తాడేపల్లి: రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో క్లీన్ ఆంధ్రప్రదేశ్, జగనన్న కాలనీలు, విశాఖలో ప్రాధాన్యతా ప్రాజెక్టులపై సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పలు సూచనలు చేశారు. జగనన్న కాలనీల్లో రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్లు, తాగునీటి సరఫరా, కరెంటు, పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమాలకోసం, మొత్తంగా రూ.30,691 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా వేశారు. సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో కలిపి 33,406 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. జగనన్నకాలనీ పనుల్లో క్వాలిటీ అనేది చాలా ముఖ్యమైనదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతి పనిలో కూడా క్వాలిటీ కనిపించాలని అధికారులను వైయస్ జగన్ ఆదేశించారు. విశాఖలో ప్రాధాన్యతా ప్రాజెక్టులపై సీఎం సమీక్ష విశాఖలో ప్రాధాన్యతా ప్రాజెక్టులపై సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు, బీచ్ కారిడార్ ప్రాజెక్ట్, పోలవరం నుంచి గోదావరి జలాలను పైపులైన్‌ద్వారా విశాఖకు తరలింపు... మూడు పనులను శరవేగంగా ప్రారంభించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. నాలుగు వారాల తర్వాత మరోసారి సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. దీని తర్వాత మెట్రో ప్రాజెక్టుపై దృష్టిపెట్టాలని సీఎం అధికారులకు సూచించారు. విశాఖపట్నం నుంచి భీమిలి వరకూ ఇప్పుడున్న బీచ్‌రోడ్డు విస్తరణ, అలాగే భీమిలి నుంచి భోగాపురం వరకూ బీచ్ రోడ్డు నిర్మాణంపై సమావేశంలో చర్చించారు. ప్రతిపాదనలను సీఎంకు అధికారులు వివరించారు. రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పూర్తిచేయాలని సీఎం వైయస్ జగన్ సూచించారు. భూసేకరణతో కలుపుకుని భీమిలి నుంచి భోగాపురం వరకూ రోడ్డు నిర్మాణానికి దాదాపు రూ.1,167 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా వేసినట్టు వెల్లడించిన అధికారులు. బీచ్ కారిడార్ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదిక చేపట్టాలని సీఎం ఆదేశం. దేశంలో అందమైన రోడ్డుగా నిలిచిపోవాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. దీన్ని మొదట ప్రాధాన్యత పనిగా గుర్తించాలని సీఎం ఆదేశించారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణంపైనా కూడా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. విశాఖకు గోదావరి జలాలు పోలవరం నుంచి గోదావరి జలాలను విశాఖనగరానికి తరలింపుపై సీఎం సమీక్ష నిర్వహించారు. పైపులైన్‌ద్వారా నీటిని తరలించడంపైనా సీఎం సమీక్షించారు. రానున్న 30 ఏళ్ల కాలానికి విశాఖ నగరానికి నీటి అవసరాలను తీర్చేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. పైపులైన్ ప్రాజెక్ట్‌ను కూడా ప్రాధాన్యతగా చేపట్టాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్‌పై సీఎం సమీక్ష విశాఖ స్టీల్‌ప్లాంట్ గేట్ నుంచి భోగాపురం వరకూ మెట్రో ప్రతిపాదన సిద్ధం చేయాలని సీఎం వైయస్ జగన్ అధికారులకు సూచించారు. మొత్తంగా 76.9 కిలోమీటర్ల మేర నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం 53 స్టేషన్లు ఉండేలా ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. దీంతో పాటు 60.2 కి.మీ. మేర ట్రాం కారిడార్. మెట్రో, ట్రాం కలిపి 137.1 కి.మీ. కారిడార్, కేవలం మెట్రో నిర్మాణానికి దాదాపు రూ.14వేల కోట్లకుపైగా ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా చేశారు. ట్రాం సర్వీసులకు మరో రూ.6వేల కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అంచనా చేశారు. ట్రాం, మెట్రోల ఏర్పాటుకు మొత్తంగా రూ.20వేల కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అంచనా వివరాలను సీఎంకు అధికారులు తెలిపారు. మెట్రో, ట్రాం నిర్మాణ శైలిలో మంచి డిజైన్లు పాటించాలని సీఎం వైయస్ జగన్ సూచించారు. విశాఖ నగరానికి అందం తీసుకొచ్చేలా ఉండాలని, నగరానికి ఆభరణంలా ఉండాలని సీఎం వైయస్ జగన్ స్పష్టం చేశారు. సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, ముఖ్యమంత్రి ముఖ్యసలహాదారు నీలం సాహ్ని, రెవెన్యూశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ, పరిశ్రమలు, వాణిజ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, పురపాలక, పట్టణాభివృద్ధి స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై. శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్‌జైన్, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి కెవివి సత్యనారాయణ, ఏపీఎస్‌హెచ్‌సీఎల్ ఎండీ నారాయణ భరత్ గుప్తా, విశాఖ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ ఎన్ పి రామకృష్ణా రెడ్డి, స్వచ్ఛ ఆంధ్రా కార్పొరేషన్ ఎండీ పి సంపత్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.