మన దేశంలో ఓ మహిళ ఇంటగెలవడమే కష్టం - ఇక రచ్చ గెలవడమనేది మరీమరీ కష్టం. కానీ, సుప్రసిద్ధ పర్యావరణ ఉద్యమనేత, సామాజిక కార్యకర్త, వైజ్ఞానిక తత్వవేత్త డాక్టర్ వందనా శివ, ప్రతిష్టాత్మకమయిన ఫుకువోకా పురస్కారం గెల్చుకున్నారు. సెప్టెంబర్ నెలలో ఆమె ఈ అంతర్జాతీయ పురస్కారాన్ని అందుకోవడానికి జపాన్ వెళ్లనున్నారు. అరవయ్యేళ్ల కిందట డెహ్రాడూన్‌లో పుట్టి, పదార్థ విజ్ఞాన శాస్త్రం, రసాయన శాస్త్ర రంగాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసి, వైజ్ఞానిక తత్వశాస్త్రంలో డాక్టరేట్ పట్టా పొందిన వందనా శివ గత మూడున్నర దశాబ్దాలుగా తన యావచ్ఛక్తినీఆసియా, ఆప్రికా, లాటిన్ అమెరికాలాంటి వెనకబడిన ప్రాంతాల్లోనే కాక, స్విజర్లండ్, ఐర్లండ్, ఆస్ట్రియాలాంటి యూరపియన్ దేశాల్లో సైతం పర్యావరణ పరిరక్షణకు -ముఖ్యంగా నీటి సక్రమ వినియోగం, పరిరక్షణ రంగాలకు - అంకితం చేశారు. ఆమె కృషికి, మన దేశంలోనూ, విదేశాల్లోనూ కూడా ఎంతో గుర్తింపు దక్కింది. ఫుకువోకా పురస్కారం ఈ గుర్తింపునకు కలికి తురాయి వంటిది. వ్యవసాయం - ఆహారం రంగాల్లో అనేక శతాబ్దాలుగా చెలామణీలో ఉన్న మూలసూత్రాలనూ గీటురాళ్లనూ వందనా శివ సవాలు చేశారు. మేధో సంపద హక్కులు, జీవ వైవిధ్యం, జీవశాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, జీవశాస్త్ర నైతికత, జన్యుశాస్త్ర ఇంజినియరింగ్ తదితర రంగాల్లో ఆమె మేధోసాధన -ప్రధానంగా- సాగింది. ఈ రంగాల్లో పనిచేసేవారి ఆలోచనా ధోరణిలో ఆమె ఎంతో మార్పు తీసుకొచ్చారని చెప్తారు. నాలుగు దశాబ్దాల కిందటే ఆమె ఓ శాస్త్ర పరిశోధనా కేంద్రాన్ని స్థాపించారు. ఈ కృషికి కొనసాగింపుగానే 1991లో ‘నవధాన్య’ సంస్థను ఆమె ప్రారంభించారు. విత్తన పరిరక్షకులూ, సేంద్రియ వ్యవసాయదారులతో కూడిన బృందమే ‘నవధాన్య’. విత్తనాలను పరిరక్షించడమంటే జీవ వైవిధ్యాన్నీ, జీవ రక్షణ విజ్ఞానాన్నీ, సాంస్కృతిక వైవిధ్యాన్నీ, స్వావలంబన సంస్కృతినీ కాపాడ్డమేనంటారు డాక్టర్ వందనా శివ. పైకి ఇవన్నీ కడుపు నిండినవాళ్ల కబుర్లు లాగే కనిపించవచ్చు. కానీ, మన భూగోళం భవితవ్యానికీ, ప్రకృతి వనరుల భవిష్యత్తుకూ, ఇక్కడి జీవరాశి మనుగడకూ సంబంధించిన విషయాలివి. వీటిని గురించి ఇవాళే ఆలోచించకపోతే, రేపు చింతించి ప్రయోజనం ఉండకపోవచ్చు. వందనా శివలాంటి తొలికోళ్లు ఈ విషయాన్నే మనకు గుర్తు చేస్తున్నారు. అందుకు ఆమెకి ఓ అంతర్జాతీయ పురస్కారం లభించడం కన్నా మనకు కావలసిందేముంది?