తొక్కిసలాటపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి

మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌

ఘటనను హైకోర్టు సీజే సుమోటో కేసుగా స్వీకరించాలి

మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి

డీఎస్పీని సస్పెండ్‌ చేస్తే చేసిన పాపం మాసిపోతుందా?

మిగతా సెంటర్లలో తొక్కిసలాటలకు చర్యలుండవా? 

టీటీడీ ఛైర్మన్, ఈఓల జోలికి సీఎం ఎందుకు వెళ్లడం లేదు?

వారి సమన్వయ లోపంతోనే ప్రమాదమని స్పష్టంగా తెలుస్తోంది

చంద్రబాబు ఎందుకంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు?

సూటిగా ప్రశ్నించిన బొత్స సత్యనారాయణ

సమీక్ష నిర్వహించడానికి కూడా సీఎంకి తీరిక లేదా?

దేవాదాయ శాఖ మంత్రి ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదు

పవన్‌కళ్యాణ్‌ క్షమాపణలు చెప్పి ఊరుకుంటే ఎలా?

ఆయన ప్రాయశ్చిత్త దీక్ష ఎప్పుడు చేస్తారో చెప్పాలి

ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన బొత్స సత్యనారాయణ

విశాఖపట్నం: తిరుపతి తొక్కిసలాట ఘటనపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జీతో విచారణ జరిపించాలని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌, శాస‌న‌ మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. అదే విధంగా ఈ ఘటనను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటో కేసుగా స్వీకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక, వరుస ఘటనలతో తిరుమల ప్రతిష్టపై భక్తుల్లో నమ్మకం సన్నగిల్లుతోందని, దాన్ని కాపాడాలని న్యాయమూర్తిని కోరారు. టీటీడీ ఛైర్మన్, ఈవో మధ్య సమన్వయ లోపంతోనే ఘటన జరిగిందని పత్రికలు, డిప్యూటీ సీఎం చెబుతున్నా వారిపై చర్యలు తీసుకోవడంలో సీఎం చంద్రబాబు ఎందుకంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బొత్స ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ క్షమాపణ చెప్పినంత మాత్రాన పోయిన భక్తులు ప్రాణాలు తిరిగి రావని, ఆయన ప్రాయశ్చిత్త దీక్ష ఎప్పుడు చేస్తారో చెప్పాలని బొత్స సత్యనారాయణ ప్ర‌శ్నించారు. విశాఖపట్నంలోని క్యాంప్‌ ఆఫీస్‌లో మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం:
    వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవదేవుడి దర్శన టోకెన్ల కోసం వచ్చిన భక్తుల్లో ఆరుగురు చనిపోయిన ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. సరైన ఏర్పాట్లు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిన కారణంగానే తొక్కిసలాట జరిగి ఆరు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 40 మంది క్షతగాత్రులయ్యారు. భక్తులు చనిపోవడం దైవ నిర్ణయం అంటూ.. ఈ దుర్ఘటనపై టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు స్పందించిన తీరు మరింత బాధ కలిగించింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం టికెట్లు ఇచ్చే కార్యక్రమం విషయంలో ప్రభుత్వం, టీటీడీ అధికారులు కనీసం రివ్యూ మీటింగ్‌ నిర్వహించి ఉంటే ఇలాంటి ఘోరం జరిగేది కాదు. 8వ తేదీ వరకు కుప్పంలోనే ఉన్న సీఎం చంద్రబాబు కానీ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా టికెట్ల పంపిణీపై కార్యక్రమంపై సమీక్ష చేసి ఉండాల్సింది. 

హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి:
    ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేసినంత మాత్రాన బాధితులకు న్యాయం జరిగినట్టు కాదు. ఏపీ హైకోర్టు ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గత రెండు రోజులుగా పత్రికల్లో వచ్చిన వార్తలను పరిగణనలోకి తీసుకుని సుమోటో కేసుగా స్వీకరించి విచారణ జరపాలి. తిరుమల దేవస్థానం విశిష్టతను కాపాడాలన్నా, భక్తుల్లో ఉన్న అభద్రతను పోగొట్టాలన్నా పటిష్టమైన విచారణ చేపట్టాలని వైయ‌స్ఆర్‌సీపీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.    అలాగే పవన్‌కళ్యాణ్‌ క్షమించమని చెప్పినంత మాత్రాన సరిపోదు. ఆయన ప్రాయశ్చిత్త దీక్ష ఎప్పుడు చేస్తున్నారో చెప్పాలి.

ఆ ఇద్దరిపై ఏ చర్యలుండవా?:
    టీటీడీ ఛైర్మన్, ఈవోల మధ్య సమన్వయం లేదని, క్షతగాత్రుల పరామర్శకు వచ్చిన ముఖ్యమంత్రి ఎదుటే వారిద్దరూ ఒకరినొకరు దూషించుకున్నారని టీడీపీ అనుకూల పత్రిక బ్యానర్‌ వార్త ప్రచురించింది. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ సైతం ఇదే విషయం చెప్పారు. కానీ వారిపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నారు?
    తొమ్మిది కేంద్రాల్లో దర్శనం టికెట్ల పంపిణీ చేపడితే మూడు చోట్ల జరిగిన తొక్కిసలాటల్లో భక్తులు ప్రాణాలు కోల్పోయారు. కానీ ప్రభుత్వం మాత్రం ఒక సంఘటనలోనే డీఎస్పీని బాధ్యుడ్ని చేస్తూ సస్పెండ్‌ చేసి చేతులు దులిపేసుకుంది. మూడు చోట్ల జరిగిన తొక్కిసలాటల్లో 40 మంది వరకు క్షతగాత్రులయ్యారు. మరో కౌంటర్లో ఒకరు చనిపోయారు. వాటి విషయంలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలి.  

ఎవరిది బాధ్యత?:
    పది రోజులు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడమే తప్పు అన్నట్టు నిన్న చంద్రబాబు చెప్పడం, తమ ప్రభుత్వ చేతకానితనాన్ని ఒప్పుకోవడమే. వైఎస్సార్సీపీ హయాంలో నిర్వహించినప్పుడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. భక్తులు ప్రశాంతంగా దేవదేవుణ్ని దర్శించుకున్నారు.
    తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో హడావుడి చేసిన పవన్‌ కళ్యాణ్, ఇప్పుడెందుకు క్షమాపణలు చెప్పేసి ఊరుకున్నారు. టీటీడీ ఛైర్మన్, ఈఓ ప్రెస్‌మీట్‌ పెట్టి క్షమాపణలు చెప్పాలని ఆయన చెబుతున్నాడు. క్షమాపణలు చెప్పినంత మాత్రాన వారు చేసిన పాపం కరిగిపోతుందా, పోయిన భక్తుల ప్రాణాలు తిరిగొస్తాయా?.
    ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దానికి సీఎం, డిప్యూటీ సీఎం, టీటీడీ ఛైర్మన్, ఈవోలలో ఎవరు బాధ్యత వహిస్తారు?. 

పరామర్శకు వెళితే క్షుద్ర రాజకీయాలు:
    తొక్కిసలాటలో గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి, ఆ కుటుంబాలకు అండగా నిలవాలని మా నాయకులు వైయస్‌ జగన్‌ బయలుదేరితే అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. నడిరోడ్డుపై కాన్వాయ్‌ నిలిపి వేయడంతో, ఆయన కొంత దూరం నడిచి వెళ్లారు. ఆయన ఆస్పత్రికి రాకముందే తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని బలవంతంగా డిశ్చార్జ్‌ చేయాలని గట్టిగా ప్రయత్నించారు. కానీ, వారు ప్రతిఘటించడంతో ఏమీ చేయలేకపోయారు.
    జగన్‌గారు తొక్కిసలాట బాధితులతో అన్ని వివరాలు ఆరా తీసి, పరామర్శిస్తే.. దానిపైనా విషం చిమ్ముతున్నారు. జగన్‌గారు పరామర్శకు వెళితే క్షతగాత్రులకు కవర్లు ఇచ్చి మాట్లాడించారని కూటమి పార్టీలు క్షుద్ర రాజకీయాలు చేస్తున్నాయి. ఇంతకన్నా దారుణం ఇంకెక్కడైనా ఉందా? పవిత్ర స్థలంలో అపశృతి జరిగినప్పుడు చింతించాల్సింది పోయి ఇంతలా దిగజారిపోయి వ్యాఖ్యలు చేయడాన్ని ఎవరూ హర్షించరు. 
    ప్రమాదం జరిగినప్పుడల్లా అధికారులను బాధ్యులను చేస్తూ వారు వైయ‌స్ఆర్‌సీపీ అనుకూలురంటూ వ్యాఖ్యలు చేయడం ఫ్యాషనైంది. వారు మీరు నియమించుకున్న అధికారులన్న విషయం మర్చిపోవద్దని బొత్స స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు.

Back to Top