ఈవీ ' ఎం మాయ‌' చేశావే!

 అత్యధిక ఓట్లు వచ్చిన కాంగ్రెస్‌కు తక్కువ సీట్లు రావడంపై సర్వత్రా సందేహాలు

తిరిగి బ్యాలెట్‌ విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలంటూ పెరుగుతున్న డిమాండ్‌

మొన్నటి సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా ఫలితాలపై ఏడీఆర్, వీడీఎఫ్‌ అనుమానాలు

ఏపీలో పార్లమెంట్‌ సీట్ల లెక్కింపుల్లో.. పోలైన ఓట్లకంటే 49 లక్షల ఓట్లు పెరిగాయన్న వీడీఎఫ్‌

ఆ రెండు సంస్థలు వ్యక్తం చేసిన అనుమానాలను ఇప్పటికీ నివృత్తి చేయని ఈసీ

అమరావతి: ఎల్రక్టానిక్‌ ఓటింగ్‌ మెషీన్ల (ఈవీఎంలు) పనితీరుపై దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజికవేత్తల నుంచి సాధారణ ప్రజల వరకూ వ్యక్తం చేస్తున్న అనుమానాలను తాజాగా వెల్లడైన హరియాణా ఎన్నికల ఫలితాలు మరింత పెంచాయి. అత్యధిక ఓటింగ్‌ శాతంతో అత్యధిక ఓట్లు పొందిన కాంగ్రెస్‌ పార్టీ 37 స్థానాలకు పరిమితం కాగా ఆ పార్టీ కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీకి 48 సీట్లు రావడంతో ఈ సందేహాలు మరింత పెరిగాయి. 

అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈవీఎంల వినియోగానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హరియాణా ఎన్నికల ఫలితాల అనంతరం ఈ అనుమానాలు బలపడటంతో ప్రజాస్వామ్య పరిరక్షణకు బ్యాలెట్‌ విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్‌ దేశవ్యాప్తంగా పెరుగుతోంది. 

సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ సహా దేశవ్యాప్తంగా పలు పోలింగ్‌ కేంద్రాల్లో పోలైన ఓట్లకు, లెక్కింపులో వచ్చిన ఓట్లకు మధ్య భారీ తేడాలు ఉన్నట్లు వోట్‌ ఫర్‌ డెమోక్రెసీ (వీఎఫ్‌డీ), అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) సంస్థలు ఆధారాలతో సహితంగా బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. వైఎస్సార్‌ సీపీ కూడా ఈవీఎంల పనితీరుపై పలు సందేహాలను వ్యక్తం చేయడం విదితమే. 

ఈసీ మౌనంతో పెరుగుతున్న అనుమానాలు 
ఈవీఎంలపై తలెత్తిన సందేహాలను నివృత్తి చేయాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తొలి నుంచీ మౌనం వహిస్తుండటం అనుమానాలను మరింత పెంచుతోంది. ఫలితాలు వెల్లడైన వెంటనే అప్‌లోడ్‌ చేయాల్సిన ఫారం– 20 వివరాలపై తీవ్ర జాప్యం చేయడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. ఫారం – 20లో ఆయా  అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గంలో ప్రతి అభ్యర్థికి పోలైన ఓట్ల వివరాలు ఉంటాయి. దీని ద్వారా ప్రతి నియోజకవర్గంలో పోటీ చేసిన ఒక్కో అభ్యరి్థకి ఎన్ని ఓట్లు పోలయ్యాయి? లెక్కింపులో ఎన్ని ఓట్లు వచ్చాయి? అనేది తెలిసిపోతుంది.

సాధారణంగా ఫారం–20ని ఓట్ల లెక్కింపు జరిగిన వారం రోజుల్లోనే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. అయితే ఎన్నికల సంఘం ఈసారి ఈ వివరాలను వెంటనే వెల్లడించలేదు. ఎన్నికల కౌంటింగ్‌ జరిగిన 108 రోజుల తర్వాత తాపీగా గత నెల 19న నియోజకవర్గాలవారీగా పార్లమెంటు, శాసన సభ స్థానాలకు లెక్కించిన ఓట్ల వివరాలతో ఫారం–20ని ‘సీఈవో ఆంధ్ర’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. ఇంత ఆలస్యంగా వెల్లడించడంపై పలు అనుమానాలు ముసురుకుంటున్నాయి. 

భారీగా పెరిగిన పోలింగ్‌ శాతం 
ప్రతి ఎన్నికల్లో పోలింగ్‌ రోజు ఈసీ ప్రాథమికంగా పోలింగ్‌ శాతాన్ని  ప్రకటిస్తుంది. ఆ తర్వాత రోజు తుది శాతాలను ప్రకటిస్తుంది. అయితే ఈసారి పోలింగ్‌ తుది శాతాన్ని ప్రకటించేందుకు ఏకంగా నాలుగు రోజుల సమయం తీసుకుంది.  అందులోనూ ప్రాథమికంగా పోలైన ఓట్లకు, తుది ఓట్లకు మధ్య భారీ తేడాలు ఉన్నాయి.  ఇలా తుది శాతాల ప్రకటనకు సుదీర్ఘ సమయం తీసుకోవడం, భారీ తేడాలు రావడంతో అనుమానాలకు బీజం పడింది. మే 13న రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్‌  నియోజకవర్గాలకు పోలింగ్‌ జరిగింది.

 ఆరోజు రాత్రి 8 గంటలకు తొలుత పోలింగ్‌ శాతాన్ని ఎన్నికల సంఘం ప్రకటించింది. తుది శాతాన్ని నాలుగు రోజులు ఆలస్యంగా మే 17న ప్రకటించింది. రాష్ట్రంలో ఈ రెండు పోలింగ్‌ శాతాల మధ్య 12.54 శాతం పెరుగుదల ఉంది. రాష్ట్రంలో పోలైన ఓట్లలో ఏకంగా 49 లక్షల ఓట్లు అదనంగా పెరిగాయి. రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో సగటున 1.96 లక్షల ఓట్లు అదనంగా పోలయ్యాయి. ఇది ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని వోట్‌ ఫర్‌ డెమొక్రసీ (వీఎఫ్‌డీ) సంస్థ స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా  538 స్థానాల్లో తేడాలు.. 
దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 538 ఎంపీ స్థానాల్లో పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్లకు మధ్య భారీ తేడాలు ఉన్నాయని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌), వీఎఫ్‌డీ సంస్థలు పేర్కొన్నాయి. 362 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే 5,54,598 ఓట్లను తక్కువగా లెక్కించినట్లు తమ అధ్యయనంలో వెల్లడైందని తెలిపాయి. 176 లోక్‌సభ స్థానాల్లో 35,093 ఓట్లకుపైగా అదనంగా లెక్కించారని వెల్లడించాయి. 

పోలైన ఓట్ల ప్రకారం చూస్తే ఏపీలో కూటమికి 14, వైయ‌స్ఆర్‌సీపీకి 11 లోక్‌సభ స్థానాలు దక్కాలని వీడీఎఫ్‌ స్పష్టం చేసింది. తమ అధ్యయన నివేదికలను ఎన్నికల సంఘానికి కూడా పంపాయి. పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటానికి కారణాలు ఏమిటో వెల్లడించాలని ఏడీఆర్, వీఎఫ్‌డీ సంస్థల ప్రతినిధులు ఎన్నికల సంఘాన్ని అప్ప­ట్లోనే ప్రశ్నించారు. కానీ.. ఎన్నికల సంఘం ఇప్ప­టికీ దీనిపై స్పందించకపోవడం గమనార్హం. 

Back to Top