ఒంగోలు: నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో దారుణంగా విఫలమైన కూటమి ప్రభుత్వం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా విపక్ష వైయస్ఆర్‌సీపీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు ఆక్షేపించారు. తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు పదే పదే వైయస్ కుటుంబంపై బురద జల్లుతూ చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దిశలోనే ఎప్పుడో రెండేళ్ల క్రితం జరిగిన విజయమ్మ కారు ఘటన వెనుక కుట్ర కోణం అంటూ మరో విష ప్రచారానికి పూనుకోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు. తాము కూడా చంద్రబాబు, పవన్‌కళ్యాన్ కుటుంబాల్లో జరిగిన ప్రమాదాలు, వివాదాలను బయటకు లాగితే తట్టుకోలేరని హెచ్చరించారు. ఎవ్వరితో అయినా సఖ్యత ఉందా?: చంద్రబాబుకు ఇటీవలి వరకు నందమూరి కుటుంబంతో ఏ మాత్రం సఖ్యత లేదని, ఇప్పటికీ తన సొంత కుటుంబ సభ్యులతో సఖ్యత లేదని తెలిపారు. గత ఎన్నికలకు కొన్నాళ్ల ముందు వరకు చంద్రబాబుకు ఆయన వదిన పురంధీశ్వరి, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో పడేది కాదన్న సుధాకర్‌బాబు, బావమరిది హరికృష్ణతోనూ చాలాకాలం వివాదం కొనసాగిన విషయాన్ని గుర్తు చేశారు. చివరకు తన రక్తం పంచుకు పుట్టిన తమ్ముడు రామ్మూర్తినాయుడుతో కూడా చంద్రబాబుకి సఖ్యత లేదని, అసలు ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో చెప్పాలని కోరారు. ఎవ్వరితోనూ సయోధ్య లేని చంద్రబాబు, వైయస్ కుటుంబ వ్యవహారాలపై విమర్శలు చేయడం ఎందుకని నిలదీశారు. మరి అవి కూడా కుట్రలేనా?: ఎప్పుడో రెండేళ్ల క్రితం జరిగిన విజయమ్మ కారు ప్రమాదాన్ని హత్య కుట్రగా చిత్రీకరిస్తూ, దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబు, ఆ పార్టీ వైఖరిని మాజీ ఎమ్మెల్యే తీవ్రంగా తప్పుబట్టారు. రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ, ఆయన కుమారుడు జానకిరామ్ దుర్మరణం, ఎన్నికల ప్రచారం చేసి తిరిగి వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కారు కూడా రోడ్డు ప్రమాదానికి గురి కావడం, చివరకు ఇటీవల చంద్రబాబు ఇంట్లో ఒక మహిళ ఆత్మహత్య.. అవన్నీ కుట్రలేనా? అని సూటిగా ప్రశ్నించారు. వాటన్నింటి వెనక చంద్రబాబు హస్తముందని అనుమానించాల్సి వస్తుందని అన్నారు. ఇంకా టీడీపీ సీనియర్ నాయకులు ఎర్రన్నాయుడు, లాల్ జాన్ బాషా కారు ప్రమాదాల్లో చనిపోవడం కూడా కుట్రేనా? అని సుధాకర్‌బాబు నిలదీశారు. బాబూ, నీవేం ఆస్తులు పంచి ఇచ్చావ్?: షర్మిలమ్మకు జగన్ రాజకీయంగా పార్టీలో స్థానం ఇవ్వలేదని, ఆస్తుల్లో వాటా ఇవ్వలేదని విమర్శించిన చంద్రబాబు.. తన ఇద్దరు చెళ్ళెళ్లకు, తమ్ముడికి ఇచ్చిన ఆస్తులెన్ని? హెరిటేజ్ కంపెనీలో ఇచ్చిన షేర్లు ఎన్నో బయట పెట్టాలని సుధాకర్‌బాబు డిమాండ్ చేశారు. మా దళిత నాయకులపై అన్యాయంగా కేసులు: షర్మిలమ్మకు రక్షణ కల్పిస్తామన్న పవన్‌కళ్యాణ్, ఆయన వల్లే తనకు ప్రాణ హాని ఉందని అన్న కూతురు ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక చేస్తున్న డైవర్షన్ డ్రామాలు ఇకనైనా కట్టిపెట్టడం మంచిదని హితవు పలికారు. సూపర్‌సిక్స్ హమీలు అమలు చేయలేకపోయినా, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి వైయస్సార్‌సీపీ దళిత నాయకులపై కేసులు పెట్టడంలో మాత్రమే చంద్రబాబు సక్సెస్ అయ్యారని దుయ్యబట్టారు. మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు, మాజీ మంత్రి మెరుగు నాగార్జున, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ల విషయంలో కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని సుధాకర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.