ప్ర‌తి కుటుంబ సంతోష‌మే ప్ర‌భుత్వ‌ ల‌క్ష్యం

నిరుపేద కుటుంబాల‌కు అండ‌గా ‘వైయస్‌ఆర్‌ బీమా’

బియ్యం కార్డుదారులందరికీ ఈ పథకం వర్తింపు

ఈ పథకంతో 1.41 కోట్ల కుటుంబాలకు లబ్ధి

ఇన్సూరెన్స్ కంపెనీల‌కు ఏడాదికి రూ.510 కోట్ల ప్రీమియం చెల్లిస్తున్నాం

కేంద్రం తప్పుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ప్రీమియం భరిస్తోంది

ప్రమాదవశాత్తు మరణిస్తే 15 రోజుల్లోపే బాధిత కుటుంబానికి ఇన్సూరెన్స్‌ సొమ్ము

గ్రామ సచివాలయాల ద్వారా తక్షణసాయంగా రూ.10 వేలు చెల్లిస్తాం

‘వైయస్‌ఆర్‌ బీమా’ ప్రారంభోత్సవంలో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తాడేపల్లి: ‘ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకునే ప్రభుత్వం మనది. అనుకోని ఆపద వస్తే ఆ కుటుంబం తల్లడిల్లిపోతుంది. ఆ కుటుంబంలో సంపాదించే వ్యక్తి లేని పరిస్థితుల్లో ఆ కుటుంబం ఎలాంటి ఇబ్బందులు పడకూడదని ఆలోచించి దూరదృష్టితో వైయస్‌ఆర్‌ బీమా పథకానికి శ్రీకారం చుడుతున్నాం’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇన్సూరెన్స్‌ ప్రీమియం కట్టే బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకున్నప్పటికీ నిరుపేద కుటుంబాలు ఇబ్బందులు పడకూడదని మానవతా దృక్పథంతో ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి భారాన్ని భరిస్తుందన్నారు. ఇదొక గొప్ప కార్యక్రమంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ‘‘వైయస్‌ఆర్‌ బీమా’’ పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. అంతకు ముందు లబ్ధిదారులను, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. 

సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..

‘గతంలో కేంద్ర ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లింపులో సగభాగం భరించేంది. కానీ, ఇప్పుడు కేంద్రం ఇన్సూరెన్స్‌ ప్రీమియం కట్టే బాధ్యత నుంచి తప్పుకున్నారు. అయినప్పటికీ భారం రాష్ట్ర ప్రభుత్వం మీదే పూర్తిగా పడుతుందని తెలిసినా కూడా.. బీమా పథకం నిర్వీర్యం అయితే ప్రజలు ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో, సంపాదించే వ్యక్తికి పొరపాటున జరగరానిది జరిగితే ఆ పేద కుటుంబం ఇబ్బందులు పడకూదనే ఉద్దేశంతో మానవతా దృక్పథంతో ఈ ప్రభుత్వం అడుగులు ముందుకువేస్తోంది. 

కేంద్రం ప్రభుత్వం ఈ పథకం నుంచి తప్పుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరించేందుకు ముందుకువచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు రూ.510 కోట్లు సంవత్సరానికి చెల్లిస్తుంది. ఇదొక గొప్ప పథకంగా నేను భావిస్తున్నాను. దాదాపుగా 1.41 కోట్ల మంది బియ్యం కార్డుదారుల కుటుంబాల్లోని పెద్దకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నాం. గ్రామ వలంటీర్లు సచివాలయాల్లో పేర్లను నమోదు చేయించి ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ అందిస్తారు. అనంతరం గ్రామ సచివాలయాల్లో ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ జాబితాను ప్రదర్శిస్తారు. ఇంకా ఎవరైనా పొరపాటున ఈ స్కీమ్‌లో చేరకపోయి ఉంటే వెంటనే నమోదు చేసుకోవచ్చు. 

18 నుంచి 50 సంవత్సరాల వయస్సు ఉన్నవారికి యాక్సిడెంట్‌ ఏదైనా జరిగి చనిపోతే రూ.5లక్షలు ఇన్సూరెన్స్‌ అమౌంట్‌ 15 రోజుల్లోపు బాధిత కుటుంబానికి అందుతుంది. ప్రమాదం జరిగి అంగ శాశ్వత వైకల్యం వస్తే రూ.5 లక్షల ఇన్సూరెన్స్‌ వర్తింపజేస్తారు. 51 నుంచి 70 సంవత్సరాల వయస్సు ఉన్నవారికి యాక్సిడెంటల్‌ డెత్త్‌ జరిగితే రూ.3లక్షలు వర్తింపజేస్తారు. యాక్సిడెంట్‌ వల్ల అంగవైకల్యం వస్తే రూ.3లక్షలు వర్తింపజేస్తారు. 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నవారు సహజ మరణం పొందితే రూ.2 లక్షలు వర్తిస్తుంది. పాక్షిక శాశ్వత అంగ వైకల్యం జరిగితే రూ.1.50 లక్షల ఇన్సూరెన్స్‌ వర్తిస్తుంది. ఎప్పుడూ లేని విధంగా లబ్ధిదారుల అకౌంట్‌లోకే డబ్బు జమ చేసే ఏర్పాట్లు చేశాం. ప్రభుత్వం ఇచ్చే రూ.510 కోట్లు బ్యాంకర్లకు వెళ్లిపోతుంది. ఈ వారం రోజుల సమయంలో 1.41 కోట్ల మంది లబ్ధిదారుల అకౌంట్ల నుంచే ఇన్సూరెన్స్‌ కంపెనీలకు బీమా ప్రీమియాన్ని బ్యాంకర్లు చెల్లిస్తారు. ఆ తరువాత ప్రతి లబ్ధిదారుడికి గ్రామ వలంటీర్‌ ఇన్సూరెన్స్‌ కార్డు ఇచ్చివెళ్తారు. 

ఆ తరువాత అనుకోని సంఘటన జరిగితే గ్రామ, వార్డు సచివాలయాలే రెఫరల్‌ పాయింట్‌గా నిలుస్తాయి. ఎవరికైనా పొరపాటున ఏదైనా జరిగితే బీమా మిత్ర, వలంటీర్ల సహాయం తీసుకోవచ్చు. ఎవరికైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్‌ డబ్బులు వచ్చేందుకు 15 రోజుల సమయం పడుతుంది. మనిషి చనిపోతే వెంటనే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ.10 వేలు తక్షణసాయం గ్రామ సచివాలయం అందజేస్తుంది. ఇది స్కీమ్‌లో లేకపోయినప్పటికీ కొత్తగా తీసుకువచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఈ పథకం ద్వారా ప్రజలకు మంచి జరగాలని, దేవుడు మంచి చేయాలని మనసారా ఆశిస్తూన్నా’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు. 
 

Back to Top