వైయ‌స్ జగన్‌కు ప్రాణహాని ఉంది

ప్రాణహాని విషయంలో తాజా నివేదికను విశ్లేషించాం

అందుకే జెడ్‌ ప్లస్‌ భద్రత కొనసాగించాలని సిఫారసు చేశాం 

వైయ‌స్ జగన్‌ను చచ్చే వరకు కొట్టాలన్న అయ్యన్నపాత్రుడి సంభాషణ స్పీకర్‌ కాక ముందుది 

అయ్యన్న ఇప్పుడు స్పీకర్‌గా రాజ్యాంగ పదవిలో ఉన్నారు 

ఆ వీడియోను పరిగణనలోకి తీసుకోకండి 

వైయ‌స్ జగన్‌ సొంత వాహనాన్ని బుల్లెట్‌ ప్రూఫ్‌గా మార్చుకునేందుకు అనుమతిచ్చాం 

హైకోర్టుకు నివేదించిన సెక్యూరిటీ రివ్యూ కమిటీ 

ఈ కౌంటర్‌కు సమాధానం ఇస్తామన్న జగన్‌ న్యాయవాది 

విచారణను 13కి వాయిదా వేసిన హైకోర్టు 

 అమరావతి:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రాణహాని ఉందని రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూ కమిటీ (ఎస్‌ఆర్‌సీ) అంగీకరించింది. ప్రాణహాని విషయంలో తాజా నివేదికను విశ్లేషించిన తరువాతే వైయ‌స్ జగన్‌కు జెడ్‌ ప్లస్‌ భద్రత కొనసాగించాలని సిఫారసు చేశామని ఆ కమిటీ హైకోర్టుకు వివరించింది. 

వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల్లో మాత్రమే ఓడిపోయారని, ఆయన ఇంకా బతికే ఉన్నారని, చచ్చే వరకు కొట్టాలంటూ నర్సీపట్నం ఎమ్మెల్యే, శాసన సభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, మరో టీడీపీ నేత మధ్య సాగిన సంభాషణ కూడా నిజమేనని అంగీకరించింది. ఇవి అయ్యన్నపాత్రుడు స్పీకర్‌ కాక ముందు మాట్లాడిన మాటలని తెలిపింది. 

ఆ వీడియోను పరిగణనలోకి తీసుకోవద్దని చెప్పింది. ఈ సంభాషణకు, వైఎస్‌ జగన్‌కు ప్రాణహాని ఉందనేందుకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. వైయ‌స్‌ జగన్‌ సొంత వాహనమైన టయోటా ఫార్‌చ్యూనర్‌కు బుల్లెట్‌ ప్రూఫ్‌ చేసుకునేందుకు అనుమతినిచ్చామని పేర్కొంది. 

ప్రాణహాని నేపథ్యంలో నాటి భద్రత పునరుద్ధరణకు వైయ‌స్ జగన్‌ పిటిషన్‌
తనను అంతమొందించడమే ప్రస్తుత కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఈ నేపథ్యంలో తనకున్న ప్రాణహానిని పరిగణనలోకి తీసుకోకుండా భద్రతను భారీగా కుదించేసిందంటూ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ ఏడాది జూన్‌ 3 నాటికి తనకు ఉన్న భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, ఎస్‌ఆర్‌సీని ఆదేశించింది. 

ఈ ఆదేశాల మేరకు ఎస్‌ఆర్‌సీ తరఫున ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ (ఐఎస్‌డబ్ల్యూ) డీఐజీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎస్పీ ఎస్‌.నచికేత్‌ విశ్వనాథ్‌ కౌంటర్‌ దాఖలు చేశారు. భద్రత విషయంలో జగన్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ బొప్పూడి వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి గురువారం మరోసారి విచారణ జరిపారు. 

కోర్టు ఆదేశాల మేరకు కౌంటర్‌ దాఖలు చేసినట్లు హోంశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది కేఎం కృష్ణారెడ్డి చెప్పగా..  కౌంటర్‌ బుధవారం సాయంత్రం అందజేశారని, తాము సమాధానం (రిప్లై) ఇస్తామని జగన్‌ తరఫు న్యాయవాది చింతల సుమన్‌ తెలిపారు. దీంతో న్యాయమూర్తి తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. నిర్దిష్టంగా వాయిదా తేదీ ఇవ్వాలని సుమన్‌ కోరడంతో న్యాయమూర్తి విచారణను ఈ నెల 13కి వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.

ఎస్‌ఆర్‌సీ కౌంటర్‌లోని ముఖ్యాంశాలు
‘వైయ‌స్ జగన్‌మోహన్‌­రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎల్లో బుక్‌ ప్రకారం జెడ్‌ కేటగిరీ భద్రత ఉండేది. ముఖ్యమంత్రి అయిన తరువాత దానిని జెడ్‌ ప్లస్‌ కేటగిరీకి మార్చి 58 మందితో భద్రత కల్పించాం. ఈ ఏడాది జూలై 16న  కమిటీ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారికి హోదా ఆధారిత భద్రత కల్పించాలని, ఓడిపోయిన వారికి హోదా ఆధారిత భద్రతను తొలగించాలని సిఫారసు చేశాం. 

అలాగే వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డికి జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత కొనసాగించాలని కూడా సిఫారసు చేశాం. వైయ‌స్ జగన్‌ ఎమ్మెల్యే కాబట్టి ఆయన భద్రత బాధ్యతలను డీఎస్‌పీకి అప్పగించాం. జగన్‌ భద్రత విషయంలో అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. ప్రస్తుతం కల్పిస్తున్న భద్రత సరిపోదని చెప్పేందుకు వైయ‌స్ జగన్‌ ఎలాంటి ఆధారాలను చూపలేదు. ప్రాణహాని ఉందనేందుకు వైయ‌స్ జగన్‌ ఎలాంటి ఆధారాలు చూపలేదు. 

భద్రతను 59కి కుదించిన తరువాతే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇటీవలి కాలంలో ఆయనకు ప్రాణహాని కలిగించే ఘటనలేవీ జరగలేదు. ఎక్స్‌ప్లోజివ్‌ డివైజెస్‌ వినియోగం ఉన్న చోటే జామర్లను అనుమతిస్తాం. అలాంటి ప్రాంతాలకు వైయ‌స్ జగన్‌ వెళితే అప్పుడు లభ్యతను బట్టి జామర్లు ఏర్పాటు చేస్తాం’ అని నచికేత్‌ విశ్వనాథ్‌ తన కౌంటర్‌లో పేర్కొన్నారు. ఈ వివరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వైయ‌స్ జగన్‌ పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు.  

Back to Top