తాడేపల్లి: ఆరోగ్యశ్రీ ఆస్పత్రులన్నింటిలో ఆరోగ్య మిత్రలను తప్పనిసరిగా నియమించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులను ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై సీఎం వైయస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ప్రిన్సిల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు పలు కీలక ఆదేశాలిచ్చారు. ఆస్పత్రుల్లో వైద్య సేవలు, సదుపాయాలకు ఇక గ్రేడింగ్ ఉంటుందని, 15 రోజుల్లోగా ప్రక్రియ అంతా పూర్తి కావాలని ఆదేశించారు. రోగులకు ఆరోగ్యమిత్రలు పూర్తిస్థాయిలో సేవలందించాలని, 104 కాల్ సెంటర్ మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు. హోంఐసోలేషన్‌లో ఉన్నవారికి మెడికల్ కిట్లను అందించాలని సూచించారు.