విశాఖలో రూ.96 కోట్లతో క్రూయిజ్‌ బెర్త్‌

రాజ్యసభలో  వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
 

న్యూఢిల్లీ : సాగరమాల పథకం కింద విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌లోని ఔటర్‌ హార్బర్‌లో క్రూయిజ్‌ టెర్మినల్‌ బెర్త్‌, టెర్మినల్‌ భవనం నిర్మాణం కోసం పోర్టులు, షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖ 96 కోట్లు కేటాయించగా క్రూయిజ్‌ కమ్‌ కోస్టల్‌ కార్గో టెర్మినల్‌ నిర్మాణం కోసం పర్యాటక శాఖ 38 కోట్ల రూపాయలు కేటాయించినట్లు పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి గురువారం రాజ్యసభలో వెల్లడించారు. వైయ‌స్ఆర్‌సీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ పర్యాటక రంగాన్ని ప్రభావితం చేసే అంశాల్లో క్రూయిజ్‌ టూరిజం (నౌకా పర్యాటం) ఒకటని తమ మంత్రిత్వ శాఖ గుర్తించినట్లు చెప్పారు. సముద్రం, నదుల్లో నౌకా పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించినట్లు తెలిపారు.
స్వదేశ్‌ దర్శన్‌లో కోస్టల్‌ టూరిజం సర్క్యూట్‌ అభివృద్ధిని చేర్చి వాటికి అవసరమైన వసతుల అభివృద్ధి కోసం ఆయా రాష్ట్రాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు మంత్రి  కిషన్‌ రెడ్డి తెలిపారు. పోర్టులు, షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖ జాతీయ కార్యక్రమంగా చేపట్టిన సాగరమాల పథం ద్వారా దేశంలోని 7,500 కి.మీ పొడవైన తీర ప్రాంతాల అభివృద్ధి ద్వారా ఆర్థిక కార్యకలాపాలను ముమ్మరం చేయడంతోపాటు పర్యాటక రంగానికి కూడా ఈ ప్రాజెక్ట్‌ కింద కొత్త ఊపు వస్తుందని చెప్పారు. స్వదేశ్‌ దర్శన్‌ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ వద్ద హోప్‌ ఐలాండ్‌, కోరింగ వన్యమృగ సంరక్షణ కేంద్రం, పాసర్లపూడి, ఆదూరు, ఎస్‌.యానాం, కోటిపల్లి ప్రాంతాలలో పర్యాటక రంగానికి అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం 67 కోట్లు, నెల్లూరు జిల్లాలోని పులికాట్‌ సరస్సు, ఉబ్బలమడుగు జలపాతం, నేలపట్టు, కొత్తకోడూరు, మైపాడు, రామతీర్ధం, ఇస్కపల్లి వద్ద పర్యాటక వసతుల కల్పన కోసం 49 కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి వివరించారు.
 
వ్యవసాయ కార్మికుల సంఖ్య పెరిగింది
 దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో కార్మికుల సంఖ్య 42.5 శాతం నుంచి 45.6 శాతానికి పెరిగినట్లు గురువారం రాజ్యసభలో కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తెలి వెల్లడించారు.  ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ జూలై 2019 నుంచి జూన్‌ 2020 మధ్య నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌ఓ) నిర్వహించిన కార్మిక సర్వే ప్రకారం వ్యవసాయ రంగంలో కార్మికుల సంఖ్యలో పెరుగుదల కనిపించగా, అదే కాలంలో తయారీ రంగంలో కార్మికుల సంఖ్య 12.1 శాతం నుంచి 11.2 శాతానికి తగ్గినట్లు తెలిపారు. కోవిడ్‌ మహమ్మారి వ్యాప్తితో వలస కార్మికులు పెద్ద ఎత్తున తమ స్వగ్రామాలకు తరలి పోవడం, లాక్‌డౌన్‌ వలన కర్మాగారాలు తాత్కాలికంగా మూతపడటం ఇందుకు కారణాలుగా మంత్రి పేర్కొన్నారు.

Back to Top