ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలి

వర్షాల వల్ల వచ్చే వ్యాధులపై దృష్టిపెట్టాలి

జరిగిన నష్టంపై వారం రోజుల్లో అంచనాలు పంపించాలి

కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశం

భారీ వర్షాలు, సహాయ చర్యలపై సీఎం సమీక్ష

తాడేపల్లి: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు.  భారీ వర్షాలు, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలతో జిల్లాల వారీగా వరద పరిస్థితులపై సమీక్షించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ నీలం సాహ్ని, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్‌ పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. అదే విధంగా రోడ్ల పునరుద్ధరణ పనులను వేగంగా చేపట్టాలని సూచించారు. వర్షాల వల్ల వచ్చే వ్యాధులపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి అవసరమైన సాయం అందించాలని, తాగునీటి సరఫరాపై దృష్టిపెట్టాలని సీఎం వైయస్‌ జగన్‌ సూచించారు. భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై వారం రోజుల్లో అంచనాలు పంపాలని ఆదేశించారు. 

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఇంకా ఏం మాట్లాడారంటే..

  •  వాయుగుండం నిన్ననే తీరం దాటింది కాబట్టి ఇబ్బంది లేదు.
  •  తెలంగాణలో భారీ వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజీకి భారీ వరద వస్తోంది.
  • శ్రీశైలం నుంచి 4 లక్షల క్యూసెక్కులు విడుదల. మరో 24 గంటల్లో ప్రభావం.
  • గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి.
  • విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ చాలా ముఖ్యం.
  • ఆ తర్వాత కాలువలు, చెరువుల గండ్లు పూడ్చడంతో పాటు, రహదారుల మరమ్మతు పనులు యుద్ధప్రాతిపదికన జరగాలి.
  • అన్ని చోట్లా రహదారులు బాగు చేసి, అందుబాటులోకి తేవాలి.
  •  వేర్వేరు జిల్లాలలో చనిపోయిన 10 మంది కుటుంబాలకు వెంటనే పరిహారం చెల్లించండి. అదే విధంగా వెంటనే నష్టం అంచనాలు వేయండి. వారం రోజుల్లో నష్టంపై అంచనాలు పంపండి.
  • తూర్పు గోదావరి జిల్లాలో ఏలేరు రిజర్వాయర్‌ వల్ల పిఠాపురంలో వరద వస్తోంది కాబట్టి, అవసరమైన ఆధునీకరణ చేపట్టండి.  వర్షాలు తగ్గాయి కాబట్టి, ఇంకాస్త అప్రమత్తంగా ఉండండి.
  •  విజయవాడలో ఇళ్లు ఖాళీ చేయించే వారికి తప్పనిసరిగా వసతి కల్పించాలి. వారందరికి పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి.
  • ప్రకాశం బ్యారేజీకి ఇంకా వరద వస్తోంది కాబట్టి, పూర్తి అప్రమత్తంగా ఉండండి. బ్యారేజీ వద్ద 7.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే వీలుంది. కాబట్టి ఆ మేరకు సిద్ధంగా ఉండండి.
  • రాయలసీమతో పాటు, శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు రిజర్వాయర్లు నింపడం, అక్కడనుంచి కాలువల ద్వారా ప్రతి చెరువులు నింపడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆ మేరకు ఒక కార్యాచరణ ప్రణాళిక కూడా సిద్ధం చేయండి.
  • చిత్తూరు జిల్లాలో 40 శాతం అధిక వర్షాలు కురిసినా, కేవలం 30 శాతం మాత్రమే ట్యాంకులు నిండడం పరిస్థితికి అద్దం పడుతోంది.  దీన్ని పూర్తిగా మార్చాలి, కురిసే ప్రతి నీటి బొట్టుని ఒడిసి పట్టడం, తద్వారా రిజర్వాయర్లు, చెరువులు నింపాలి. తద్వారా కరువు నివారణలో శాశ్వత పరిష్కారం చూడాలి.
  • కలుషిత నీరు లేకుండా మంచి తాగునీరు సరఫరా చేయాలి. ఎక్కడా వ్యాధుల ప్రబలకుండా తగిన జాగ్రత్తులు తీసుకోవాలి. ముఖ్యంగా డయేరియా వంటివి పూర్తిగా నివారించాలి.
  • ఆ మేరకు అన్ని పీహెచ్‌సీలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలి. క్లోరినేషన్‌ కూడా చేయాలి. 
  • వరదలు తగ్గాక పాము కాట్లు జరుగుతాయి కాబట్టి, జాగ్రత్తగా ఉండండి.
Back to Top