వైయస్ జగన్ ప్రాణాలు తీయడమే టార్గెట్ విచారణలో అంగీకరించిన నిందితుడు శ్రీనివాసరావు గొంతులో కత్తి దించేద్దామనుకున్నా.. పొరపాటున మిస్ అయింది ఐపీఎస్ అధికారులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో నోరు విప్పిన నిందితుడు సూత్రధారుల పేర్లు సైతం బహిర్గతం?
విశాఖపట్నం: ‘‘నా టార్గెట్.. నాకు అప్పగించిన పని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాణాలు తీయడమే. ఎప్పటి నుంచో ఆ రోజు కోసం వెయిట్ చేశా. ఆ రోజు కత్తి వేటు గొంతులోనే దిగాలి. పొరపాటున మిస్ అయింది’’ అని జగన్‌పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావు పోలీసుల విచారణలో ఎట్టకేలకు అంగీకరించినట్లు తెలిసింది. ఇద్దరు ఐపీఎస్ అధికారుల విచారణలో శ్రీనివాసరావు ఇవే మాటలను స్పష్టంగా చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. ‘‘కేవలం సంచలనం కోసమే చేశా. నేను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభిమానిని. నేను రాసిన లెటర్ ఆయన చదవాలనే ఇదంతా చేశా’’ అని ఘటన జరిగిన మొదటి రోజు నుంచీ ఇప్పటివరకు మీడియా ప్రతినిధులు కనిపిస్తే చాలు పదేపదే వల్లె వేస్తున్న డైలాగులన్నీ పచ్చి అబద్ధాలేనని నిందితుడు అంగీకరించినట్లు తెలుస్తోంది.
ముమ్మాటికీ హత్యాయత్నమే
ప్రతిపక్ష నేత జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమేనని, ఆ కత్తి గొంతులో దిగి ఉంటే ప్రాణాలు పోయేవి’’ అని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్న పోలీసు అధికారులపై ప్రభుత్వ పెద్దలు సీరియస్ అయ్యారు. కుట్రకోణం దాచి రిమాండ్ రిపోర్ట్ రాసినప్పటికీ విశాఖ పోలీసు అధికారులకు ప్రభుత్వ పెద్దల నుంచి అక్షింతలు తప్పలేదు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేవిధంగా మీరు రిమాండ్ రిపోర్ట్ రాశారంటూ పోలీసు ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఈ కేసును విచారించాలని ఇంటెలిజెన్స్ వర్గాలను కూడా ప్రభుత్వ పెద్దలు ఆదేశించారు. అయితే, తమ సిబ్బంది రాత్రింబవళ్లు కేసును విచారిస్తుండగా, ఇంటెలిజెన్స్ వర్గాల జోక్యం ఏమిటని ఐపీఎస్ అధికారులు భావించారు. ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఐపీఎస్ అధికారులు స్వయంగా రంగంలోకి దిగారు. నిందితుడు శ్రీనివాసరావును తమదైన శైలిలో ప్రశ్నించడంతో అతడు ఎట్టకేలకు నోరు విప్పి, వాస్తవాలను బయటపెట్టినట్టు చెబుతున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అంతం చేయడమే లక్ష్యంగా కత్తితో దాడి చేశానని నిందితుడు అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం.
జగన్‌ను హత్యచేయడమే లక్ష్యం విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగింది హత్యాయత్నమేనని ప్రత్యక్ష సాక్షులు, వైఎస్సార్‌సీపీ నేతలు మొత్తుకున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు మంత్రులు, టీడీపీ నాయకులు తేలిగ్గా తీసిపారేశారు. అది చిన్నపాటి ఘటనగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. కేసును విచారిస్తున్న ఎయిర్‌పోర్ట్ పోలీస్‌స్టేషన్ సీఐ మళ్ల శేషు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో జగన్‌పై కత్తి దాడి హత్యాయత్నమేనని, కత్తి గొంతులో దిగి ఉంటే ప్రాణాలు దక్కేవి కావని పేర్కొన్నారు. కానీ, నిందితుడు నేరాన్ని అంగీకరించడం లేదని ఇన్నాళ్లూ చెప్పుకొచ్చారు. మంగళవారం నాటి విచారణలో తాను జగన్‌ను హత్యచేయడమే లక్ష్యంగా దాడి చేశాడని శ్రీనివాసరావు అంగీకరించాడని తెలిసింది. దీంతో ఇక తేలాల్సింది కుట్ర కోణమే. బడాబాబుల అండ లేకుండా ఎయిర్‌పోర్ట్‌లో రాష్ట్ర ప్రతిపక్ష నేతపై ఓ దుండగుడు ఇంతటి ఘాతుకానికి పాల్పడే అవకాశం లేదని చెబుతున్నారు.

సూత్రధారుల పేర్లు బహిర్గతం? జగన్‌ను చంపాలనే కత్తి దూశానని స్పష్టం చేసిన నిందితుడు శ్రీనివాసరావు ఆ పని ఎవరు చేయించారో కూడా వెల్లడించాడనే అంటున్నారు. ప్రధాన కుట్రదారుల పేర్లు తనకు తెలుసో లేదో గానీ తనకు ‘ఆ పని’ అప్పగించిన సూత్రదారుల పేర్లను మాత్రం ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశాడని సమాచారం. విచారణలో నిందితుడు బయటపెట్టిన వివరాలను పోలీసు ఉన్నతాధికారులు పభుత్వ పెద్దలకు, పోలీస్ బాస్‌లకు ఇప్పటికే చేరవేసినట్టు తెలుస్తోంది. నిందితుడి పోలీసు కస్టడీ గడువు శుక్రవారం ముగుస్తున్న నేపథ్యంలో విచారణ డ్రామాను రక్తి కట్టించి, అతడిని తిరిగి జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు.
ప్రకాశం జిల్లా వాసులను విచారిస్తున్న ‘సిట్’ కనిగిరి: వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావు ఫోన్ కాల్‌డేటాను ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తోది. ఇందులో భాగంగా ప్రకారం జిల్లా కనిగిరి మున్సిపాల్టీలోని దేవాంగనగర్‌కు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకుంది. హత్యయత్నానికి ముందు నిందితుడి ఫోన్ నుంచి దేవాంగనగర్‌కు చెందిన కాశీంబీ కోడలు సైదాబీ షేక్ సెల్‌కు పలుమార్లు ఫోన్ చేసినట్టు కాల్ డేటాలో నిర్ధారణ అయింది. దీంతో గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పోలీసులు సోమవారం సైదాబీ షేక్, ఆమె మరిది రసూల్, తోడికోడలు అమ్మాజీ షేక్, అత్త కాశీంబీలను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. సైదాబీ, అమ్మాజీ, కాశీంబీలను అక్కడే ఉంచి, రసూల్‌ను తిరిగి పంపించారు. తిరిగి మంగళవారం మధ్యాహ్నం పిడుగురాళ్ల పోలీసులు రసూల్‌కు ఫోన్ చేశారు. ‘సిట్’ పోలీసులు విచారణ చేయాల్సి ఉందని చెప్పడంతో రసూల్ వైజాగ్‌కు వెళ్లాడు. సైదాబీ షేక్, అమ్మాజీ షేక్, కాశీంబీ, రసూల్‌లు వైజాగ్ ‘సిట్’ అదపులో ఉన్నట్లు సమాచారం.
జగన్‌పై అటాక్ చేస్తున్నా.. ‘‘నన్ను చూడాలనుకుంటే రేపే చూసుకోండి. జగన్‌పై అటాక్ చేస్తున్నా.. టీవీలో వస్తుంది. తర్వాత కనిపిస్తానో లేదో’’ అంటూ నిందితుడు శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. నిందితుడు శ్రీనివాసరావు కాల్ డేటా ఆధారంగా ‘సిట్’ చేపట్టిన విచారణలో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. నిందితుడి సెల్ ఫోన్ నుంచి ఎక్కువగా కాల్స్ వెళ్లడంతో ప్రత్యేక బృందాలు గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, ప్రకాశం జిల్లా కనిగిరికి వెళ్లి పలువురిని అదుపులోకి తీసుకొని విశాఖకు తరలించారు. కనిగిరిలోని దేవాంగనగర్ నుంచి తీసుకొచ్చిన సైదాబీ షేక్, అమ్మాజీ షేక్, రసూల్‌లను నిందితుడు శ్రీనివాసరావు నుంచి వచ్చిన ఫోన్‌కాల్స్‌పై ఆరా తీశారు.
జగన్‌పై హత్యాయత్నం జరిగిన ముందురోజు రసూల్ ఫోన్‌కు మిస్ట్‌కాల్ రావడంతో అతడు ఆ నెంబర్‌కు పదేపదే ఫోన్ చేయడంతో శ్రీనివాసరావు ఒకసారి లిఫ్ట్ చేసి కట్ చేశాడు. సైదాబీ షేక్ ఫోన్‌కు కూడా నిందితుడి నుంచి మిస్డ్‌కాల్ వచ్చింది. తిరిగి అదే నంబర్‌కు ఫోన్ చేయగా, లిఫ్ట్ చేసిన శ్రీనివాసరావు చాలాసేపు మాట్లాడాడు. అస్తమానం కాల్ చేస్తున్నావు, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి చేస్తున్నావ్.. ఎందుకు చేస్తున్నావు.. అంటూ ఆమె ఫోన్‌లో నిలదీసింది. ‘‘నేనెవరో తెలియాలంటే రేపు టీవీ చూడండి మీకే తెలుస్తుంది. జగన్‌పై అటాక్ చేస్తున్నా.. అన్ని టీవీల్లో బాగా చూపిస్తారు. ఆ తర్వాత కనిపిస్తానో లేదో’’ అని శ్రీనివాసరావు బదులివ్వడంతో ఆమె విస్తుపోయింది. మనకెందుకులే ఈ గొడవ అనుకుంటూ ఫోన్ కట్ చేసింది.