తాడేపల్లి: వికేంద్రీకరణతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, భవిష్యత్తులోనూ ప్రాంతీయ విద్వేషాలు వచ్చేందుకు ఆస్కారం ఉండదని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం అన్నారు. వీలైనన్ని తక్కువ నిధులతో మూడుచోట్ల 3 నగరాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. పాలన వికేంద్రీకరణకు సంబంధించి వైయస్ఆర్ సీపీ లీగల్ సెల్ ఆదివారం వెబినార్ నిర్వహించింది. ఆ సెల్ కన్వీనర్ ఎం.మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వెబినార్‌లో అజేయ కల్లం మాట్లాడారు. వెయ్యి కోట్లతో విశాఖ శివార్లలో పరిపాలనకు అవసరమైన భవనాలు నిర్మించవచ్చని, ఇందుకు భూమి అందుబాటులో ఉందని చెప్పారు. విశాఖకి కొంత బూస్ట్ ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో హైదరాబాద్‌కు పోటీగా తయారవుతుందన్నారు. వెయ్యి కోట్లతో కర్నూలులో హైకోర్టుకు భవనాలు, వసతులు కల్పిస్తే ఆ నగరం అభివృద్ధి చెందుతుందన్నారు. అసెంబ్లీని అమరావతిలోనే కొనసాగించడం ద్వారా ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలు కాపాడే అవకాశం ఉంటుందని చెప్పారు. అమరావతి ప్రాంతం వ్యవసాయాధారితమైనది కావడం వల్ల ఇక్కడ అందుకనుగుణమైన పరిశ్రమల ఏర్పాటుకు ఆస్కారం ఉందన్నారు. రాజధాని రైతుల ప్రయోజనాలు కాపాడతామన్నారు. 29 గ్రామాల్లో రోడ్లు, డ్రెయిన్లు వంటి మౌలిక వసతులు కల్పించాలని, వారికిచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ నేతృత్వంలో ఏర్పాటైన అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ నివేదికలో వికేంద్రీకరణ గురించి చెప్పారన్నారు. స్వయంపాలనకు వీలుగా పంచాయతీలకు యంత్రాంగం, నిధులు సమకూర్చాలని గాంధీజీ చెప్పారని, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ ప్రభుత్వం అదే చేస్తోందని తెలిపారు. రాజధాని పేరుతో కార్యకలాపాలన్నింటినీ ఒకేచోట చేయాలని ఎక్కడా లేదన్నారు. వికేంద్రీకరణతో సాంకేతికంగా 99.999 శాతంమంది ప్రజలకు ఇబ్బంది ఉండదన్నారు. బీసీజీ నివేదిక ప్రకారం అమరావతి నిర్మాణానికి లక్ష కోట్ల నుంచి లక్షన్నర కోట్లు ఖర్చవుతుందని, అంతచేసినా అది లాభదాయకం కాదన్నారు. ప్రభుత్వం తక్కువ ఖర్చుతో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేలా వికేంద్రీకరణను ప్రతిపాదించిందన్నారు.