అమరావతి: దేశంలో వ్యవసాయ ఆధారిత కుటుంబాలు పెరుగుతున్నాయి. కరువు, వరదలు వంటి వాతావరణ ప్రతికూలతలు జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నప్పటికీ గ్రామాల్లో అత్యధిక కుటుంబాలకు వ్యవసాయమే ప్రధాన జీవనోపాధిగా కొనసాగుతోంది. 2016–17 సంవత్సరంలో నిర్వహించిన నాబార్డు రూరల్ ఫైనాన్సియల్ సర్వే ప్రకారం దేశంలో వ్యవపసాయ కుటుంబాలు 48 శాతం ఉండగా, 2021–22లో అది 57 శాతానికి పెరిగింది. అంటే దేశం మొత్తం మీద వ్యవసాయ కుటుంబాలు 9 శాతం మేర పెరిగినట్లు సర్వే స్పష్టం చేసింది. ఏపీతో సహా 20 రాష్ట్రాల్లో 50 శాతానికి పైగా కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నట్లు సర్వే వెల్లడించింది. 2016–17లో నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ కుటుంబాలు 34 శాతం ఉంటే, 2021–22లో 53 శాతానికి పెరిగాయి. అంటే రాష్ట్రంలో వ్యవసాయ కుటుంబాలు 19 శాతం మేర పెరిగినట్లు స్పష్టం అవుతోంది. కేరళ, గోవా రాష్ట్రాల్లో అత్యధిక కుటుంబాలు వ్యవసాయేతర కార్యకలాపాలపై ఆధారపడి జీవిస్తున్నట్లు సర్వే పేర్కొంది. కేరళ, గోవా రాష్ట్రాల్లో అత్యధికంగా 82 శాతం వ్యవసాయేతర కుటుంబాలే ఉన్నాయి. కేవలం 18 శాతం కుటుంబాలే ఈ రెండు రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబాలున్నట్లు సర్వే వెల్లడించింది.