మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే.. అప్పుడు వీళ్లందరికీ జైలే  

వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆగ్ర‌హం

 నాలుగున్నర నెలల్లో రాష్ట్రంలో వరుసగా అఘాయిత్యాలు 

చంద్రబాబు బాధ్యత తీసుకుని ప్రజలకు క్షమాపణలు చెప్పాలి

ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగిన వైయ‌స్‌ జగన్‌  

గుంటూరులో సహానా, బద్వేల్‌లో దస్తగిరమ్మ కుటుంబసభ్యులకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పరామర్శ  

ఏకంగా 77 మంది మహిళలు, పిల్లలపై అత్యాచారాలు 

వీరిలో ఏడుగురి హత్య.. ఐదుగురు ఆత్మహత్య  

దోషులకు సర్కార్‌ వత్తాసు.. దారుణంగా క్షీణించిన శాంతి భద్రతలు 

అందుకు సహానా దారుణ హత్యే ప్రత్యక్ష ఉదాహరణ 

ఆమె శరీరంపై కందిపోయిన గుర్తులు.. ప్రైవేట్‌ పార్టుల్లో గాయాలు 

నిందితుడు నవీన్‌కు బాబే స్వయంగా కండువా కప్పుతున్నారు  

ప్రభుత్వం నుంచి స్పందన కరువు.. రెడ్‌బుక్‌ అమలులో పోలీసులు 

దళితులు, పేదలంతా మా వారే.. వారికి తోడుగా ఉంటాను  

హత్యాచార బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల సాయం 

 రాష్ట్రంలో జరిగిన ప్రతి ఘటనకు సంబంధించి ప్రభుత్వం తరఫున చంద్ర­బాబు క్షమాపణ చెప్పాలి. ప్రతి బాధితుడి వద్దకు మంత్రిని పంపించి రూ.10 లక్షలు డబ్బు ఇచ్చి, ఇటువంటి తప్పు ఇంకోసారి జరగనివ్వబోమని లెంప­లేసుకోవాలి. ఇలా చేయకపోతే చంద్రబాబు చరిత్ర హీనుడవుతాడు. అత్యాచారం.. ఆపై హత్యకు గురైన చీరాల నియోజకవర్గంలో సుచరిత, నందికొట్కూరు నియోజకవర్గంలో వాసంతి, పొన్నూరు నియోజకవర్గంలో శైలజ, సూళ్లూరుపేట నియోజకవర్గంలో అనికాకుమారి, పాలకొల్లులో కలిశెట్టి అనసూయ, బద్వేల్‌లో దస్తగిరమ్మ, తెనాలి నియోజకవర్గంలో సహానా కుటుంబాలకు చంద్రబాబు ఇచ్చినా ఇవ్వకపోయినా.. వైఎస్సార్‌సీపీ రూ.10 లక్షలు చొప్పున ఇచ్చి తోడుగా ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్న మేమే రూ.10 లక్షలు ఇస్తున్నప్పుడు... ప్రభుత్వంలో ఉన్న మీరు బాధ్యత తీసుకుని ఏమేం చేయగలుగుతారో చెప్పండి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు సిగ్గు తెచ్చుకోవాలి. ఈ ప్రభుత్వం ఏం చేసినా, చేయకపోయినా బాధ పడాల్సిన అవసరం లేదు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే. అప్పుడు వీళ్లందరినీ ఏరి ఏరి జైళ్లలో పెట్టే కార్యక్రమం చేస్తాం. 
– వైయ‌స్‌ జగన్ 

నవీన్‌తో పాటు కొంత మంది కలిసి మృగాలుగా ప్రవర్తించారు. ఆ చెల్లి (సహానా) శరీరం నిండా కందిపోయిన మచ్చలు కనిపిస్తున్నాయి. లైంగికంగా వేధించడమే కాకుండా ప్రైవేట్‌ పార్టుల్లో కూడా దెబ్బలు ఉన్నాయి. ఆమె ప్రైవేటు పార్టులలో బ్లీడింగ్‌ కనిపిస్తున్నప్పుడు ఆ దిశగా ఎందుకు చర్యలు లేవు? ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏమిటి? మేము తోడుగా ఉన్నామని చెప్పాల్సిన ధర్మం రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందనే భరోసా ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? కళ్లెదుట వాస్తవాలు కనిపిస్తున్నప్పుడు ఎందుకు ఈ విషయాలన్నీ దాచి పెట్టే కార్యక్రమం చేస్తున్నారు?

తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడు ఈ పని చేసినందుకు సిగ్గు పడాల్సింది పోయి.. నిస్సిగ్గుగా ఆ వ్యక్తిని కాపాడుకోవడానికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇంతకన్నా హేయమైన పని ఏమైనా ఉంటుందా? మీరు ఏ తప్పు చేసినా మద్దతుగా మేముంటామని సాక్షాత్తు చంద్రబాబునాయుడు దగ్గరుండి ప్రోత్సహిస్తుండటం వల్లే రాష్ట్రంలో అఘాయిత్యాలు మితిమీరి­పోయాయి. రెడ్‌బుక్‌ రాజ్యాంగ పాలనలో రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలు ధైర్యంగా బయటకు వచ్చి తిరగలేని పరిస్థితి నెలకొంది. 
– వైయ‌స్‌ జగన్‌

 ‘రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలు బతికే పరిస్థితి లేకుండా పోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 77 మందిపై అత్యాచారాలు జరిగాయి. వీరిలో ఏడుగురు హత్యకు గురి కాగా, ఐదుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలుపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. మహిళల రక్షణను గాలి కొదిలేసింది. మనవాడైతే పర్వాలేదు.. ఏం చేసినా చెల్లుబాటవుతుందనే ధోరణి వల్ల తెలుగుదేశం పార్టీ నేతల అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికైనా మేలుకొని జరిగిన ప్రతి ఘటనకు ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని వైయ‌స్ఆర్‌సీపీ  అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 

దారుణంగా లైంగిక వేధింపులకు గురై, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సహానా కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించారు. ఆస్పత్రిలోని మార్చురీకి వెళ్లి సహానా మృతదేహానికి నివాళి అర్పించారు. ఘటన జరిగిన తీరు, వైద్యం.. తదితర వివరాలను ఆమె కుటుంబ సభ్యులను, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సహానా కుటుంబ సభ్యులకు పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. వైయ‌స్ఆర్‌సీపీ నుంచి ‘హత్యా’చార బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఆర్థిక సాయం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

వాస్తవాలను ఎందుకు దాస్తున్నారు?
⇒ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయికి దిగజా­రాయో చెప్పేందుకు ఇక్కడ నా దళిత చెల్లి పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. చేసిన వాడు మనవాడైతే చాలు.. వాడు ఏం చేసినా పర్వా­లేదని కవర్‌ చేయడానికి, దొంగ కేసులు పెట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం అండగా ఉంది. నవీన్‌ అనే వ్యక్తి చంద్రబాబుతో కలిసి దిగిన ఫొటోలు ఉన్నాయి. స్థానిక ఎంపీతో చాలా సన్నిహితంగా ఉన్న పరిస్థితి. ఫొటోలూ కనిపిస్తున్నాయి.

⇒ ఇలాంటి వ్యక్తి సహానా పని చేస్తున్న ప్రదేశా­నికి వచ్చి, ఆమెను కారులో ఎక్కించుకుని వెళ్లాడు. అతనితోపాటు కొంతమందితో కలిసి మృగాలుగా ప్రవర్తించారు. ఆ చెల్లి శరీరం నిండా కందిపోయిన మచ్చలు కనిపిస్తున్నాయి. శారీరకంగా వేధించడమే కాకుండా ప్రైవేట్‌ పార్టుల్లో కూడా దెబ్బలు ఉన్నాయి. లైంగికంగా కూడా వేధించినట్లు కనపడుతోంది. ఆమె ప్రైవేటు పార్టులలో బ్లీడింగ్‌ కనిపిస్తున్నప్పుడు ఆ దిశగా ఎందుకు చర్యలు లేవు? 

⇒ దాడి తర్వాత జీజీహెచ్‌లో పడేసి.. ఆమె కుటుంబ సభ్యులు వచ్చే సరికి జారుకు­న్నాడు. అప్పుడు అక్కడ నవీన్‌తో మరో ఇద్దరు ఉన్నారని తల్లిదండ్రులు చెబుతు­న్నారు. ఎప్పుడైనా ఇలాంటి ఘటన జరిగిన­ప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏమిటి? మేము తోడుగా ఉన్నామని చెప్పాల్సిన ధర్మం రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? తప్పు చేసిన వాడు ఎవరైనా, ఎలాంటి వాడైనా చట్టానికి అతీతుడు కాదు. కచ్చితంగా శిక్ష పడుతుందనే భరోసా ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?  

⇒ ఎవరైనా కూడా ప్రభుత్వం నుంచి వచ్చి తప్పు జరిగిందమ్మా.. క్షమించమని కోరు­తున్నాం.. అని ఎందుకు అడుగలేకపోతు­న్నారు? అన్ని రకాలుగా ఆదుకుంటూ మంచి పరిహారం ఇచ్చి ఎందుకు తోడుగా నిలబడలే­క­పో­తు­న్నారు? నా పక్కనే ఆ పాప తల్లి ఉంది. వాళ్ల చెల్లి ఉంది. వీళ్లు చెబు­తున్నా, ఎవరూ పట్టించుకోని పరిస్థితి ఎందుకు వచ్చింది?

⇒ నేను వస్తున్నానని తెలిశాక ఆలపాటి రాజా వచ్చా­డట. అంతకు ముందు ఎవరూ రాలే­దు. తెనాలి ఎమ్మెల్యే, మంత్రి మనోహర్‌ కనీసం చూడడానికి రాలేదు. హోం మంత్రి­గానీ, ఇంకొ­­కరు గానీ, కనీసం స్పందించిన పరిస్థి­తులు లేవు. ఆ ఫొటోల్లో నిందితుడు నవీన్‌కు సాక్షాత్తు చంద్రబాబు కండువా కప్పుతా ఉన్నా­డు. గుంటూరు ఎంపీకి అత్యంత ఆప్తు­డు. వెనకేసుకు తిరిగారు. ఇలాంటి వ్యక్తిని ప్రభుత్వం వెనుకేసుకు వస్తోంది. జరిగిన తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది. తప్పుడు ప్రచారం చేయాలని చూస్తోంది.  

చంద్రబాబు ప్రోత్సాహంతోనే ఇలా..
⇒ చంద్రబాబు నిందితులను వెనకేసుకొస్తుండటం వల్లే రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు ప్రతి చోటా జరుగుతున్నాయి. బద్వేల్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాక పెట్రోలు పోసి నిప్పంటించారు. 

⇒ శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు బాలికలను అతిదారుణంగా బర్త్‌ డే పార్టీ అని తీసుకెళ్లి కూల్‌ డ్రింక్స్‌లో మందు కలిపి తాగించి అత్యాచారం చేశారు. చేసింది శ్రీకాకుళం జిల్లా పలాసాలో టీడీపీ నేతల పిల్లలు. ఏం చేసినా మమ్మల్ని తాకలేరన్న ధీమాతో ఇద్దరు ఆడపిల్లల్ని బర్త్‌ డే పార్టీ అని చెప్పి తీసుకెళ్లి మందు కలిపి అత్యాచారం చేసిన ఘటన. జరిగిన దారుణాన్ని ఒప్పుకొని క్షమాపణ చెప్పాల్సింది పోయి ప్రభుత్వం ఏం చేస్తోంది? అక్కడ కూడా పంచాయితీ చేయడానికి ప్రయత్నిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మంత్రులు రంగంలోకి దిగి దాన్ని మాఫీ చేయాలని చూస్తున్నారు.

⇒ పిఠాపురంలో తెలుగుదేశం నాయకురాలి భర్త 16 ఏళ్ల యువతికి మత్తు మందు ఇచ్చి, ఆటోలో ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడ చెత్త కాగితాలు ఏరుకునేందుకు వచ్చిన వ్యక్తి ఆ బాలిక ప్రాణాలు కాపాడారు. లోకేశ్‌తో, అచ్చెన్నాయుడుతో ఈ పెద్ద మనిషి ఫొటోలు అందరూ చూశారు. ఈ ఘటన జరిగింది డెప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ నియోజకవర్గం. కనీసం ఆయన ఈ పాప ఇంటికి పోయా­రా? ఆ కుటుంబాన్ని పరామర్శించారా? అని అడుగుతున్నా. 

⇒ హిందూపురంలో దసరా పండుగ రోజు అత్తాకోళ్లలపై గ్యాంగ్‌రేప్‌ చేస్తే, మూడు రోజులైనా అరెస్టు చేయాలనే ఆలోచన రాలేదు. అక్కడి ఎమ్మెల్యే బాలకృష్ణ.. ముఖ్యమంత్రికి బావమరిది. వియ్యంకుడు కనీసం చూడడానికి కూడా పోలేదు. 

⇒ అనకాపల్లి జిల్లా రాంబొట్ల మండలం కుప్పగంజిపాలెంలో 9వ తరగతి చదువుతున్న బాలికను టీడీపీ నాయకుడు సురేష్‌ నరికి చంపేశాడు. అంతకు ముందు తనను వేధిస్తున్నాడని ఆ అమ్మాయి కేసు పెడితే, అరెస్టు అయి జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చాడు. మళ్లీ బెది­రించడం మొదలు పెట్టాడు. దీనిపై బాలిక తల్లి­దండ్రులు పోలీసులకు ఫిర్యా­దు చేసినా.. రెడ్‌బుక్‌ పాలనలో నిమగ్న­మైన­వారు ఈ దారుణాన్ని అరికట్టలేకపో­యారు. చివరికి సురేష్‌ అనే ప్రేమోన్మాది ఆ పాపను దారుణంగా చంపేశాడు.

ఏ తప్పు చేసినా సర్కారు మద్దతు
⇒ రాష్ట్రంలో ఇంతటి దారుణ పరిస్థితులు కనిపిస్తుంటే ఈ ప్రభుత్వం ఏమైనా పట్టించుకుంటోందా? ఈ రెడ్‌బుక్‌ పాలనలో టీడీపీకి చెందిన వారు ఏ తప్పు చేసినా, మీరు తప్పు చేయండి.. మేం వెనకేసుకు వస్తాం.. మీకు ఏమీ కాదు.. మేము సపోర్టుగా ఉంటామని సాక్షాత్తు చంద్రబాబు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు. 

⇒ పోలీసులు న్యాయంగా దర్యాప్తు చేస్తే, అన్ని వాస్తవాలు బయటకొస్తాయి. ఈ తల్లి (సహానా అమ్మ) 14 ఏళ్లుగా అంగన్‌వాడీ టీచర్‌. నేను పేదలు, దళితులకు తోడుగా ఉంటాను. పేదలు, దళితులంతా మా వారేనని ధైర్యంగా చెబుతాను. పేదలకు తోడుగా ఉన్నామని ప్రభుత్వం చెప్పాలి. కానీ, ఈ ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. పైగా మా పార్టీ వారిని నిందించడం సరైనదేనా? ఆ తల్లికి తోడుగా నిలబడినందుకు మాపై నిందలు వేయడం సబబేనా? 

⇒ ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, వరదు కళ్యాణి, మురుగుడు హనుమంతరావు, చంద్రగిరి ఏసురత్నం, కల్పలతారెడ్డి, మాజీ మంత్రులు విడదల రజిని, మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు అన్నాబత్తుని శివకుమార్, కోన రఘుపతి, పార్టీ నేతలు నూరిఫాతిమా, అంబటి మురళీకృష్ణ, మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు, డిప్యూటీ మేయర్‌ డైమండ్‌ బాబు పాల్గొన్నారు.   

YSRCP President YS Jagan Fires On CM Chandrababu At Guntur

Back to Top