నీళ్ల పప్పు.. ఉడికీ ఉడకని అన్నం.. సంక్షేమ హాస్టళ్లలో రోజూ ఇదే మెనూ. ఈ భోజనాన్ని తినలేక పిల్లలు అల్లాడిపోతున్నారు. చలి వణికిస్తోంటే కప్పుకోవడానికి దుప్పట్లు లేక విలవిల్లాడిపోతున్నారు. ఓ వైపు దోమల మోత.. మరో వైపు బయటి నుంచి దుర్గంధం వెదజల్లుతుండటంతో రాత్రిళ్లు పడుకోలేకపోతున్నారు. ‘ఇదేంటయ్యా..’ అని పిల్లల తల్లిదండ్రులు వార్డెన్లను ప్రశ్నిస్తే.. ‘మేమేం చేయాలి.. ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం లేదు.. ఎన్ని రోజులని మేం అప్పులు చేసి తెచ్చిపెట్టాలి? ఇప్పటికే చాలా వరకు అప్పులు చేశాం.. ఆ అప్పు తీరిస్తేనే కొత్తగా సరుకులు ఇస్తామని కిరాణా కొట్ల వాళ్లు చెబుతున్నారు. పై ఆఫీసర్లకు రోజూపరిస్థితి చెబుతూనే ఉన్నాం. వారు అంతా విని ఫోన్ పెట్టేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దుప్పట్లు కూడా ఇవ్వలేదు. అవన్నీ పక్కన పెట్టినా.. కనీసం మెస్ చార్జీలన్నా సమయానికి ఇవ్వాలి కదా..’ అంటూ వాపోతున్నారు. వార్డెన్లే ఇలా మాట్లాడుతుంటే తల్లిదండ్రులు బిక్కమోహం వేసుకుని చూడాల్సిన దుస్థితి. సరిగ్గా ఐదు నెలలకు ముందు వరకు వారంలో రోజుకొక మెనూతో చక్కటి భోజనం తిన్న విద్యార్థులు ఆ రోజులు గుర్తు చేసుకుంటూ.. ప్రస్తుత పరిస్థితిపై వాపోతున్నారు. మానవత్వం లేని కూటమి సర్కారు తీరుతో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు, గురుకులాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఓ వైపు చలి వణికిస్తుండగా, మరోవైపు పిల్లలకు సరైన భోజనం కరువైంది. చాలా చోట్ల మరుగుదొడ్లు, మంచి నీటి సమస్యతో విద్యార్థులు అల్లాడిపోతున్నారు. వారికి క్రమం తప్పకుండా ఇవ్వాల్సిన వస్తువులతోపాటు కాస్మోటిక్, మెస్ చార్జీలు విడుదల చేయడం లేదు. ఈ దిశగా కూటమి పార్టీల నేతలు ఎన్నికల ముందు హామీలు గుప్పించి ఐదు నెలలైనా అమలుకు నోచుకోలేదు. ఫలితంగా రాష్ట్రంలో 3,836 హాస్టళ్లు, గురుకులాల్లో చదివే 6,34,491 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ తదితర పేద వర్గాల విద్యార్థులతోపాటు వాటిలో పని చేస్తున్న 36,537 మంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. ప్రతి సంక్షేమ హాస్టల్, గురుకులాల్లో చదివే ఒక్కో విద్యార్థికి ఏటా స్కూళ్లు ప్రారంభమయ్యే సమయంలో ఒక దుప్పటి, ఒక కార్పెట్, రెండు టవళ్లు, ప్లేటు, గ్లాసు, బౌలు, ట్రంకు పెట్టె ఇవ్వాలి. ఐదు నెలలు గడిచినా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఒక్కొక్కరికి రోజుకు రూ.46 చొప్పున డైట్ బిల్లు (మెస్ చార్జీలు) ఇవ్వాలి. మూడు నెలలు (ప్రస్తుతం నాల్గవ నెల)గా ఈ బిల్లులు పెండింగ్ పెట్టడంతో హాస్టల్, గురుకులాల నిర్వాహకులే చేతి నుంచి డబ్బులు పెట్టుకుని నెట్టుకొస్తున్నారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన కాస్మొటిక్ చార్జీలు, బార్బర్ ఖర్చులను తల్లుల ఖాతాలకు జమ చేయాల్సి ఉంది. ప్రతి నెల ఇవ్వాల్సిన కాస్మొటిక్ చార్జీలు సైతం ఐదు నెలలుగా పెండింగ్‌లో పెట్టారు. ప్రస్తుత ప్రభుత్వం కంటింజెంట్ బిల్లులు కూడా విడుదల చేయలేదు. ఈ నిధులను స్టేషనరీ, నిత్యావసర వస్తువులు, హెల్త్ కిట్స్, రిపేర్లు వంటి అత్యవసరమైన వాటికి ఖర్చు పెడతారు. ఒక్కొక్క హాస్టల్, గురుకులానికి నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు కంటింజెంట్ అవసరాలు ఉంటాయి. అంతటా అవే సమస్యలే.. » ఉమ్మడి కృష్ణా జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందడం లేదు. చాలా చోట్ల అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. మంచి నీరు సరిగా ఉండదు. మచిలీపట్నంలోని సాంఘిక సంక్షేమ శాఖ సమీకృత బాలుర వసతి గృహంలో ఆర్వో ప్లాంట్ మూలన పడింది. బీసీ కళాశాల బాలికల వసతి గృహంలో 88 మంది విద్యార్థినిలు నేల మీదే పడుకుంటున్నారు. వీరికి కనీసం దుప్పట్లు కూడా పంపిణీ చేయలేదు. అవనిగడ్డ ఎస్సీ బాలికల వసతి గృహంలో మే నుంచి కాస్మటిక్స్ ఛార్జీలు ఇవ్వ లేదు. ఏ ఒక్క హాస్టల్‌లోనూ సీసీ కెమెరాలు, ఫెన్సింగ్ ఏర్పాటు చేయలేదు. » గుంటూరు నగరంలోని ఎస్సీ, బీసీ, గిరిజన సంక్షేమ హాస్టళ్లలో కనీస మౌలిక వసతులు కరువయ్యాయి. మార్చి నుంచి సంక్షేమ హాస్టళ్లకు డైట్ ఛార్జీలు రాలేదు. దీంతో వార్డెన్ న్లు అప్పు తీసుకువచ్చి విద్యార్థినులకు ఆహారం పెట్టాల్సిన పరిస్థితి. జూన్ నెలలో ఇవ్వాల్సిన దుప్పట్లు, ప్లేట్లు, గ్లాస్‌లు ఇంత వరకు ఇవ్వలేదు. » ఒంగోలు జిల్లాలోని చాలా వరకు హాస్టళ్లలో మెనూ సక్రమంగా అమలు చేయడం లేదు. వారంలో 6 సార్లు గుడ్డు ఇవ్వాల్సి ఉండగా ఒక్కరోజుతో సరిపెడుతున్నారు. ప్రతి రోజూ పాలు అందించాల్సి ఉండగా పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితిలో కనిగిరి ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం–2లో 45 మందికి గాను ముగ్గురు పిల్లలే హాస్టల్లో ఉన్నారు. పామూరు పట్టంలోని ఎస్సీ బాలుర హాస్టల్లో 30 మందికి గాను ఒక్క విద్యార్థి మాత్రమే కనిపించాడు. గిద్దలూరు బేస్తవారిపేటలోని బీసీ హాస్టల్‌లో వాచ్‌మెన్, అటెండర్‌లే వంట చేస్తున్నారు. » ఏలూరు జిల్లాలోని హాస్టళ్లలో చలికి తట్టుకోలేక చాలా మంది పిల్లలు హాస్టల్ వదిలి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. దెందులూరు మండలం కొవ్వలిలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో 400 మంది విద్యార్థులకు ఇప్పుడు 50 మంది మాత్రమే ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని హాస్టళ్లలో పారిశుద్ధ్యం బాగోలేక విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. » కాకినాడ జిల్లాలోని పలు సంక్షేమ హాస్టళ్లలో భద్రతా లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. అధ్వాన పారిశుద్ధ్యం వల్ల పందులు, దోమలతో సావాసం అన్నట్టుగా పరిస్థితి ఉంది. ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం గురుకుల పాఠశాల ప్రాంగణం అధ్వానంగా తయారైంది. సామర్లకోట బీసీ బాలికల వసతి గృహం చుట్టూ తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. పిఠాపురం బైపాస్ రోడ్డులో ఉన్న బాలికల సంక్షేమ హాస్టల్లో భద్రత కరువైంది. చివరకు బాలికలు దుస్తులు మార్చుకునే సౌకర్యం కూడా లేదు. రాత్రి పూట విద్యుత్ పోయిందంటే హాస్టల్‌లో అంధకారమే. » విజయనగరం జిల్లా కేంద్రంలో కాటవీధిలోనున్న బీసీ సంక్షేమ వసతి గృహంలో కోండ్రు సాంబశివరావు అనే విద్యార్థి ఇటీవల మృత్యువాతపడ్డాడు. కారణమేమిటో ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ ఘటనతో ఇళ్లకు వెళ్లిపోయిన విద్యార్థుల్లో చాలా మంది మళ్లీ తిరిగి హాస్టల్‌లో అడుగు పెట్టడానికి భయపడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గత మూడు నాలుగు నెలల్లో 8 మంది విద్యార్థులు అనారోగ్య సమస్యలతో మరణించారు. » విశాఖపట్నం జిల్లాలో కాస్మొటిక్ చార్జీలు ఇవ్వలేదు. అధికారులు ఎప్పటికప్పుడు ఈ అంశంపై నివేదికలు పంపిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అనకాపల్లి జిల్లాలో బాలికల హాస్టళ్లన్నింటిలో సీసీ కెమెరాల్లేవు. విద్యార్థులకు దోమ తెరలు, దుప్పట్లు, జంబుకానాలు ఇవ్వలేదు. అల్లూరి జిల్లాలోనూ అదే పరిస్థితి. » బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రాతినిథ్యం వహిస్తోన్న శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో కనీస వసతులు కరువయ్యాయి. గతేడాది కంటే విద్యార్థుల సంఖ్య తగ్గింది. » మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్వగ్రామమైన కర్నూలు జిల్లా లద్దగిరిలో బాత్‌రూమ్‌లు లేక పిల్లలు ఆరు బయట స్నానాలు చేస్తున్నారు. కోసిగిలో పందుల బెడద తీవ్రంగా ఉంది. నంద్యాలలోని ఎస్సీ, ఎస్టీ బాలుర వసతి గృహాల్లో నీటి సౌకర్యం లేదు. విద్యార్థులు బహిర్భూమికి ముళ్ల పొదలు, రైల్వే ట్రాక్ వద్దకు వెళుతున్నారు. శ్రీశైలం, సున్నిపెంట వసతి గృహాలకు ప్రహరీ లేదు. ఈ హాస్టళ్లు నల్లమల అభయారణ్యం పరిధిలో ఉన్నందున అడవి జంతువులు ఎప్పుడు దాడి చేస్తాయోనని విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల పలుమార్లు వసతి గృహాలకు సమీపంలో చిరుతలు సంచరించాయి. ప్యాపిలి ఎస్సీ వసతి గృహంలో మంచి నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. పాణ్యంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో మంచి నీటి సమస్య ఉంది. » చిత్తూరులో ఎస్సీ ప్రీ మెట్రిక్ వసతి గృహంలో కుక్, కామాటి, వార్డెన్ లేరు. వాచ్‌మెన్ బంధువులతో అనధికారికంగా వంటలు వండిస్తున్నారు. జిల్లాలోని చాలా హాస్టళ్లలో వార్డెన్లు చేతి నుంచి ఖర్చు చేస్తూ నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పుడు తిరిగి తీసుకుంటామని చెబుతున్నారు. చౌడేపల్లిలో మరుగుదొడ్లు సహా వసతి గృహాన్ని బాలురే శుభ్రం చేసుకుంటున్నారు. సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలోని బీసీ, ఎస్టీ వసతి గృహాల్లో మరుగు దొడ్లకు నీటి సౌకర్యం లేదు. నిధుల లేమితో తిరుపతిలోని హాస్టళ్లలో ఐదు నెలలుగా మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదు. కడుపునిండా భోజనం కరువు.. ప్రభుత్వం మూడు నెలలుగా డైట్ చార్జీలు ఇవ్వక పోవడంతో హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులకు ఎలా భోజనం పెట్టాలో తెలియక వార్డెన్లు తలలు పట్టుకుంటున్నారు. సరుకులను అప్పుపై తెచ్చి వంట చేయించడం కష్టంగా మారిందని వాపోతున్నారు. పెద్ద మొత్తంలో సరుకులను అప్పుగా ఇవ్వడానికి దుకాణదారులు ముందుకు రావడం లేదని గ్రామీణ ప్రాంత హాస్టల్, గురుకులాల వార్డెన్లు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో విద్యార్థులకు అందించే ఆహారంలో పూర్తిగా నాణ్యత కరువైంది. నీళ్ల చారు, నాసిరకం అన్నంతో కడుపు నింపుకోవాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే సమస్యలు.. ఆపై ఆకలి కేకలతో హాస్టళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. మరో వైపు భద్రత కరువైంది. ఎవరు పడితే వారు హాస్టల్ ప్రాంగణంలో వచ్చి పోతుంటారు. ఎవరు వస్తున్నారో.. ఎందుకు వస్తున్నారో అడిగే నాథుడే ఉండడు. ఈ సమస్యలన్నింటినీ ప్రస్తావిస్తూ ఇటీవల హైకోర్టు ప్రాథమికంగా పలు మార్గదర్శకాలు సూచిస్తూ ఆదేశించినప్పటికీ ప్రభుత్వంలో చలనం రాలేదు. హైకోర్టు సూచించిన ప్రాథమిక మార్గదర్శకాలు ఇలా.. » హాస్టల్ భవనం చుట్టూ సోలార్ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్‌తో ప్రహరీ నిర్మించాలి. తప్పనిసరిగా గేటు ఏర్పాటు చేయాలి. » హాస్టల్ ప్రాంగణంలో రాకపోకలను పర్యవేక్షించడంతో పాటు వాటిని ఎంట్రీ, ఎగ్జిట్ రిజిస్టర్‌లో నమోదు చేయాలి. » హాస్టల్ ప్రవేశ మార్గం, కారిడార్లు, కామన్ ఏరియాలు వంటి చోట్ల విద్యార్థుల వ్యక్తిగత గోపత్యకు భంగం కలగకుండా సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. అనధికారికంగా ఆ కెమెరాలను ఆపరేట్ చేయకుండా చర్యలు తీసుకోవాలి. » మరుగుదొడ్లను శుభ్రంగా నిర్వహించాలి. తగిన నీటి సదుపాయం కల్పించాలి. » భద్రతా సిబ్బంది సహా మొత్తం సిబ్బంది నేపథ్యాన్ని సమగ్రంగా పరిశీలన చేయాలి. తరచూ శిక్షణ, అవగాహన సెషన్లు ఏర్పాటు చేయాలి. » సిబ్బంది ముఖ్యంగా ఆడ పిల్లలతో సన్నిహితంగా మెలిగే వారికి లింగ సమానత్వం గురించి, సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా తగిన శిక్షణ ఇవ్వాలి. తద్వారా సమస్య ఏదైనా ఎదురైనప్పుడు ఆడ పిల్లలు ధైర్యంగా ముందుకు వచ్చే సురక్షిత వాతావరణం కల్పించడం సాధ్యమవుతుంది. ళీ సిబ్బందికి స్పష్టమైన ప్రవర్తనా నియమావళిని నిర్ధేశించాలి. దుష్ప్రవర్తన, అసభ్య ప్రవర్తన, వేధింపులకు ఆస్కారం లేకుండా చూడాలి. ప్రవర్తనా నియమావళిని అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలి. » హాస్టల్ వాతావరణానికి అలవాటు పడేలా, వ్యక్తిగత సమస్యల నుంచి బయట పడేలా ఆడ పిల్లలకు మానసిక వైద్యులను అందుబాటులో ఉంచాలి. ఆత్మరక్షణకు వర్క్‌షాపులు నిర్వహించండి » హాస్టళ్లన్నీ జాతీయ శిశు సంరక్షణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ప్రతి చోట పోక్సో చట్టం అమలయ్యేలా చూడాలి. పోక్సో చట్టం కింద విధించే శిక్షల గురించి అందరికీ కనిపించే చోట పోస్టర్లు ఏర్పాటు చేయాలి. ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ఫిర్యాదు చేసేలా వ్యవస్థ ఉండాలి. » తల్లిదండ్రులు, స్థానిక అధికారులు, విద్యా నిర్వహకులు కలిసి ఆడ పిల్లలకు మద్దతుగా నిలిచే వ్యవస్థను సృష్టించాలి. ఆడ పిల్లలు తమను తాము రక్షించుకునేందుకు వీలుగా ఆత్మ రక్షణకు సంబంధించిన వర్క్‌షాపులను తరచూ నిర్వహించాలి. దీని వల్ల అభద్రతా పరిస్థితుల్లో ఆడ పిల్లలు మనోస్థైర్యంతో ధైర్యంగా ఉండే అవకాశం ఉంటుంది. » హాస్టళ్లలో సమ వయస్కులతో బృందాలను ఏర్పాటు చేయాలి. తద్వారా విపత్కర పరిస్థితుల్లో ఒకరి బాగోగులు మరొకరు చూసుకునే అవకాశం ఉంటుంది. భద్రత చర్యలు సమర్థవంతంగా అమలవుతున్నాయా లేదా అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. లోపాలు ఉంటే గుర్తించి సరిచేయాలి. » హాస్టళ్లలో ఉండే విద్యార్థులతో పాటు వారి కుటుంబాల నుంచి ఎప్పటికప్పుడు అభిప్రాయాలు తెలుసుకుంటూ ఉండాలి. తద్వారా మెరుగైన ఏర్పాట్లు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో సాయం చేసేందుకు వీలుగా చట్టాన్ని అమలు చేసే సంస్థలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉండాలి. ఈ చర్యలన్నింటి ద్వారా రెసిడెన్షియల్ హాస్టళ్లలో ఆడపిల్లల భద్రతకు పెద్దపీట వేసినట్లు అవుతుంది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా సమగ్ర, ఆదేశ పూర్వక మార్గదర్శకాల రూపకల్పనకు వీలుగా ఈ తీర్పు కాపీనిమహిళ, శిశు సంక్షేమ శాఖకు పంపాలని రిజిస్ట్రీని ఆదేశిస్తున్నాం.