దేశ చరిత్రలోనే అతిపెద్ద భూ దోపిడీ!

‘అసైన్డ్‌’ ఆక్రమణ.. బడుగుల భూముల్లో వాలిన పచ్చ గద్దలు 

ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను భయపెట్టి దోపిడీ.. బినామీల పేరిట అక్రమ జీపీఏ రిజిస్ట్రేషన్లు

రూ.5,500 కోట్ల విలువైన 1,100 ఎకరాలు హస్తగతం  

అమరావతి: రాష్ట్రానికి రాజధాని పేరిట చంద్రబాబు సొంత సంస్థానాన్ని సృష్టించుకున్నారు. స్వతంత్య్ర దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని భూదో­పిడీకి బాటలు వేశారు. ఆధునిక జమీందారులా మారిపోయి బడుగుల భూములకు ఎసరు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను భయ­భ్రాంతులకు గురి చేసి అసైన్డ్‌ భూములను లాక్కు­న్నారు. రికార్డులు తారుమారు చేసి ప్రభుత్వ భూ­ములను చెరబట్టారు. ప్రైవేట్‌ భూములను హస్త­గతం చేసు­కున్నారు. అధికారం అండతో భూ దందాలకు మార్గదర్శిగా నిలిచారు. 

2014 – 19 మధ్య అధి­కారంలో ఉండగా భూసమీకరణ ప్యాకేజీ మార్కెట్‌ విలువ ప్రకారం ఏకంగా రూ.5,500 కోట్ల విలువైన భూములను కొల్లగొట్టడం దేశ చరిత్రలోనే అతిపెద్ద భూ దోపిడీగా రికార్డులకు ఎక్కింది. చంద్రబాబు బృందం అరాచకాలు సీఐడీ విచారణలో పూర్తి ఆధారాలతో నిగ్గు తేలాయి. దీనిపై సీఐడీ ఇప్పటికే న్యాయస్థానంలో చార్జ్‌షీట్‌ కూడా దాఖలు చేసింది.

బెదిరించి లాక్కుని తాపీగా ప్యాకేజీ..
అసైన్డ్‌ భూములను కొల్లగొట్టేందుకు టీడీపీ పెద్దలు పక్కా వ్యూహం రచించారు. అసైన్డ్‌ భూములకు పరిహారం ఇవ్వబోమంటూ బెదిరించి 814 మంది బినామీల ముసుగులో కాజేశారు. అనంతరం అసైన్డ్‌ భూములకు ప్యాకేజీని ప్రకటించడం వారి కుతంత్రానికి నిదర్శనంగా నిలుస్తోంది. భూసమీకరణ ప్యాకేజీని నిర్ణయిస్తూ 2015 జనవరి 1న టీడీపీ సర్కారు జీవో నంబరు 1 జారీ చేసింది. ఆ జీవోలో ప్రైవేట్‌ భూములకే భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించారు. అసైన్డ్‌ భూములకు ఎలాంటి ప్యాకేజీ ప్రకటించలేదు. 
 

అనంతరం తమ బినామీలు, ఏజెంట్లను అమరావతి గ్రామాల్లోకి పంపి ప్రభుత్వం అసైన్డ్‌ భూములను ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా ఉచితంగా తీసుకుంటుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను హడలగొట్టారు. దీంతో గత్యంతరం లేక కారు చౌకగా ఎకరా కేవలం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకే చంద్రబాబు, నారాయణ, ఇతర టీడీపీ పెద్దల బినామీలకు అసైన్డ్‌ భూములను సేల్‌ డీడ్ల ద్వారా విక్రయించే పరిస్థితి కల్పించారు. ఆ తరువాత అసైన్డ్‌ భూములకు కూడా భూసమీకరణ ప్యాకేజీని ప్రకటిస్తూ 2016 ఫిబ్రవరి 17న తాపీగా జీవో నంబరు 41 జారీ చేశారు. అప్పటికే అసైన్డ్‌ భూములు టీడీపీ పెద్దల బినామీల పరం కావడంతో వారికే భూసమీకరణ ప్యాకేజీ దక్కేలా స్కెచ్‌ వేశారు.

ఉన్నతాధికారుల అభ్యంతరాలు బేఖాతర్‌ 
చట్ట ప్రకారం దేశంలో 1954కు ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులకు పంపిణీ చేసిన అసైన్డ్‌ భూములను ఇతరులకు విక్రయించుకునే అవకాశం ఉంది. ఆ తరువాత పంపిణీ చేసిన అసైన్డ్‌ భూముల క్రయ విక్రయాలు చట్ట విరుద్ధం. ఈమేరకు నాటి కలెక్టర్, సీఆర్‌డీయే, రెవెన్యూ, న్యాయ శాఖ ఉన్నతాధికారులు, అడ్వకేట్‌ జనరల్‌ తమ అభ్యంతరాలను జీవో 41 నోట్‌ ఫైళ్లలో ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా వెల్లడించారు. వీటిని లెక్క చేయకుండా బినామీల ద్వారా హస్తగతం చేసుకున్న భూములకు చంద్రబాబు ప్యాకేజీని ప్రకటించారు.

అసైన్డ్‌ భూ దోపిడీదారులు..
ఏ–1: చంద్రబాబు నాయుడు
ఏ–2 : పొంగూరు నారాయణ
ఏ–3 : అన్నే సుధీర్‌బాబు 
(అప్పటి తుళ్లూరు 
మండల తహసీల్దార్‌)
ఏ–4 : కేపీవీ అంజనీకుమార్‌ 
(ఎండీ, రామకృష్ణ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌)

1,100 ఎకరాలు.. 1,336 మంది బినామీలు
చంద్రబాబు బృందం అమరావతి పరిధిలో ఏకంగా 1,100 ఎకరాల అసైన్డ్‌ భూములను కొల్లగొట్టింది. మొత్తం 1,336 మంది బినామీల పేరిట ఆ భూములను హస్తగతం చేసుకున్నారు. భూ సమీకరణ ప్యాకేజీ ప్రకారం ఆ భూముల విలువ ఏకంగా రూ.5,500 కోట్లు కావడం చంద్రబాబు భారీ భూదోపిడీకి నిదర్శనం.

కోర్టును మోసం చేసి మరీ...
అసైన్డ్‌ భూములను కొల్లగొట్టేందుకు చంద్రబాబు ఏకంగా న్యాయస్థానాన్నే మోసం చేయడం విస్మయపరుస్తోంది. ఈ కుట్రను అమలు చేసేందుకు రెవెన్యూ కార్యాలయాల్లో అసైన్డ్‌ భూముల రికార్డులను మాయం చేశా­రు. 1954 తరువాత భూ పంపిణీ రికార్డులేవీ లేవంటూ మంగళగిరి, తుళ్లూరు, తాడికొండ మండల రెవెన్యూ అధికారులతో ఓ నివేదిక ఇప్పించి న్యాయస్థానానికి సమర్పించారు.  వాస్తవానికి 1954 తరువాత పలుదఫాలు పేదలకు అసైన్డ్‌ భూముల పంపిణీ జరిగింది. 

దివంగత సీఎం వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి హ­యాంలో 2004–05లో అసైన్డ్‌ భూములను పంపిణీ చేశారు. అమరావతి అసైన్డ్‌ భూములలో 1954 తరువాత పంపిణీ చేసిన భూములు ఉన్నట్లు రుజువు చేసే రికార్డులు వెలుగులోకి వచ్చాయి. వాటిలో 1987, 2004–05లో పంపిణీ చేసిన అసైన్డ్‌ భూములు ఉన్నట్లు వెల్లడైంది. సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) సమగ్ర విచారణలో మొత్తం భూబాగోతం బట్టబయలైంది.

ఉన్నతాధికారుల వాంగ్మూలం
టీడీపీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్‌ భూముల బదలాయింపు చేసినట్లు రెవెన్యూ ఉన్నతాధికారులు 164 సీఆర్‌పీసీ కింద న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి తనను అప్రూవర్‌గా పరిగణించాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. 

ఏ 1 బాబు, ఏ 2 నారాయణ
అమరావతి భూ దోపిడీ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణ­లతో­పాటు పలువురిపై విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో సీఐడీ చార్జ్‌షీట్‌ కూడా దాఖలు చేసింది. ఐపీసీ సెక్షన్లు 420, 409, 506, 166, 167, 217, 120 (బి), 109 రెడ్‌విత్‌ 34, 35, 36, 37.. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్లు 3(1),(జి), 3(2), అసైన్డ్‌ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(2) రెడ్‌విత్‌ 13(1), (సి), (డి) కింద వారిపై అభియోగాలు నమోదు చేసింది. 

Back to Top