సహన కుటుంబానికి వైయ‌స్ జ‌గ‌న్ ఆర్థిక‌సాయం

రూ.10 లక్షల చెక్కును అందించిన మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు

గుంటూరు జిల్లా: సహన తల్లిదండ్రులకు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా కల్పించారని, ఆయన ప్రకటించిన పది లక్షల రూపాయల ఆర్థిక సాయం చెక్కును సహన కుటుంబులు సభ్యులకు అందించామని వైయ‌స్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి అంబటిరాంబాబు తెలిపారు. తెనాలిలో టీడీపీ రౌడీ షీటర్ నవీన్ దాడిలో  మృతి చెందిన సహన కుటుంబ సభ్యులకు అంబటి రాంబాబు స్థానిక వైయ‌స్ఆర్‌సీపీ నేతలతో కలిసి శనివారం పది లక్షల రూపాయల చెక్కును అందించారు. 

ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ..సహన ఘటన చాలా దారుణమైనది. దళిత మహిళని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆస్పత్రిలో సరైన వైద్యం కూడా సకాలంలో అందించలేకపోయారు. సహన హత్య కేసులో ముగ్గురు నిందితులు ఉన్నట్లు ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేవలం ఒక్కరినే అరెస్ట్ చేశారు. మిగిలిన ఇద్దరినీ రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. 

ముద్దాయిలు తెలుగుదేశం పార్టీకి చెందినవారు. తెనాలిలో జనసేన పార్టీకు సంబంధించిన మంత్రి ఉన్నారు. ఇప్పటివరకు సహన ఘటనపై ఆయన స్పందించలేదు. రాష్ట్రంలో మహిళలను దారుణంగా మానభంగాలు చేస్తూ హత్యలు చేస్తున్నా ఎవరూ మాట్లాడటం లేదు. సహన హత్య కేసులో మిగిలిన ఇద్దరు నిందితులను కూడా వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సహన కుటుంబానికి  వైయ‌స్ఆర్‌సీపీ తరపున అండగా ఉంటామ‌ని  అంబ‌టి రాంబాబు తెలిపారు. 

Back to Top