చిల్ల‌ర‌ దుకాణాలు కూల్చ‌డం దారుణం

రాచ‌ప‌ల్లి బాధితుల‌కు వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌దర్శి గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి ప‌రామ‌ర్శ‌

అన్న‌మ‌య్య జిల్లా: ఎవ‌రికి ఇబ్బంది లేని స్థలంలో బ‌తుకు దెరువు కోసం ఏర్పాటు చేసుకున్న చిల్ల‌ర‌ దుకాణాల‌ను దౌర్జ‌న్యంగా తొల‌గించ‌డం దారుణ‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌దర్శి గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి మండిప‌డ్డారు.   రామాపురం మండలం రాచపల్లె గ్రామ‌ సచివాలయం, పాఠశాల సమీపంలో గణేష్ కుమార్ రెడ్డి  జీవ‌నోపాధి కోసం ఏర్పాటు చేసుకున్న చిల్లర దుకాణాన్ని తొలగించి నేలమట్టం చేసిన శిథిలాలను బుధవారం శ్రీకాంత్ రెడ్డి  పరిశీలించి, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.  ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. నిబంధనలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రే  అధికార నివాసం ఏర్పాటు చేసుకున్నారన్నారు. ఎవ‌రికీ ఏ అడ్డు లేని ప్రాంతంలో  బ‌తుకు తెరువు కోసం చిన్న అంగడి పెట్టుకున్న వారిపై రాజకీయ కోణంతో కొట్టివేయడం సమంజసం కాదన్నారు. గతంలో ఇలాంటి పనులు ఎన్నడు  జరగలేదన్నారు. బాధితుల కన్నీరు చూసినప్పుడు చాలా బాధేస్తుందన్నారు. ఎప్పటి నుంచో వారు చిన్న అంగడి పెట్టుకున్న వారు గతంలోనే పాఠశాలకు 2 ఎకరాల సొంత  భూమిని వితరణగా ఇచ్చార‌ని తెలిపారు. ఇప్పటికీ 46 సెంట్ల భూమి వాళ్ళ పేరు మీద రెవెన్యూ రికార్డులలో ఉందన్నారు.  పదిమందికి విద్యనందించే  పాఠశాల కోసం ఉచితంగా  స్థలం అందించిన వారిపైనే  రాజకీయ కోణం ఆపాదించి బ‌తుకుతెరువు కోసం పెట్టుకున్న చిన్న దుకాణాన్ని తొలగించి నష్టం కలుగ చేయడం దుర్మార్గమన్నారు. అక్ర‌మ నిర్మాణాలు తొల‌గించే ద‌మ్ము అధికార పార్టీకి ఉందా అని చాలెంజ్ చేశారు. రైతులు పొలాల్లోకి మట్టి తోలు కుంటుంటే వారిని  ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. తప్పులు చేస్తున్న వారిని,  అన్యాయంగా దురాగతాలకు పాల్పడుతున్న వారికి భవిష్యత్ లో గుణపాఠం తప్పదని శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. అనంత‌రం రాచపల్లెకు చెందిన వెంకట్రామరాజు ఇటీవల మోకాలుకు ఆపరేషన్ చేయించుకోవ‌డంతో ఆయ‌న్ను ప‌రామ‌ర్శించారు. 

Back to Top