అమరావతి: 2024 ఎన్నికల సమయంలో టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ హామీలు అమల్లోకి వస్తే ఐదేళ్లలో సరాసరిన ప్రతి కుటుంబానికీ రూ.6 లక్షల వరకూ అదనపు ఆదాయం సమకూరుతుంది. 18 నుంచి 59 ఏళ్ల వయసు మహిళలు కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికీ నెలకు రూ.1,500 వంతున ఇస్తాం. ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంత మంది ఉంటే అంత మందికీ తలకు రూ.15 వేలు ఇస్తాం. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. జిల్లా వరకూ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సమకూరుస్తాం అంటూ చంద్రబాబు , కూటమి నేతలు ఊదరగొట్టారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరు నెలలైనా హామీల ఊసెత్తడం లేదు. సూపర్ సిక్స్ హామీలను ఎప్పటి నుంచి అమలు చేస్తామనిగానీ.. నిర్దిష్ట కేటాయింపులుగానీ లేకుండానే సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం 2024–25 పూర్తి స్థాయి బడ్జెట్ సమర్పించింది. సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి బడ్జెట్‌లో ఎక్కడా ప్రతిబింబించకపోగా భారీగా పన్నుల మోత, అప్పుల వాతలు మాత్రం ప్రస్ఫుటంగా కనిపించాయి. సూపర్ సిక్స్ హామీలు డకౌట్ కావడంతో కూటమి సర్కారు తొలిసారిగా ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీ మోత సామెతను తలపించింది. గతేడాది ఈ హామీలను విస్మరించడంతో వైయస్ఆర్‌సీపీ పోరుబాట పట్టింది. ఇప్పటికే రైతు సమస్యలు, కరెంటు చార్జీల పెంపుపై నిరసన కార్యక్రమాలు చేపట్టింది. వైయస్ఆర్‌సీపీ పోరాటంలో ప్రజలు స్వచ్చందంగా పాల్గొని నిరసన గళం వినిపించారు. ఈ క్రమంలో కొత్తేడాదైనా సూపర్ సిక్స్ హామీలపై కూటమి ప్రభుత్వం స్పష్టత నిస్తుందా అంటూ వైయస్ఆర్‌సీపీ ఎక్స్ వేదికగా ప్రశ్నించింది. రిచ్చెస్ట్ సీఎం.. దేశంలోనే ధనిక సీఎం చంద్రబాబు నాయుడని ఏడీఆర్ రిపోర్టు బయటపెట్టింది. రూ.935 కోట్లతో చంద్రబాబు దేశంలోనే రిచ్చెస్ట్ సీఎంగా నిలిచారు. పూర్ టు రిచ్ అనే చంద్రబాబు హామీ పేదలకు చెబితే బాగుంటుంది. పాల వ్యాపారంతో వేల కోట్లు ఎలా సంపాదించవచ్చో, ఆ కిటుకు చెబితే అందరూ ధనవంతులవుతారు. లబ్ధిదారుల బకాయిలు రూ.60 వేల కోట్లు: – సూపర్ సిక్స్ పథకాల రూపంలో ఇచ్చిన హామీలు అమలు చేయని కూటమి ప్రభుత్వం గడిచిన ఆరు నెలల్లో రూ.60 వేల కోట్లు బకాయి పడింది. – రాష్ట్రంలో 2 కోట్ల మంది మహిళలకు నెలకు రూ.1500 ఇవ్వాల్సి ఉంది. దీనికి నెలకు రూ.3 వేల కోట్లు కావాలి. అదంతా బకాయి. ఏకంగా రూ.18 వేల కోట్లకు చేరింది. – పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఇస్తామన్న రూ.20 వేలు ఇవ్వలేదు. ఆ బకాయి రూ.10 వేల కోట్లకు చేరింది. – తల్లికి వందనం పథకం కింద ఎంత మంది పిల్లలుంటే అందరికీ ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. ఆ విధంగా 80 లక్షల మంది లబ్ధిదారులకు రూ.12 వేల కోట్లు బకాయి పడ్డారు. – నిరుద్యోగ భృతి కింద 20 లక్షల మంది యువతకు నెలకు రూ.600 కోట్ల చొప్పున, ఈ ఆరు నెలల్లో రూ.3600 వేల కోట్లు బకాయి పడ్డారు. – ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.3 వేల కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతిదీవెన బకాయిలు రూ.900 కోట్లు, దీపం పథకం సిలిండర్లు.. ఇలా అన్ని లెక్క తీస్తే లబ్ధిదారులకు ఈ ప్రభుత్వం దాదాపు రూ.60 వేల కోట్లకుౖ పైగా బకాయి పడింది. ‘సూపర్’.. బాదుడు! కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడం, రకరకాల మాయ హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడం, ఆ తర్వాత ఓట్లేసిన ప్రజలనే ముంచేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. మాట మార్చడం.. మాట తప్పడమే ఆయన నైజం. ఇటీవలి ఎన్నికల్లో ఆయనిచ్చిన సూపర్ సిక్స్ హామీలు, కరెంటు చార్జీలు పెంచబోమంటూ చెప్పిన మాటలను తుంగులో తొక్కేశారు. కూటమి పాలనలో ప్రజలపై భారీ విద్యుత్ చార్జీల భారం పడింది. రూ.9,412.50 కోట్ల ఇంధన సర్దుబాటు చార్జీలను ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేయనుంది. దీని ద్వారా ప్రతి యూనిట్‌కు రూ.0.92 అదనపు భారం ప్రజలపై పడుతుంది. కూటమి ప్రభుత్వం దీపావళి పండుగకే రాష్ట్ర ప్రజలపై రూ.6,072.86 కోట్ల భారం వేసింది. ఈ చార్జీలను యూనిట్‌కు రూ.1.27 చొప్పున ఈ నెల నుంచి వసూలు చేస్తున్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా భారీ ఆదాయం పొందేందుకు రిజిస్ట్రేషన్ విలువ భారీగా పెంచారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూముల కొనుగోలుపై 15 నుంచి 20 శాతం వరకు పెంచుతున్నట్లు ఇటీవల మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. యువతకు మోసం.. సూపర్ సిక్స్‌లో తొలి హామీగా నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు చొప్పున భృతి ఇస్తామని చెప్పినప్పటికీ బడ్జెట్‌లో అసలు ఆ విషయాన్నే ప్రస్తావించకుండా యువతను ఎప్పటిలాగానే చంద్రబాబు సర్కారు మోసం చేసింది. అన్నదాతకు అన్యాయం: రైతులకు పెట్టుబడి సాయం కోసం అన్నదాతా సుఖీభవ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో నిర్దిష్టంగా బడ్జెట్‌లో చెప్పకుండా తూతూ మంత్రంగా రూ.1,000 కోట్లు విదిలించి మసిబూసి మారేడుకాయ చేశారు. మహిళలకు మాయ: సూపర్ సిక్స్‌లో భాగంగా 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామన్న హామీ గురించి బడ్జెట్‌లో కనీసం ప్రస్తావించకుండా మహిళలను దగా చేశారు. స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని సూపర్ సిక్స్‌లో చెప్పిన హామీని ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది నిర్దిష్టంగా వెల్లడించకుండా వివిధ కార్పొరేషన్ల పేరుతో కొన్ని చోట్ల, జెండర్ బడ్జెట్‌లో కొన్ని చోట్ల కేటాయింపులు చేసినట్లు చూపించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై ఇంతవరకు స్పష్టత లేదు. ఈ పాటికి సీఎంగా వైయస్ జగన్ ఉండి ఉంటే.. : కొత్త ఏడాది రాష్ట్ర ప్రజలు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనను గుర్తు చేసుకుంటున్నారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం గత ఐదేళ్లుగా అమలు చేసిన సంక్షేమ పథకాలను కూటమి సర్కార్ నిలుపుదల చేసింది. ఈ పాటికి సీఎంగా తాను ఉండి ఉంటే..నవరత్నాల పథకాలన్నీ వచ్చి ఉండేవని గుర్తు చేసుకుంటున్నారు ఏప్రిల్‌లో వసతి దీవెన, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు. మే లో విద్యాదీవెన, ఉచిత పంటల బీమా, రైతు భరోసా, మత్స్యకార భరోసా, మత్స్యకారులకు డీజిల్‌పై సబ్సిడీ. జూన్‌లో బడులు తెరవగానే జగనన్న అమ్మ ఒడి. జూలైలో విద్యాకానుక, వాహనమిత్ర, కాపునేస్తం, చిరు వ్యాపారులకు జగనన్న తోడు. వివిధ పథకాల్లో మిగిలిపోయిన లబ్ధిదార్లకు చెల్లింపు. ఆగస్టులో విద్యాదీవెనలో మరో త్రైమాసిక చెల్లింపు. వాహనమిత్ర. సెప్టెంబరులో వైయస్ఆర్ చేయూత. అక్టోబరులో వైయస్ఆర్ రైతు భరోసా రెండో విడత. నవంబరులో జగనన్న విద్యాదీవెన. రైతులకు వైయస్ఆర్ సున్నా వడ్డీ రుణాలు.. బాబు రాకతో అవన్నీ క్లోజ్. డిసెంబరులో ఈబీసీ నేస్తం. లా నేస్తం. వివిధ పథకాల్లో మిగిలిపోయిన లబ్ధిదార్లకు చెల్లింపులు. జనవరిలో వైయస్ఆర్ రైతు భరోసా, వైయస్ఆర్ ఆసరా, జగనన్న తోడు, వైయస్ఆర్ పెన్షన్ కానుక. ఫిబ్రవరిలో జగనన్న విద్యాదీవెన, జగనన్న చేదోడు. మార్చిలో జగనన్న దీవెన, ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలు. పద్ధతి ప్రకారం క్యాలెండర్ ఇచ్చి, అన్నీ పక్కాగా అమలు చేశారని రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.