తాడేపల్లి: అధికార దాహంతో డొక్కలు ఎండిపోయిన స్థితిలో ఉన్న డొక్కా మాణిక్య వరప్రసాద్ సీఎం చంద్రబాబు ప్రాపకం కోసం ప్రాకులాడుతున్నారని వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పదవుల కోసం నిత్యం పార్టీలు మారే విశ్వసతనీయత లేని రాజకీయ నాయకుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు వైయస్ జగన్ పై మాట్లాడే కనీస అర్హత కూడా లేదని అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. రాజకీయాల్లో రంగులు మార్చే ఊసరవెల్లిలా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ముకాసే నైజం డొక్కా సొంతం. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రయాణం మొదలు పెట్టి నేడు టీడీపీలో ఉన్న వరకు ఎన్నిసార్లు పార్టీలు మారారో ప్రజలకు తెలుసు. రాజీనామా చేసిన పార్టీల్లోకి మళ్లీ తిరిగి చేరుతున్న డొక్కా లాంటి వ్యక్తికి సిద్దాంతాల గురించి తెలుసా? తానేదో తులసివనంలో ఉన్నట్టు డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతున్నాడు. వైయస్ఆర్‌సీపీలో ఉండి టీడీపీని తిట్టిన విషయాలను ఆయన మరిచిపోయారు. ఎదుటి పార్టీల నాయకులను తిడితేనే తనకు పదవులు వస్తాయనే భ్రమల్లో నుంచి ఆయన బయటకు రావాలి. కూటమి ప్రభుత్వంలో తనకు పదవి రాకపోవడంతో చంద్రబాబు దృష్టిలో పడటం కోసం నానా రకాల సర్కస్ విన్యాసాలు చేస్తున్నాడు. పదవీ వ్యామోహంతో ఒక టీవీ చానెల్ డిబేట్ లో వైయస్ఆర్‌సీపీ గురించి, వైయస్ జగన్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. తన స్థాయిని మర్చిపోయి వైయస్ జగన్‌పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. పదవుల కోసం దిగజారి మాట్లాడే డొక్కాకు విలువలు ఉన్నాయని అనుకోవడం లేదు. ఒక పార్టీలో ఉంటూ ఇంకో పార్టీ వారితో మంతనాలు చేయడం ఆయనకు అలవాటు. వైయస్ఆర్‌సీపీలో ఉంటూనే టీడీపీ వారితో మంతనాలు చేసేవాడు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎమ్మెల్సీ అవకాశం ఇస్తే టీడీపీకి వెన్నుపోటు పొడిచిన చరిత్ర డొక్కాది. మళ్లీ వైయస్ఆర్‌సీపీలో ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే ఇక్కడ కూడా వెన్నుపోటు పొడిచి టీడీపీలో చేరాడు. నారా లోకేష్ రెడ్‌బుక్‌లో డొక్కా పేరు మంత్రి నారా లోకేష్ దగ్గర ఉన్న ఎర్ర బుక్కులో డొక్కా పేరు కూడా ఉంది. వైయస్ఆర్‌సీపీ వారిని ఎంత తిట్టినా పదవులు రావని గ్రహించాలి. వైయస్ జగన్‌కి డబ్బు పిచ్చి ఉందని డొక్కా నోటికొచ్చినట్టు మాట్లాడారు. డబ్బిస్తేనే నీకు వైయస్ఆర్‌సీపీలో పదవులు ఇచ్చారా? వైయస్ఆర్‌సీపీ అధికారంలో ఉండగా ఎంతోమంది దళితులు, మైనారిటీలు కీలకమైన పదవుల్లో కొనసాగారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఇచ్చారు. పచ్చ కామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనపడుతుందన్నట్టుగా, తెలుగుదేశంలో పార్టీ ఉండి ఆ పార్టీ సంస్కృతిని డొక్కా వంటపట్టించుకున్నారు. ఇప్పుడు దానిని వైయస్‌ఆర్‌సీపీకి అంటగట్టాలని చూస్తున్నారు. డొక్కా మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. మాదిగ కుల ద్రోహి డొక్కా. మాదిగ కులాన్ని వాడుకుని పదవులన్నీ డొక్కా అనుభవించాడే కానీ, మాదిగల సమస్యలపైన ఏరోజూ మాట్లాడలేదు. పదవులు కావాలంటే చంద్రబాబు, లోకేష్ ఫొటోలు ఇంట్లో పెట్టుకుని పూజలు చేయండి, మాకేం అభ్యంతరం లేదు. అంతేకానీ వైయస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయాలని చూస్తే మాత్రం సహించేది లేదని కనకారావు హెచ్చరించారు.