగ్గయ్యపేట నియోజకవర్గంలో 30 సహకార సంఘాలుండగా నాలుగింటికి ప్రభుత్వం స్టే ఇచ్చింది. ఇవి కూడా వైయస్ఆర్‌ కాంగ్రెస్ గెలుచుకునేవే. పోటీ జరిగే వాటిలో మరో ఏడింటిలో కూడా గెలిచే అవకాశం ఉంది. నందిగామ నియోజకవర్గంలోనూ  ఎక్కువ స్థానాల్లో గెలుపొందింది. మచిలీపట్నం నియోజవర్గంలోని ఎనిమిది పీఏసీఎస్‌లను కైవసం చేసుకోవటంతో కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. పెడన, పెనమలూరు నియోజకవర్గాల్లోనూ పలుచోట్ల పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

     రుణమాఫీ, నగదు ప్రోత్సాహకాలను అందించిన దివంగత మహానేత డాక్టర్ వైయస్‌ఆర్‌ను సదా స్మరిస్తున్న రైతులు ఈ ఎన్నికల్లో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారనే విషయం స్పష్టమవుతోంది. జిల్లాలో అత్యధిక స్థానాలు సాధిస్తామని, దీనికి జగ్గయ్యపేటలో సాధించిన విజయాలే తార్కాణమని పార్టీ కన్వీనర్ సామినేని ఉదయభాను పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసిన గెలుపు తమదేనని అప్కాబ్ మాజీ చైర్మన్ వసంత నాగేశ్వరరావు ప్రకటించారు. నూజివీడు, గుడివాడ డివిజన్లలో రెండో విడత నామినేషన్ల ఘట్టం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 31న మొదటి దశలో మచిలీపట్నం, విజయవాడ డివిజన్‌లలోని 204 సొసైటీలకు, రెండో దశలో ఫిబ్రవరి 4న గుడివాడ, నూజివీడు డివిజన్‌లలో ఎన్నికలు నిర్వహిస్తారు.

Back to Top