పార్టీ వీడుతామన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం

వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు ఆళ్ల, పిల్లి స్పష్టీకరణ

వైయ‌స్ఆర్ కుటుంబం నాకు నీడనిచ్చిన కల్పవృక్షం

ఆర్ధికంగా కాకపోయినా విధేయతలో సంపన్నుడనే

నా రాజకీయ ప్రయాణం వైయ‌స్ఆర్ కుటుంబంతోనే

పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ప్రకటన

వైయ‌స్ జగన్ విజన్‌ నచ్చే రాజకీయాల్లోకి వచ్చాను

నా రాజకీయ జీవిత ప్రయాణమంతా ఆయనతోనే

వ్యక్తిగత అంశాలను రాజకీయాలతో ముడి సరికాదు

తేల్చి చెప్పిన ఆళ్ల అయోధ్యరామిరెడ్డి  

తాడేపల్లి: తాము పార్టీని వీడుతామని వస్తున్న వార్తలు, జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి స్పష్టం చేశారు. వైయ‌స్ఆర్ కుటుంబం తనకు నీడనిచ్చిన కల్పవృక్షం అన్న పిల్లి సుభాష్‌చంద్రబోస్‌.. తాను ఆర్థికంగా కాకపోయినా విధేయతలో సంపన్నుడినే అని, తన రాజకీయ ప్రయాణం వైయ‌స్ఆర్ కుటుబంతోనే అని స్పష్టం చేశారు. ఒకరిద్దరు మినహా మిగిలిన ఎంపీలంతా పార్టీలోనే ఉన్నారన్న ఆయన, అనివార్య కారణాల వల్లే ఇక్కడికి రాలేకపోయారని చెప్పారు. వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఎంపీలు ఆళ్ల ఆయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్ మీడియాతో మాట్లాడారు.

    వైయ‌స్ జగన్‌గారి విజన్‌ నచ్చే రాజకీయాల్లోకి వచ్చానన్న ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, తన రాజకీయ జీవిత ప్రయాణం కూడా ఆయనతోనే అని, వ్యక్తిగత విషయాలను ఎప్పుడూ రాజకీయాలతో ముడి పెట్టడం సరికాదని తేల్చి చెప్పారు.
    కాగా, వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో తనకు వైయ‌స్‌ జగన్‌గారు ఏనాడూ అన్యాయం చేయలేదని, అయినా తన మీద ఇలాంటి వార్తలు రావడం బాధాకరమని పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ చెప్పారు. తాను నిరంతరం ప్రజలతోనే ఉంటానని, కాబట్టి ఎలాంటి సందేహాలున్నా నేరుగా సంప్రదించాలని సూచించారు. ఈ రకమైన వార్తల ద్వారా వ్యక్తిత్వ హననానికి పాల్పడడం సరికాదని ఆగ్రహించారు.
    అధికారంలో లేకపోయినా.. పార్టీలోనూ, పదవుల విషయంలోనూ వైయ‌స్ జగన్‌గారు ఎప్పుడూ తన ప్రాధాన్యత తగ్గించలేదని, అధికారంలోకి వచ్చాక ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు. పదవుల కోసం తాను ప్రలోభాలకు లోనయ్యే వ్యక్తిని కానని వెల్లడించారు.
    వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన 11 మంది రాజ్యసభ సభ్యుల్లో 10 మంది పార్టీ వీడుతున్నారన్న వార్తలను ఆళ్ల అయోధ్యరామిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఒకరిద్దరు మినహా మిగిలిన ఎంపీలందరూ ఒకే తాటిపై ఉన్నారని ఆయన వెల్లడించారు. ప్రజలు తమ మీద ఉంచిన నమ్మకానికి అనుగుణంగా పని చేస్తామని చెప్పారు.
    సామాన్యుడి సంక్షేమంపై అద్భుతమైన విజన్‌ ఉన్న వైయ‌స్ జగన్‌గారితో కలిసి నడవాలనే తాను రాజకీయాల్లోకి వచ్చానని.. తన రాజకీయ జీవిత  ప్రయాణమంతా ఆయనతోనే అని, అయోధ్యరామిరెడ్డి స్పష్టం చేశారు. ఏ పార్టీ కూడా ఈ తరహా ఫిరాయింపులను ప్రోత్సహించరాదన్న ఆళ్ల, మీడియా కూడా తప్పుడు వార్తలతో వ్యక్తిత్వ హననానికి పాల్పడవద్దని కోరారు.

Back to Top