విక‌లాంగుల పింఛ‌న్ల‌ను తొల‌గిస్తే ఊరుకోం

వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్య‌క్షుడు, జెడ్పీచైర్మన్ మజ్జి శ్రీనివాసరావు 

విజ‌య‌న‌గ‌రం: విక‌లాంగుల పింఛ‌న్ల పునఃప‌రిశీల‌న పేరుతో పింఛ‌న్ల‌ను తొల‌గిస్తే ఊరుకోబోమ‌ని జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్‌, వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్య‌క్షుడు, భీమిలి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిశీల‌కులు మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు అన్నారు. సామాజిక పింఛ‌న్ల‌ను త‌గ్గించే కార్య‌క్ర‌మంలో భాగంగానే ప్ర‌భుత్వం ఈ పునః ప‌రిశీల‌న కార్య‌క్ర‌మానికి తెర‌లేపింద‌ని  విమ‌ర్శించారు. మంచానికే ప‌రిమిత‌మై క‌ద‌ల్లేని స్థితిలో ఉన్న విక‌లాంగుల పింఛ‌న్ల‌ను ఇటీవ‌లే ఇంటింటికీ వెళ్లి పునఃప‌రిశీల‌న చేయ‌డంతో, ఏళ్ల త‌ర‌బ‌డి పింఛ‌న్ పొందుతున్న క‌ద‌ల్లేని స్థితిలో ద‌య‌నీయ ప‌రిస్థితిలో ఉన్న‌ అటువంటి పింఛ‌న్‌దారులంతా ఇప్పుడు త‌మ పింఛ‌న్ ఉంటుందో, ఊడుతుందో తెలియ‌క ఆందోళ‌న చెందుతున్నార‌ని పేర్కొన్నారు. ఇప్పుడు రూ.6వేలు పింఛ‌న్ పొందుతున్న విక‌లాంగుల పింఛ‌న్ల‌ను గురువారం నుంచీ జిల్లా వ్యాప్తంగా ప్రారంభించడానికి అధికారులు నిర్ణ‌యించ‌డంతో, వీరిలో కూడా ఆందోళ‌న మొద‌ల‌య్యింద‌ని చెప్పారు. అధికారులు ఆసుప‌త్రుల్లో ఏర్పాటు చేసిన ప‌రిశీల‌నా కేంద్రాల‌కు వ‌చ్చి త‌నిఖీలు చేయించుకోవాల‌ని చెప్ప‌డాన్ని ఆయ‌న తీవ్రంగా ఖండించారు. ఎంతోమంది శారీర‌క విక‌లాంగులు త‌మంత‌ట తాము ఈ కేంద్రాల‌కు చేరుకోవ‌డం ఎంతో వ్య‌య ప్ర‌యాస‌ల‌తో కూడుకున్న‌ద‌ని పేర్కొన్నారు. అలాగే మాన‌సిక విక‌లాంగుల‌ను సైతం కేంద్రాల‌కు తీసుకురావ‌డం చాలా క‌ష్ట‌మ‌ని చెప్పారు. ఈ ప్ర‌క్రియ విక‌లాంగుల‌ను అన్నివిధాలా బాధించేదేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. జిల్లాలో ఏ ఒక్క అర్హత ఉన్న విక‌లాంగుని పింఛ‌న్‌ను తొల‌గించినా, త‌మ పార్టీ త‌ర‌పున పెద్ద ఎత్తున ఆందోళ‌న చేస్తామ‌ని మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు ప్ర‌కటించారు.

Back to Top